దత్తాత్రేయుడు కొండచిలువను గురువుగా స్వీకరించి చెప్పిన సందేశం!
దత్తాత్రేయుడు కొండచిలువను గురువుగా స్వీకరించి చెప్పిన సందేశం!
హిందూ భక్తి, ఆధ్యాత్మిక సంప్రదాయంలో దత్తాత్రేయుడు ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉన్న అవధూతుడు ఈయనను గురువుగా భావించేవారు లెక్కలేనంత మంది ఉన్నారు. అత్రి మహర్షి, అనసూయల పుత్రుడైన దత్తాత్రేయుడి వలనే గురు పరంపర మొదలైందని చెబుతారు. దత్తాత్రేయుడని దత్తుడు అని ఎంతో భక్తిగా పిలుచుకుంటారు. దత్తాత్రేయుని ప్రత్యేకత ఏమిటంటే.. సాధారణంగా మనుషుల దగ్గర కాకుండా, ప్రకృతిలోని ప్రతి అంశం నుంచి జీవన సత్యాలను గ్రహించడం. ఆయన యదు రాజుతో తనకు 24 మంది గురువులు ఉన్నారని చెబుతారు. ఈ 24మంది గురువులలో కొండచిలువ కూడా ఒకటి. కొండచిలువ తనకు గురువు ఎలా అయ్యిందనే విషయాన్ని దత్తుడు యదురాజుతో చెబుతాడు. ఈ కథ భాగవత పురాణంలో ఉంటుంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
యదుడు దత్తాత్రేయుడిని ఎందుకు అడిగాడు?
ఒక రోజు యదు మహారాజు అడవిలో సంచరిస్తూ దత్తాత్రేయుడిని చూశాడు. దత్తాత్రేయుడి వద్ద రాజ్యం లేదు, సంపద లేదు, కుటుంబ బాధ్యతలు లేవు. అయినా ఆయన ముఖంలో అసాధారణమైన ప్రశాంతత, ఆనందం కనిపించాయి.
యదుడు ఆశ్చర్యపడి దత్తాత్రేయుడిని ఇలా అడిగాడు..
“మనుషులు సాధారణంగా సుఖం కోసం ఎంతో కష్టపడతారు. కానీ మీరు ఏమీ లేకపోయినా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ జ్ఞానం మీకు ఎవరు ఇచ్చారు?” అని అడిగాడు.
అప్పుడు దత్తాత్రేయుడు.. “నాకు ఒక గురువు కాదు. ఈ ప్రపంచమే నా గురువు. నేను ప్రకృతిలోని 24 గురువుల నుంచి నేర్చుకున్నాను.” అన్నాడు. వాటిలో కొండచిలువ కూడా ఒకటి అని చెప్పాడుయ
కొండచిలువ గురించి యదుడు ప్రశ్నించినప్పుడు.. దాని గురించి దత్తాత్రేయుడు వివరించాడు.
కొండచిలువను గమనిస్తే అది ఇతర జంతువుల్లా నిరంతరం పరుగులు పెట్టి ఆహారం వెతకదు. వేట కోసం అధిక ఆత్రుత చూపదు, దొరికినప్పుడు తింటుంది, దొరకనప్పుడు అసహనం చెందదు, అవసరానికి మించి కూడబెట్టదు, ఎక్కువ కదలకుండా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే అది నాకు గురువు అయ్యింది.
“శరీరాన్ని నిలబెట్టడానికి ఎంత అవసరమో అంత ప్రయత్నం చేయాలి. కానీ కోరికల కోసం అంతులేని పరుగులు పెట్టకూడదు.” అని యదు రాజుతో దత్తాత్రేయుడు చెప్పాడు.
మనుషులు చాలాసార్లు అవసరాల కోసం కాదు.. పోలికలు, ఆశలు, భవిష్యత్తు భయం కోసం జీవితం మొత్తం గడిపేస్తారు. అది కావాలి, ఇది కావాలి, ఇంకా ఎక్కువ కావాలి, ఇతరులు బాగున్నారు, మనం కూడా అలా ఉండాలి, ఇంకా సంపాదించాలి.. ఇలాంటి విషయాలతో మనసు ఎప్పుడూ అసంతృప్తిగా మారుతుంది. కొండచిలువ మాత్రం దొరికిన దానితో ఉంటుంది. దాని జీవితం వర్తమానంలో ఉంటుంది. అందుకే కొండచిలువ దత్తాత్రేయుడి 24 మంది గురువులలో ఒకటైంది.
అసలు అర్థం..
కొంతమంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుని “ఏమీ చేయకుండా ఉండాలి” అనుకుంటారు. కానీ దత్తాత్రేయుడు అలా చెప్పలేదు.
ఆయన చెప్పింది.. కర్తవ్యాన్ని చేయాలి, శ్రమ చేయాలి
కానీ ఫలితాలపై అతిగా ఆధారపడకూడదు. అవసరానికి మించి ఆశ పెంచుకోకూడదు, మనశ్శాంతిని కోల్పోకూడదు.
పై వాటికి అర్థం పని చేయకపోవడం కాదు.. ఆందోళన లేకుండా పని చేయడం.
*రూపశ్రీ.