లలితా త్రిపురసుందరి దేవిని శంకర భగవత్పాదులు ఎలా వర్ణించారంటే..
లలితా త్రిపురసుందరి దేవిని శంకర భగవత్పాదులు ఎలా వర్ణించారంటే..
అధిష్ఠాన దేవత అయిన త్రిపుర సుందరీ స్వరూపాన్ని ఒకచోట శంకర భగవత్పాదులు అద్భుతంగా వర్ణించారు. లలితా త్రిపుర సుందరీ దేవే.. కాంచీపుర క్షేత్రంలో తల్లి అని చెప్పడం ఆయన ఉద్దేశం. అది ఎలా చెప్పారంటే
క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా
పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చంద్రవదనా,
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమథితు రాహోపురుషికా
ఎంత అద్భుతంగా చెప్పారో ఆ తల్లి సౌందర్యాన్ని, ఎదురుగా కళ్ళ ముందు కనిపించిందట. పురస్తా దాస్తాం... పురస్తాత్ = ముందర; ఎవరి ముందర అంటే... నః పురస్తాత్ = నా ముందర, ఆస్తాం = ఉన్నది. నా ముందర ఉన్నది ఎవరు .... పురమథితు రాహోపురుషికా= త్రిపురాసుర సంహారకుడు అయిన శివుని (పురమథితుడు = త్రిపురాసుర సంహారకుడు). అహోపురుషికా పురుషికా అంటే పురుషకారం, పౌరుషం, శక్తి. ఒక పురుషుడి శక్తి పురుషకారం. ఆ పరమేశ్వరుడికి పురుషకారం ఆవిడ. అలాగ అయ్యవారి శక్తే అమ్మవారు అని చెప్పడానికి “అహోపురుషికా” అనే శబ్దం చెప్పారు. అయ్యవారు అహంకార స్వరూపం, ఇది తత్త్వం. అహం అనే స్ఫురణకు మూలమైన చైతన్యమే అమ్మ ఈ తత్త్వాన్ని రూపంగా చూపిస్తున్నారు
క్వణత్ కాంచీదామా కరికలభకుంభస్తననతా' ఆమె ఒడ్డాణం పెట్టుకుని కూర్చుందట. అది చప్పుడు చేస్తున్న మువ్వల ఒడ్డాణం. మువ్వల ఒడ్డాణం కూడా కదిలితేనే చప్పుడు చేస్తుంది. కానీ అమ్మవారు కూర్చుని ఉన్నారు, అయినా క్వణత్ కాంచీదామా!.. అంటే ధ్వని చేస్తున్న ఒడ్డాణం పెట్టుకుని ఉన్నారు. 'రణత్కింకిణి మేఖలా' అనే లలితా సహస్రనామం నుండే 'క్వణత్ కాంచీదామా' వచ్చిందట. అంటే అమ్మే చైతన్యం కాదు, అమ్మ వేసుకున్న ఆభరణాలు కూడా చైతన్యవంతాలే. జడములు కావు, స్వయంగా చలనం కలిగి ఉన్న చైతన్య స్వరూపాలు. అమ్మవారి ఆభరణాలన్నీ మంత్ర రహస్యాలు. 'క్వణత్ కాంచీదామా' అంటే శబ్ద స్వరూపమైన ఒడ్డాణం. మంత్రమయమైన శక్తి ఆ ఒడ్డాణంలో ఉన్నది. అలాంటి మ్రోగుతున్న మంత్రమయ స్వరూపిణి జగదంబిక భాసిస్తూ ఉండగా, ఆవిడ నాలుగు చేతులలో నాలుగు పట్టుకుని కూర్చున్నారట. అవేమిటంటే చెరకు విల్లు, ఐదు పువ్వుల బాణాలు, పాశము, అంకుశము. ఈ నాలుగూ ఏమిటో 'లలితా సహస్రం'లో చెప్పారు “రాగ స్వరూప పాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా, మనో రూపేక్షు కోదండా పంచతన్మాత్ర సాయకా" అని.
ఈ నాలుగు చేతుల్లోని రహస్యం ఏమిటి అంటే... ఒకటి చెరకు విల్లు. 'మనో రూపేక్షు కోదండా'.. మనస్సనే చెరకు విల్లు. పంచతన్మాత్రలనే పువ్వుల బాణాలు, అనురాగమనే పాశం, క్రోధం అనే అంకుశం. మన బ్రతుకంతా ఈ నాలుగే. జీవితాన్ని పరిశీలించి చూస్తే తెలిసేదేమిటంటే.. ఒకటి మన మనస్సు. మనస్సు ఎంత సున్నితమైనదంటే అది చెరకు లాంటిది. తియ్యదనమంతా మనస్సుదే! సుఖం కానీ, దుఃఖం కానీ అనుభవించే స్థితి మనస్సుదే. అనుభవస్థానం మనస్సు. అందుకే చెరకుతో పోల్చారు దాన్ని. వట్టి మనస్సు ఏమీ చెయ్యలేదు, అలాగే వట్టి ధనుస్సు ఏమీ చెయ్యదు. ధనుస్సుకు బాణాలు కావాలి. బాణాలు ఏమిటి అంటే.. "పంచతన్మాత్ర సాయకా” - పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ.. ఈ పంచతన్మాత్రలు పువ్వుల బాణాలు అమ్మ పట్టుకున్నవి. ఇదే మన బ్రతుకంతా కూడా! ఈ ఐదే మన ఇంద్రియాలకు ఉన్న లక్షణం. ఈ ఐదే మనం బయట ప్రపంచంలో చూస్తున్నవి. బయటి ప్రపంచంలో ఉన్న ఐదింటిని ఇంద్రియాల ద్వారా గ్రహించి మనస్సు ఆనందిస్తుంది. మన అనుభూతులన్నీ కూడా ఈ ఐదింటితో కూడుకున్నవే. ఈ ఐదూ స్వయంగా ఏమీ చెయ్యలేవు, మనస్సు కలిస్తే తప్ప!
*నిశ్శబ్ద.