హనుమంతుడి లీలల సమాహారం.. సుందరకాండలో అద్భుతాలు ఇవీ..!
హనుమంతుడి లీలల సమాహారం.. సుందరకాండలో అద్భుతాలు ఇవీ..!
రామాయణంలోని సుందరకాండ కథ మనిషిలో ఆత్మవిశ్వాసం, భక్తి కలిస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుందని బోధిస్తుంది. సీతమ్మను అణ్వేషించే క్రమంలో హనుమంతుడిని లంకకు వెళ్లమని ఉత్సాహపరిచారు. ఈ క్రమంలోనే హనుమంతుడు మరచిపోయిన శక్తులను జాంబవంతుడు గుర్తు చేస్తాడు. ఇక్కడి నుండి హనుమంతుడి ప్రయాణం అంతా ధైర్యసాహసాలతో ఉంటుంది. సుందరకాండలో హనుమంతుడు చేసే లీలలు అన్నీ ఇన్ని కావు. వీటిలో కొన్ని లీలలు ప్రధానంగా ఉన్నాయి. వీటిని తెలుసుకోవడం వల్ల మనిషి జీవితంలో చాలా నేర్చుకోవచ్చు. అవేంటో తెలుసుకుంటే..
సురస..
లంకకు వెళ్ళేటప్పుడు హనుమంతుడు మొదట తన దారిలో నిలిచిన సర్ప దేవత సురసను ఎదుర్కోవాల్సి వచ్చింది. సురస హనుమంతుడిని మింగివేయాలని అనుకుంది. దేవతల ఆజ్ఞ అలా ఉందని చెప్పింది. అయితే ఆమెను దాటి వెళ్లడానికి హనుమంతుడు చాకచక్యం ప్రదర్శించాడు. హనుమంతుడు తన శరీర పరిమాణాన్ని పెంచుకున్నాడు. సురస కూడా తన శరీర పరిమాణాన్ని పెంచింది. ఆ వెంటనే హనుమంతుడు అతి చిన్న రూపాన్ని అంటే అంగుష్ట పరిమాణం, అంటే బొటన వేలంత చిన్నగా మారిపోయి సురస నోటిలో ప్రవేశించి త్వరగా బయటకు వచ్చాడు. తన నోటిలో ప్రవేశిస్తేనే హనుమకు వెళ్లడానికి అనుమతి ఇస్తానని చెప్పిన సురస కోరిక నెరవేర్చాడు. అలా ఆయన ఆటంకాన్ని అధిగమించాడు.
సింహకి..
సముద్రం మధ్యలో సింహిక నివసించేది, ఆమె ఆకాశంలో ఎగురుతున్న జీవుల నీడలను పట్టుకుని వాటిని ఈడ్చుకుంటూ వెళ్ళేది. ఆమె హనుమంతుడి కదలికను ఆపడానికి ప్రయత్నించినప్పుడు హనుమంతుడు ఆమె కుట్రను గ్రహించాడు. ఆమెను క్షణంలో చంపి మార్గం సుగమం చేశాడు.
విభీషణుడి సమావేశం..
సీతను వెతుకుతూ హనుమంతుడు లంకలోని విభీషణుడి రాజభవనానికి చేరుకున్నాడు. అక్కడ "రామ" అనే పేరు చెక్కబడి ఉండటం చూసి అక్కడ ఒక భక్తుడు నివసిస్తున్నాడని హనుమకు అర్థమైంది. విభీషణుని కలిసిన తర్వాత తనను తాను పరిచయం చేసుకోవడమే కాకుండా, రాముడికి పరిచయం చేస్తానని కూడా వాగ్దానం చేశాడు.
సీత దుఃఖం..
చాలా కష్టపడి వెతికిన తర్వాత హనుమంతుడు అశోక వాటిక చేరుకున్నాడు. అక్కడ దుఃఖిస్తున్న సీతాదేవిని ఓదార్చాడు. రాముడు ఆమెకు ఇచ్చిన ఉంగరాన్ని సీతమ్మకు ఇచ్చాడు. రాముడి సందేశం అందించి సీతామాత దుఃఖాన్ని తగ్గించినది హనుమే.. తొందరలోనే తనకు లంక నుండి విముక్తి లభిస్తుంది సీతమ్మలో ధైర్యం కలిగించింది హనుమే.
అశోక వనం ధ్వంసం..
సీతమ్మ అనుమతి తీసుకున్న తర్వాత హనుమంతుడు తోటలోని పండ్లను తిని, రావణుడి అహంకారాన్ని సవాలు చేయడానికి భారీ చెట్లను పెకిలించాడు. అక్కడ ఉన్న రాక్షస రక్షకులను ఓడించి, రావణుడి ఆస్థానంలో భయాందోళనలు సృష్టించాడు. అశోక వనాన్న ధ్వంసం చేశాడు.
అక్షయ కుమారుడు..
రావణుడు తన కుమారుడు అక్షయ కుమారుడిని హనుమంతుడిని పట్టుకోవడానికి పెద్ద సైన్యంతో పంపాడు. హనుమంతుడు అక్షయ కుమారుడిని ఒక పెద్ద చెట్టుతో కొట్టి అతనిని, అతని మొత్తం సైన్యాన్ని చంపాడు. హనుమంతుడి గర్జన లంక మొత్తాన్ని కదిలించింది.
మేఘనాథుడితో యుద్దం..
అక్షయ కుమారుడి మరణంతో కోపోద్రిక్తుడైన రావణుడు అత్యంత శక్తివంతుడైన మేఘనాధుని హనుమ మీదకు పంపాడు. మేఘనాధుడు హనుమంతుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మ ఆయుధాన్ని గౌరవించడానికి హనుమంతుడు ఇష్టపూర్వకంగా తనను తాను బంధించుకుని రావణుడి ఆస్థానానికి చేరుకున్నాడు. అక్కడ రావణుడి గౌరవం నిలబడాలంటే రాముడిని ఆశ్రయించాలని హెచ్చరించాడు.
లంకాదహనం..
రావణుడు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. తోకకు నిప్పు పెట్టిన తర్వాత హనుమంతుడు తన పరిమాణాన్ని పెంచుకుని తన మండుతున్న తోకతో లంక అంతటా తిరిగాడు. విభీషణుడి ఇల్లు తప్ప మొత్తం బంగారు నగరాన్ని బూడిద చేశాడు. రాక్షసులలో భయాన్ని కలిగించాడు.
సీతమ్మ తల్లి కుశలం..
లంకను దహనం చేసిన తర్వాత హనుమంతుడు సీతకు వీడ్కోలు పలికి, ఆమె చూడామణిని జ్ఞాపకార్థం తీసుకుని సముద్రం దాటి తిరిగి వచ్చాడు. పరిస్థితిని రాముడికి వివరంగా వివరించి, చూడామణిని రాముడికి ఇచ్చాడు.
ఇవీ రామాయణంలో సుందరకాండలో హనుమంతుడి లీలలు. వీటిని తలచుకున్నా, ఈ సంఘటనలలో హనుమంతుడి తెలివి, ధైర్యం, సాహసం, చాకచక్యం అన్నీ అర్థం చేసుకోవచ్చు. వీటిని గ్రహించిన వ్యక్తి, వాటిని తమ జీవితంలో ఆచరించిన వ్యక్తి హనుమ అనుగ్రహాన్ని పొందినట్టే..
*రూపశ్రీ.