గీత చెప్పిన మూడు ముఖ్య విషయాలు!
గీత చెప్పిన మూడు ముఖ్య విషయాలు!
జ్ఞానయోగవ్యవస్థితి:
గీతలో జ్ఞానయోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆత్మజ్ఞానం కలిగి ఉండటమే జ్ఞానయోగము ప్రాధాన్యత. ఏ యోగము అవలంబించినా చివరకు జ్ఞానయోగంతోనే పూర్తి అవుతాయి. అటువంటి జ్ఞానయోగము కూడా దైవీసంపదలో భాగమే. ప్రతి వ్యక్తి జ్ఞానము సంపాదించాలి అనే ధృఢమైన సంకల్పము కలిగి ఉండాలి. ఎన్ని అవాతంరాలు వచ్చినా, ఎవరు హేళన చేసినా తన సంకల్పము నుండి వెనుతిరగకూడదు. మనలో చాలా మందికి భగవద్గీత చదవడం, గీతాజ్ఞానయజ్ఞాలకు వెళ్లడం అనేవి 60 ఏళ్లతరువాత చెయ్యాలి. ఇప్పుడే కాదు. 60 దాకా జీవితాన్ని ఎంజాయి చెయ్యాలి అనే తప్పుడు భావన ఉంది. అటువంటి వాళ్లు జ్ఞానయోగ మార్గంలో వెళ్లే వాళ్లను నిరుత్సాహపరుస్తుంటారు. అటువంటి వాటిని కూడా లెక్కపెట్టకుండా తాను నమ్మిన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనే ధృఢమైన సంకల్పం కలిగి ఉండాలి.
దానం:
దానం అంటే మనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడం. ఈ దానం వలన మనలో ఉన్న లోభము అనే దుర్గుణము నశిస్తుంది. పరోపకార బుద్ధి పెంపొందుతుంది. ఈ దానాలు చాలా ఉన్నాయి. భూదానము, ధన దానము, అన్నదానము, జలదానము, శ్రమదానము, విద్యాదానము, జ్ఞానదానము. ఇవి అన్నీ దానాలే. వీటిలో ఏ ఒక్కటి ఆచరించినా అది దైవీసంపదలో భాగమే. ఈ దానం వలన మనము తెలిసో తెలియకో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా కూడా ఉపకరిస్తుంది. వీటినే నవగ్రహ దానాలు అని కేవలం యాత్రికంగా చేస్తుంటారు. దానం అనేది ఎదుటి వారికి ఏది అవసరమో దానిని గుర్తించి దానం చేయాలి కానీ చెయ్యాలి కాబట్టి చేసాము అని ఇవ్వకూడని వారికి దానం చేస్తే అంటే అది అన అవుతుంది. అలా కాకుండా ఎదుటి వారి అవసరాన్ని గుర్తించి, చేయతగ్గవారికే దానం చేయాలి. అలా దానం చేయకుండా లోభత్వంతో కూడబెట్టుకుంటే మరణకాలంలో అన్నీ వదిలిపెట్టి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఈ శరీరం కానీ, శరీరంతో సంపాదించిన సంపదలు కూడా మనతో రావు అని తెలుసుకొని లోభత్వం తగ్గించుకొని దానగుణం పెంపొందించుకోవాలి.
మరి ఈ దానగుణం ఎలా అలవరచుకోవాలి అంటే ముందు మనం మన ఇంట్లో మనకు అవసరం లేని వస్తువులను, ఇతరులకు అవసరము అయ్యేవస్తువులను దానంచేయాలి. ఆ విధంగా దానగుణం అలవాటు అవుతుంది. క్రమక్రమంగా మనకు అవసరమయ్యే వస్తువులు కూడా, మన దగ్గర ఎక్కువగా ఉంటే, అవి ఇతరులకు అవసరమయ్యేవి అయితే, ఆ వస్తువులను దానం చేయడం అలవాటు అవుతుంది. తరువాత ఇతరుల అవసరాలను గుర్తించి మనకు ఉన్నదానిలో కొంతభాగం ఇతరులకు దానం చేయడం అలవాటు అవుతుంది. ఈ ప్రకారంగా దానగుణం దినదిన ప్రవర్థమానమౌతుంది.
దమము:
దమము అంటే ఇంద్రియ నిగ్రహము. నిగ్రహము అంటే ఇంద్రియములను అణిచిపెట్టడం కాదు. జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను నియంత్రించడం. చూచిన ప్రతి వస్తువు మీదికి మనసు పోవడం, అదే కావాలని కోరుకోవడం. తాకిన ప్రతిదీ నాకే స్వంతం కావాలనుకోవడం పనికిరాదు. ఇంద్రియ నిగ్రహము లేనిదే ఏ పనీ సాధ్యం కాదు. మనము నిర్దేశించుకున్న లక్ష్యసాధనము అనుగుణంగా మన ఇంద్రియములను ఒక క్రమపద్ధతిలో పనిచేయించడం, ఇంద్రియ నిగ్రహం అంటారు. కానీ ఇంద్రియములను అణిచిపెడితే అవి మరింతగా విజృంభిస్తాయి.
◆వెంకటేష్ పువ్వాడ.