దేవదేవుని బ్రహ్మోత్సవాలు

 

 

దేవదేవుని  బ్రహ్మోత్సవాలు 

 

 

పరమదైవమైన శ్రీ వేంకటేశ్వరునికి చతుర్ముఖ బ్రహ్మ జరిపించిన ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. శ్రీనివాసుని ప్రీత్యర్థంగా, ఆయన కుమారుడైన బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఉత్సవాలు కావడం వల్ల, వీటికి బ్రహ్మోత్సవాలనే పేరు వచ్చింది. నవ (తొమ్మిది) సంఖ్యకు- బ్రహ్మాభిదాఖ్య సంఖ్య అని ప్రసిద్ధి. ముందురోజున జరిగే అంకురారోపణం, ధ్వజారోహణం, చివరోజున జరిగే శ్రీ పుష్పయాగం- ఇవి మినహాయించగా మధ్యలో తొమ్మిది రోజులుగా జరిగే ఉత్సవాలు కనుక ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని నామాంకితం చేయబడిందని, ఆగమ శాస్త్ర ప్రమాణ వాక్యం.

 

 

ఈ బ్రహ్మోత్సవాలను శ్రీ వేంకటాచలేశ్వరుని అనుగ్రహం కోరి జరిపించడం వల్ల విధాతకు సకల మనోరథప్రాప్తి కలిగిందని కాబట్టి ఇవి బ్రహ్మత్సవాలుగా ప్రసిద్ధి చెందాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, సూర్యుడు కన్యారాశిలో ఉన్న సమయంలో జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతాయి. ఆ ప్రారంభ దినానికి ముందు రోజున మృత్తికా గ్రహణం, అంకురారోపణం, ధ్వజారోహణం జరుపబడతాయి. అదే రోజున ప్రప్రథమంగా శ్రీ వేంకటేశ్వరుని సేనానాయకుడైన శ్రీ విష్వక్సేన భగవానుని యథావిధిగా పూజిస్తారు. విష్వక్సేనుల వారిని చతుర్వీథుల ఉత్సవం పేరిట ఊరేగించి, తీసుకుని వస్తారు. విష్వక్సేనుడు దేవాలయానికి తిరిగివచ్చిన తర్వాత యాగశాలలో, మృత్తికా గ్రహణం అంకురారోపణం చేస్తారు

 

 

అలాగే ధ్వజరోహణం ఎలా చేస్తారంటే.. ఒక దృఢమైన నూతన వస్త్రంపైన శ్రీ వేంకటేశ్వరుని వాహనమైన గరుత్మంతుని చిత్రాన్ని లిఖిస్తారు. ఆ చిత్రించిన నూతన వస్త్రాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ధ్వజస్తంభ శిఖరాగ్రంపైన ఎగురవేస్తారు అర్చకులు. దీనినే ధ్వజారోహణం అంటారు. గరుత్మంతుడు తన ప్రభువైన శ్రీ వేంకటేశ్వరునికి జరగబోతున్న బ్రహ్మోత్సవాలకు ఊర్ధ్వలోకాలోని సకల దేవతా గణాలను విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నట్లుగా, ఆ సమయంలో వేదపండితులు మంత్రపఠనం చేస్తారు. ఆ విధంగా శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

అంకురార్పణ

 

 

 

స్వామివారి బ్రహ్మోత్సవాలు 'అంకురార్పణ'తో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల ఆరంభదినానికి ముందురోజుగానీ మూడు రోజులు, అయిదు రోజులు, ఏడు రోజులు, తొమ్మిదిరోజుల ముందుగానీ అంకురార్పణ జరుగుతుంది. ఇలా నిర్ధారితమైన రోజున, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకై స్వామివారి సేనాధిపతి విష్వక్సేనుడు, ఆలయంలో నైరుతిదిశలో ఉన్న వసంత మండపానికి విచ్చేస్తారు. ఆ తర్వాత, నిర్ణీత పునీత ప్రదేశంలో, భూదేవి ఆకారాన్ని లిఖించి, ఆ ఆకారమునందు లలాట, బాహు, స్తన ప్రదేశాలనుంచి మట్టిని తీసి, స్వామివారి ఆలయంలోకి వస్తారు. దీన్నే 'మత్సంగ్రహణం' అంటారు. యాగశాలలో, ఈ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో- శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవధాన్యాలను పోసి, పూజలు చేస్తారు.

 

 

ఈ కార్యక్రమానికంతా సోముడు(చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాళికలలోని నవధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. అందుకే ఈ వేడుకలన్నీ శుక్లపక్షంలో జరుగుతాయి. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞకుండాలను నిర్మిస్తారు. తర్వాత పూర్ణకుంభ ప్రతిష్ఠ జరుగుతుంది. పాళికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరుపోసి, అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇదే 'అంకురార్పణ' అయింది.

మొదటి రోజు


ధ్వజారోహణం

 

 

వేంకటేస్వరుడికి ముందుగా ఊరేగింపుకు వచ్చే బ్రహ్మరధం
బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం 'ధ్వజారోహణం'. ఆరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాలసేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయసన్నిధిలోని ధ్వజస్తంభంమీద పతాకావిష్కరణ చేస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక కొత్త వస్త్రంమీద గరుడుడి బొమ్మ చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు. దీన్ని 'గరుడధ్వజపటం' అంటారు. దీన్ని ధ్వజస్తంభంమీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. గరుడధ్వజపటాన్ని ఊరేగించి, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి, ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో- గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి చేరుస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే- సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రం. అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకూ ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానం అంది విచ్చేసిన దేవ, రాక్షసగణాలకు, వారివారి నిర్ణీత స్థలాలను కేటాయించి, పద్ధతి ప్రకారం, వారి నియమాల ప్రకారం నైవేద్యం రూపంలో బలిని సమర్పిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే.