మనసును నియంత్రించడంలో ఆదర్శం పాత్ర ఏమిటి?
మనసును నియంత్రించడంలో ఆదర్శం పాత్ర ఏమిటి?
మనిషికి జీవితంలో మనసే అత్యంత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. మనిషి మానసిక పరపక్వత, తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు అన్నీ మనసు ఎలా స్పందింస్తుంది అనే విషయం మీద ఆధారపడి ఉంటాయి. అలాంటి మనసును నియంత్రణలో పెట్టుకోవడానికి ఆదర్శం ఒక గొప్ప ఆయుధం అని అంటారు కొందరు ఆధ్యాత్మికత మరియు వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పేవారు. మనసును నియంత్రించడానికి ఆదర్శం ఎలా ఉపయోగపడుతుందో చెప్పే కథ ఒకటుంది.
అనగనగా ఓ యాత్రికుడు ప్రయాణాలు చేస్తూ చేస్తూ దారి తప్పి, ఓ అడవి చేరుకున్నాడు. అక్కడ అతడికి ఓ సాధువు కనిపించాడు. సాధువు ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్న యాత్రికుడికి, అటువంటి అడవిలో సాధువు దగ్గర అన్నీ లభించటం చూసి ఆశ్చర్యపోయాడు.
"ఇదిలా సాధ్యం?? ఈ అడవిలో అన్నీ ఎలా దొరికాయి??" అని అడిగాడు.
"నా దగ్గర కోరికలు తీర్చే వృక్షం ఉంది" అని చెప్పాడు సాధువు. అప్పటి నుంచీ ఆ యాత్రికుడికి ఆ వృక్షం దగ్గరకు వెళ్ళి కోరికలు తీర్చుకోవాలన్న ఆలోచన భూతంలా పట్టుకుంది. సాధువు ఎంత వారించినా వినలేదు.
"ఆలోచనల మీద పట్టు, ఆచరణలో నియంత్రణ, హృదయంలో నిర్మలత్వం ఉన్నవారే ఆ వృక్షాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలరు. లేకపోతే అనవసరంగా ప్రమాదం కొని తెచ్చుకున్నట్టవుతుంది" అని హెచ్చరించాడు. కానీ పెద్దల హెచ్చరికలను గ్రహించేంత వ్యక్తిత్వం లేదు ఆ యాత్రికుడికి.
మొండిపట్టుపట్టాడు. చివరికి కోరికలు తీర్చే వృక్షం వద్దకు వెళ్ళాడు. "ఆహా, ఇక్కడ ఎంత బాగుంది! ఓ పట్టుపరుపు లభిస్తే ఎంత బాగుండు" అనుకున్నాడు. వెంటనే మంచం, పట్టుపరుపులు వచ్చాయి. "రుచికరమైన తినుబండారాలుంటేనా!" అన్నాడు. తినుబండారాలు దొరికాయి. "ఓ అందమైన అమ్మాయి ఉంటే బాగుండు కదా!!" అనుకోగానే ఆమె ప్రత్యక్షమైంది, సేవలందించింది. అతడు హాయిగా నిద్రించి లేచేసరికి సాయంత్రమైంది.
అలముకుంటున్న చీకటిని చూడగానే అతడికి భయం వేసింది. "పులి ఏ మూల నుంచో వచ్చి మీద పడితే?" అనుకున్నాడు. అతడు మరో ఆలోచన చేసే లోగా పులి వచ్చింది, మీద పడి లాక్కుపోయింది.
మన ఆలోచనలు మన కర్మలను నిర్దేశిస్తాయి. మన కోరికలు మన వ్యక్తిత్వానికి దర్పణం పడతాయి. ఒక వ్యక్తి కలలను విశ్లేషిస్తే అతని మనసులో దాగున్న అసలు మనిషిని అర్ధం చేసుకునే వీలుంటుంది. కాబట్టి సముద్రంలో అలల్లా అలుపు లేకుండా నిరంతరం ఎగసిపడే ఆలోచనలను నియంత్రించటం, సరైన ఆదర్శాన్ని, ఆదర్శమూర్తిని ఎంచుకోవటం ఆలోచనల నియంత్రణలో అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది.
ఆలోచనలకు అంతు లేదు. అవి నిరంతరం తీరాన్ని తాకే అలల వంటివి. ఎలాగైతే అలలు తీరాన్ని తాకుతూ, రాళ్ళను ముక్కలు ముక్కలు చేసి మట్టిగా మారుస్తాయో, అలాగే నిరంతరం ఉద్భవించే కోరికలు, వ్యక్తి వ్యక్తిత్వాన్ని కూడా మట్టిలా మార్చ గలుగుతాయి. కోరికలపై నియంత్రణ సాధించని వ్యక్తి మట్టి అయిపోతాడు. కోరికలను జయించటంలో 'ఆదర్శం' అత్యంత శక్తిమంతమైన ఆయుధం. ఇది గ్రహించిన భారతీయ మానసిక శాస్త్రవేత్తలు, మన జీవన విధానంలో కోరికలపై పట్టు సాధించేందుకు అనేక మార్గాలను సూచించారు. కోరికలను నియంత్రించేందుకు ఆదర్శానికి సంబంధం ఏమిటన్న ప్రశ్న ముందుగా కలుగుతుంది. మనిషి మనసు గాలిపటం లాంటిది. దాన్ని దారం నియంత్రించినంత కాలం గాలిలో స్థిరంగా ఎగురుతూ ఉంటుంది. ఆ దారం తెగిపోతే దానికొక దిశ అంటూ ఉండదు. గాలి ఎటు తీసుకువెళ్తే అటు కొట్టుకుపోతుంది. అలా దిశ లేకుండా ఎటు పడితే అటు కొట్టుకుపోయే గాలి పటం లాంటి మనసును నియంత్రిస్తుంది ఆదర్శం.
◆నిశ్శబ్ద.