పురాణ, ఇతిహాసాలు జీవితానికి ఇచ్చే శక్తి ఇదే...
పురాణ, ఇతిహాసాలు జీవితానికి ఇచ్చే శక్తి ఇదే...
తల్లితండ్రులు నేటి పిల్లల్ని సరిగా చదవడం లేదని మందలించినా, ప్రవర్తన సరిగా లేదని వారించినా, అడిగిన వస్తువులను ఇవ్వకపోయినా ఇలా చిన్న చిన్న విషయాలకే మనస్తాపం చెంది, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే అన్ధస్రూ ధ్రువుడి కథను తెలుసుకోవాలి. పసిప్రాయంలో ఎదురైన అవమానాల్ని సోపానాలుగా మలచుకొని ఆ పరంధాముణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు ధ్రువుడు.
ఉత్తానపాదుడనే మహారాజుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సునీతికి ధ్రువుడు, రెండవ భార్య సురుచికి ఉత్తముడనే కుమారులు ఉండేవారు. ఒకరోజు మహారాజు నిండు సభలో ఉత్తముణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అది చూసి ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో కూర్చోవాలని ఆశతో దగ్గరకు వెళ్ళాడు. కానీ పినతల్లి సురుచి కోపంతో "మహారాజు ఒడిలో కూర్చొనే అర్హత నీకు లేదు. అందుకు భగవంతుని కోసం తపస్సు చేసి మరలా నా కుమారుడిగా జన్మించు అని ధ్రువుణ్ణి కోపంతో ప్రక్కకు త్రోసివేసింది.
ధ్రువుడు తన తల్లి సునీతి దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ జరిగిన దంతా చెప్పాడు. అప్పుడు ఆమె "నాయనా! మనకు కలిగిన కష్టాలకూ, అవమానాలకూ ఒకరిని నిందించి ప్రయోజనం లేదు. అది మన పూర్వజన్మకర్మ ఫలితం. భగవంతుణ్ణి శరణు వేడడం ద్వారా మనశ్శాంతిని పొందవచ్చు" అని ధ్రువుణ్ణి ఓదార్చింది.
తల్లి మాటలు విన్న ధ్రువుడు "అమ్మా! నేను తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాను" అని చెప్పి అడవులకు వెళ్ళాడు.
ధ్రువుని దృఢసంకల్పం తెలిసిన నారదుడు అతడికి మంత్రోపదేశం చేశాడు. ఎన్నో అవాంతరాలను దాటి, పరీక్షలకు నిలబడి ధ్రువుడు, మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు. ధ్రువుని కఠోర తపస్సుకు సంతసించి మహావిష్ణువు ప్రత్యక్షమై 'నాయనా!' నీ దృఢసంకల్పానికి సంతసించాను. ఈ ప్రపంచంలో ఎవరికీ లభ్యం కాని సర్వోన్నత స్థానమైన ధ్రువపదం నీకు ప్రసాదిస్తున్నాను' అని ధ్రువుణ్ణి ఆశీర్వదించాడు.
పినతల్లి సురుచి చేసిన అవమానంతో ఆత్మన్యూనతా భావానికి గురి కాకుండా దృఢచిత్తంతో ధ్రువపదాన్ని సాధించిన ఐదేళ్ళ ధ్రువుడి ఆధ్యాత్మిక శక్తి నేటి పిల్లలకు ఆదర్శం కావాలి.
ధ్రువుడి కథనం ఇలాంటిది అయితే. భారతీయ యువతకు గొప్ప ప్రేరణ స్వామి వివేకానంద. మూడుశక్తుల సంగమం నైతిక, మానసిక, ఆధ్యాత్మికశక్తుల సంగమమే స్వామి వివేకానందుని జీవితం. తరగతిగదిలో ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు తాను చెప్పిన సమాధానం సరైనదే అయినా అది తప్పని ఉపాధ్యాయుడు తనను కొట్టినప్పుడు కూడా నరేంద్రుడు (స్వామి వివేకానంద) భయపడకుండా సత్యాన్నే చెప్పాడు. అది అతడిలో ఉన్న 'నైతికశక్తి'ని తెలియజేస్తుంది.
తండ్రి మరణానంతరం కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నప్పుడు అనైతిక మార్గాల ద్వారా ధనం సంపాదించాల్సిందిగా తోటి స్నేహితులు నరేంద్రుణ్ణి ఎన్నో రకాలుగా ప్రేరేపించారు. కానీ అతడు ఆ ప్రలోభాలకు లొంగలేదు. అది నరేంద్రుడి 'మానసికశక్తి'కి నిదర్శనం. అలాగే పాశ్చాత్య దేశాల్లో స్వామి వివేకానంద ఎన్నో అవమానాలనూ, నిందారోపణలనూ ఎదుర్కొన్నారు. చివరకు మత ఛాందసులు కొందరు ఆయన్ని అంతం చేయాలని కాఫీలో విషం కలిపి ఇచ్చారు. కాఫీని తాగబోతున్నప్పుడు శ్రీరామకృష్ణులు కనిపించి, 'ఇందులో విషం కలిపారు' అని ఆయన్ని అప్రమత్తం చేశారు. అప్పుడు వివేకానందుడు 'నా గురుదేవులు సర్వవేళలా, సర్వావస్థల్లోనూ నన్ను రక్షిస్తున్నారు' అని అచంచల విశ్వాసంతో పలికిన మాటలు ఆయన 'ఆధ్యాత్మికశక్తి'కి ఓ నిదర్శనం.
స్వామి వివేకానందుని తల్లి భువనేశ్వరీదేవి ఆయనకు బాల్యంలోనే రామాయణ, భారత, భాగవత కథలను బోధించేది. అందువల్లనే జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులన్నింటినీ ఎదుర్కొని ఆయన మహోన్నత వ్యక్తిగా రూపొందారు. అందుకే అంటారు మనిషి మానసిక శారీరక దృఢత్వానికి మన పురాణ, ఇతిహాసాలు చాలా గొప్ప బలాన్ని చేకూరుస్తాయని.
◆నిశ్శబ్ద.