నేటినుండి తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
నేటినుండి తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
శ్రీనివాసుని దేవేరులుగా అలమేలు మంగ, లక్ష్మి, భూదేవి, శ్రీదేవి, పద్మావతి, అండాళ్, గోదాదేవి, బీబీ నాంచారి వంటి అనేక పేర్లు పేర్కొనబడడంవల్ల సామాన్యభక్తులలో కొంత అయోమయం నెలకొంటుంది. సంప్రదాయ గాధలను బట్టి ఈ దేవతలను గురించి ఇలా చెప్పవచ్చును. శ్రీదేవి (లక్ష్మి), భూదేవి ఇరువురూ శ్రీమహావిష్ణువును వరించిన దేవతలు. ఉత్సవ మూర్తియైన మలయప్పస్వామి ఉభయ నాంచారులతో కూడి ఉన్నాడు.
వెంకటేశ్వర మహాత్మ్యం కధ (తిరుమల క్షేత్రం స్థలపురాణం) ప్రకారం వైకుంఠంలో భృగుమహర్షి చర్యవలన కోపించి లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువపూదండలతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా అలమేలు మంగ - (తమిళంలో "అలర్" అనగా పువ్వు. "మేల్" అనగా పైన. "మంగై" అనగా అందమైన స్త్రీ - "అలమేలు" అనగా "పద్మంలో ప్రకాశించున సుందరి")
మరొక కధనం ప్రకారం త్రేతాయుగంలో సీత బదులు రావణుని చెర అనుభవించిన వేదవతిని మరుజన్మలో పెండ్లాడుతానని శ్రీరాముడు చెప్పాడు. ఆ వేదవతియే ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించి శ్రీనివాసుని వరించి పెండ్లాడినది. శ్రీనివాసుడు శిలగా అయినపుడు లక్ష్మీదేవి కొల్హాపూర్‌లో వెలసింది. పద్మావతి అలమేలుగా తిరుచానూరులో వెలసింది.
భూదేవియే గోదాదేవిగా అవతరించి శ్రీరంగనాధుని వరించింది. ఈమెను ఆండాళ్, ఆముక్త మాల్యద (తాల్చి ఇచ్చిన తల్లి), చూడి కొడుత నాచియార్ అని కూడా అంటారు. భూదేవి స్వరూపమే సత్యభామ అనికూడా పురాణ కధనం గమనించాలి.
కొండపై వెలసిన దేవుడు "బీబీ నాంచారి" అనే ముస్లిం కన్యను పెండ్లాడాడని ఒక కధనం. లక్ష్మీదేవియే ఈ అమ్మవారిగా జన్మించి ముస్లిముల ఇంట పెరిగిందట! తమ ఆడపడుచుపై గౌరవంతో కొండలరాయుని దర్శించుకొన్న ముస్లిం సోదరులను చూసి హైదర్ ఆలీ తిరుమల కొండపైని సంపద జోలికి పోలేదని అంటారు. శ్రీరంగంలోని శ్రీరంగనాధుని ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీ సుల్తాను తీసుకొని పోగా అతని కుమార్తె "తుళుక్కు నాచియార్" రంగనాధుని మనోహర రూపానికి మనసునిచ్చిందని ఒక కధనం. శ్రీరంగం నుండి వైష్ణవ సంప్రదాయంతో బాటు ఈ దేవత కూడా తిరుమలకు వేంచేసి ఉండవచ్చును.
ఈ కధనాల సారంగానూ, స్థల పురాణాల వల్లనూ, సాహిత్యంలో ప్రస్తావనలను బట్టీ, అర్చనాది ఆచారాలనుబట్టీ లక్ష్మీదేవియే "పద్మావతి" లేదా "అలమేలు మంగ" అనీ, అమెయే తిరుమల కొండపై శ్రీవారి మూర్తి వక్షస్థలంపై ఉన్న హృదయలక్ష్మి అనీ, ఆమెయే తిరుచానూరు ఆలయంలో వెలసిన అలమేలు మంగ అనీ భావించవచ్చును.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు ప్రారంభ సూచకంగా సోమవారం సాయంత్రం ఆలయంలో శాస్త్రోకంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. 17 వ తేదీనుంచి మూడు రోజులపాటు ఆలయంలో పవిత్రోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. ఆలయంలో ఏడాది పొడవునా అమ్మవారికి నిర్వహించిన పూజాది కార్యక్రమాలు , ఉత్సవాల్లో తెలిసీ , తెలియక చేసిన తప్పులకు జరిగిన దోష నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం అంకురార్పణ , మంగళవారం పవిత్ర ప్రతిష్ఠ , బుధవారం పవిత్ర సమర్పణ , గురువారం పవిత్ర విసర్జన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవలను రద్దుచేస్తారు.
గజవాహనంపై ఊరేగిన అమ్మవారు
తిరుచానూరు పద్మావతీ అమ్మవారు ఆదివారం రాత్రి గజవాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి జన్మనక్షత్రం ఉత్తరాషాడను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో లక్ష్మీపూజ జరిగింది. సాయంత్రం 5.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహించారు. అనంతరం 7 గంటలకు అమ్మవారిని వాహన మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి సిద్ధంగా ఉంచిన గజవాహనంపై కొలువుదీర్చారు. అనంతరం దివ్యాలంకార శోభితురాలైన పద్మావతి అమ్మవారు గజవాహనంపై తిరువీ«ధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.