Read more!

అమ్మవారి కరుణ కలగాలంటే మంత్రం, పూజలకు మించిన అద్భుత మార్గమిదేనట!

 

అమ్మవారి కరుణ కలగాలంటే మంత్రం, పూజలకు మించిన అద్భుత మార్గమిదేనట!


అమ్మవారి ప్రతీ రూపం ఒక దివ్యతత్త్వాన్ని తెలియ చేస్తుంది. అందులో అతి ముఖ్యమైన స్వరూపం లలితా త్రిపురసుందరి. ఈ అమ్మవారు అన్నీ ఇస్తారు. శ్రీరామకృష్ణ పరమహంస  అయితే  అమ్మ వారిని ఏడ్చి సాధించాలిట. 'బాలానాం రోదనం బలం' అంటాం. 'హింసా బలమసాధూనాం, రాజ్ఞాం దండ విధిర్బలం' - దుర్మార్గుడు హింసించి సాధిస్తాడు, రాజు దండించి సాధిస్తాడు, పిల్లలు ఏడ్చి సాధిస్తారు. అలా అమ్మవారిని సాధించడానికి గొప్ప విద్య ఏడుపు. అమ్మ మంత్రానికి లొంగదు, ఏడిస్తే లొంగుతుందట. అందుకేనేమో ఆడవాళ్ళు ఏడిస్తే అమ్మవారు తట్టుకోలేరు అంటారు. 

శంకర భగవత్పాదుల వారొక మాట అంటారు "న మంత్రం నో యంత్రం తదపిచ న జానే స్తుతిమహో న చాహ్వానం ధ్యానం తదపి చ న జానేస్తుతి కథాః, న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం॥"

శ్రీవిద్యను ఇంత ప్రబోధించి సర్వత్రా వ్యాపింపజేసిన ఆ మహానుభావుడు మంత్రాలు ఏవీ రావంటారు. స్తోత్రాలు కూడా రావట. సౌందర్య లహరి రచించిన ఆయన అన్నమాట అది! ఏడవడం కూడా రాదన్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు భగవంతుణ్ణి తలచుకుంటే ఏ స్పందనా ఉండని వారిని "చండ్ర దినుసులు" అన్నారు. కొందరు “అమ్మ” అని తలచుకొంటూ కన్నీళ్ళు కారుస్తారు. అలాంటి వారివి గొప్ప జన్మలు.

"బహువిధ పరితోష బాష్పపూర స్పుట పులకాంకిత చారు భోగభూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదా శివ భవానీం ప్రపద్యే" నీ శరీరం భోగభూమి ఎప్పుడవుతుంది అంటే పరమేశ్వరుణ్ణి తలుచుకోగానే పులకించిపోయి కన్నీళ్ళు వస్తే అది భోగభూమి అన్నారు. ఆ స్థితి రావాలట!

పరం జానే మాతస్త్వదనుసరణం కష్టహరణం- 'ఇవేవీ రావు కానీ నిన్ను అనుసరిస్తే మాత్రం కష్టాలు పోతాయి, అదొక్కటి తెలుసు. కానీ ఎలా అనుసరించాలో... వీటిలో వేటిలో నేను పండితుణ్ణి కాను అమ్మా' అని ఏడ్చారు శంకరుల వారు. అలాగే శ్రీరామకృష్ణ పరమహంస ఏడ్చి సాధించారట. అప్పుడు అమ్మ దొరికింది. పరమహంసను 'దేవుడున్నాడా? ఉంటే కనపించడేం' అని అడిగారట. దైవం గురించి తెలుసుకోవాలనే తీవ్రమైన తపన ఉంటే దైవమే వచ్చి చెబుతుంది. "దైవం కోసం తపించాలి. నేను ఏడ్చాను, నాకు కనపడింది. నువ్వూ ఏడువు. నీకూ కనపడుతుంది. ఎలా ఏడవాలి అంటే తల్లి పిల్లవాణ్ణి ఎత్తుకుని ఆడిస్తూ, కొంత సేపటికి దించి బొమ్మలిచ్చిందట. వాడు బొమ్మలతో ఆడుకుంటున్నాడు. తల్లి తన పని చూసుకుంటోందట. కొంతసేపు ఆ బొమ్మలతో ఆడుకుని, విసుగొచ్చి బొమ్మలు పక్కన పడేసి 'అమ్మా' అని ఏడ్చాడట. అప్పుడు పనిలో ఉన్న తల్లి పరుగెత్తుకుని వచ్చి, పిల్లవాణ్ణి ఎత్తుకుందట. అలా మనం ప్రపంచపు బొమ్మలలో ఏమీ లేదు, అమ్మే కావాలి అని ఏడిస్తే తప్పకుండా అమ్మ ఎత్తుకుంటుంది" అన్నారు రామకృష్ణ పరమహంస.

అలా ఏడ్చి, ఎంతో తపనపడి "నువ్వు కనబడకపోతే పొడుచుకుంటాను" అని అమ్మ చేతిలోని కత్తి తీసుకున్నారట. అప్పుడు అమ్మ కనపడింది. "అప్పటి నుండీ అమ్మ తన అన్ని రూపాలూ నాకు చూపించింది. ఎన్నెన్ని రూపాలు శాస్త్రాలు వర్ణించాయో అన్ని రూపాలూ చూపించింది. ప్రతీ రూపమూ అందమే. అందులో ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనను. కానీ త్రిపుర సుందరీ స్వరూపం అందాలలో కెల్లా అందం. అది సర్వ శ్రేష్ఠమైన స్వరూపం" అని అన్ని స్వరూపాలూ దర్శించిన శ్రీరామకృష్ణ పరమహంస తన అనుభూతిని చెప్పారు.


                                           *నిశ్శబ్ద.