తిరుప్పావై అంటే...
తిరుప్పావై అంటే...
-మంజులశ్రీ
తిపుప్పావై – ఒక అద్భుత వేదాంత గ్రంధం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గమిది. తిరు అంటే శ్రీ అని అర్థం. పావై అంటే పాటలు లేక వ్రతం అని అర్థం. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా పేరుమోసిన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయనను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతము.
తిరుప్పావై లో 30 పాశురములు ఉంటాయి. పాశురము అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలని అర్ధం. ఆండాళ్ లోని ఈ భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు, తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలున్నాయి. వేకువజామున నిద్రలేచి స్నానం చేయడం, స్వామి కీర్తనలను, ప్రతిరోజూ క్రమం తప్పకుండా తిరుప్పావై పాశురములను పాడడం, పేదలకు దానములు, పండితులకు సన్మానము చేయడం, స్వామికి, ఆండాళ్ కు ఇష్టమైన పుష్ప కైంకర్యము చేయడం, ప్రతిరోజూ స్వామివారికి పొంగలి నివేదించడం మొదలైనవి పాటిస్తారు.
సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులందరూ స్త్రీలనే ఉద్దేశ్యముతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికి మనం ఆచరిస్తున్నాము. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, భోగిరోజున ఆండాళ్, శ్రీరంగ నాధుల కళ్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది.
శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తి సాగరములో మునిగితేలినవారిని ఆళ్వారులు అంటారు. పన్నెండుమంది ఆళ్వారులలో విష్ణుచిత్తుడు మొదటి వారు. ఆయన తన భక్తి సంపదను వారసత్వంగా గోదాదేవికి ఇచ్చారు. నిజానికి భూదేవే ఆండాళ్ అని చెబుతారు. జనక మహారాజు యజ్ఞభూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది. అదేవిధంగా శ్రీ రంగనాథునికి పుష్పకైంకర్యం కోసం విష్ణుచిత్తులవారు తులసి తోట సాగు చేస్తుండగా ఆండాళ్ దొరికింది. భగవంతునికే తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసివనంలో ఆండాళ్ దొరకడాన్ని గమనిస్తే సీతాదేవి, ఆండాళ్ భూదేవి అంశే అన్న విషయం తెలుస్తుంది. ఆండాళ్ అసలు పేరు కోదై. కోదై అంటే మాలిక. ఆ పేరు పెట్టగా, అది క్రమంగా గోదాగా మారింది అటువంటి గోదాదేవి రచించిన 30 పాశురములలో ఏయే అంశాలున్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. 30 పాశురములోని అంశాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచిగా జీవించమని, తోటివారికి సాయపడమని, భగవదారాధన తప్పనిసరిగా చేయమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి. ఇటువంటి ప్రబోధాలే ప్రతి పాశురములోనూ మనకు కనిపిస్తాయి.