శాంతిపాఠం వెనుక అద్భుత రహస్యమిదే!

 

శాంతిపాఠం వెనుక అద్భుత రహస్యమిదే!


సాధారణంగా ప్రతి ఉపనిషత్తుకూ ముందు శాంతిపాఠం ఉంటుంది. ఇప్పుడు పాఠశాలల్లో ముందు ప్రతిజ్ఞ, ప్రార్థనల వంటివి చేసే అలవాటుకు మూలం ఇది. ఉదయం లేవగానే, పాఠం ప్రారంభించే ముందు ప్రతి విద్యార్ధి ఈ శాంతిపాఠం వల్లె వేస్తాడు.


"సహనావవతు సహనౌభునక్తు

సహవీర్యం కరవావహై

తేజస్వినావధీత మస్తు మా విద్విషావహై 

ఓం శాంతిః శాంతిః శాంతిః!"


అన్న శాంతిపాఠం ఉంటుంది. ఇలా రోజూ ఉదయం పాఠాలు ప్రారంభించే ముందు శాంతిపాఠం చదవటాన్ని మనం విమర్శిస్తాం, హేళన చేస్తాం. ఉదయం లేవగానే భగవద్ధ్యానం చేయటం, భగవంతుడి పేరు స్మరించటాన్ని ఎద్దేవా చేస్తాం. కాని దీని వెనుక ఓ గొప్ప మానసికశాస్త్ర విషయం ఉంది.


"యద్భావం తద్భవతి" అన్న వాక్యం అర్ధం అందరికీ తెలుసు. ఎలా భావిస్తే అలా జరుగుతుంది. మనం ఎటువంటి భావన చేస్తే అలా జరుగుతుంది అన్నదీ వాక్యం అర్థం. అందుకే 'పాజిటివ్ థింకింగ్' నేర్పేవారు, పరీక్షలకు వెళ్ళే ముందు విద్యార్థులు "నేనీ పరీక్ష బాగా రాస్తాను. పాసవుతాను" అనుకుంటూ వెళ్ళాలని బోధిస్తారు. ఇంటర్వ్యూల్లో గెలవాలని అనుకునేవారు "నేను ఇంటర్వ్యూ బాగా చేస్తాను. వారడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తాను. ఇంటర్వ్యూలో నెగ్గుతాను" అనుకోవాలని సూచిస్తారు. ఏదైనా కఠినమైన కార్యం ఆరంభించే ముందు, వీలైతే ఆ పనిని మనం విజయవంతంగా నిర్వహించినట్టు, అందరూ మనల్ని అభినందిస్తున్నట్లు ఊహించాలని నేర్పుతారు. ఇలా ఊహించటం వల్ల వ్యక్తిలో ఉద్విగ్నత తగ్గి తాను విజయం సాధించగలడన్న భావన కలుగుతుంది. తనపై తనకు విశ్వాసం పెరుగుతుంది. విజయం సాధ్యమౌతుంది. దీన్ని మానసికశాస్త్రం కూడా సమర్థిస్తుంది ఇటువంటి ఊహలను, ఆలోచనలను  "సెల్ఫ్ హిప్నాసిస్ టెక్నిక్" అంటారు.


ఈ సూత్రాన్ని భారతీయ జీవనవిధానం పిల్లవాడికి ఊహ తెలిసినప్పటి నుంచీ అమలుపరుస్తుంది. పిల్లవాడేదైనా తప్పుగా మాట్లాడితే లేదా ఏదైనా చెడ్డ విషయం మాట్లాడితే పెద్దలు వెంటనే "అలా అనకూడదు, పైన తథాస్తు దేవతలుంటారు" అని అంటారు.


 వారు "తథాస్తు తథాస్తు" అంటూనే ఉంటారు. మనం ఏదైనా చెడు మాట్లాడే సమయానికి వారు "తథాస్తు" అన్నారా, ఆ  చెడు జరిగి తీరుతుంది. కాబట్టి మనం చెడు అనకూడదు. చెడు ఆలోచన చేయకూడదు. ఎందుకంటే మనసులో మాటలూ దేవతలకు తెలుస్తాయి కదా! ఈ రకంగా దుష్టాలోచనలను చేయకపోవటాన్ని, చెడు జరుగుతుందన్న ఊహను కూడా దరిదాపులకు రానీయకపోవటాన్ని మనం బాల్యం నుంచే అలవాటు చేస్తామన్నమాట. అయితే "తథాస్తు దేవతలు" పుక్కిటి పురాణాలు, మూఢ నమ్మకాలు అనటంతో ఆలోచనలపై అదుపు తప్పింది. దేవతలు "తథాస్తు" అంటూనే ఉన్నారు.


అందుకే, బాల్యం నుంచీ మనం శుభాన్నే వినాలి. శుభాన్నే చూడాలి. దేవతల స్తోత్రం గానం చేసేందుకు మనం పూర్తి ఆరోగ్యం, బలాలతో నియమిత ఆయుఃకాలం గడపాలి అన్న శాంతిపాఠం పిల్లలతో వల్లెవేయిస్తాం. అంటే చెప్పకుండానే వారికి మంచి వినాలి, మంచి ఆలోచనలు చేయాలి. మంచి చేస్తూ నిండు నూరేళ్ళు బ్రతకాలి అన్నది నేర్పుతున్నామన్నమాట.

                                   ◆నిశ్శబ్ద.