Read more!

Auspicious Uttarayan

 

ఉత్తరాయణం మహా విశిష్టం

Auspicious Uttarayan

 

ఉత్తరాయణం మహా పుణ్యమైంది. ఈ కాలంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని, దేవతలకు మహా ప్రీతికరమైనదని చెప్తారు. మానవమాత్రులకు రాత్రి పగలు మాదిరిగా దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి అన్నమాట.

 

బ్రహ్మదేవుడు సృష్టిలో భాగంగా కాల విభజన చేశాడు. క్షణం, నిమిషం, ఘడియ, దినం, పక్షం, మాసం, ఆయనం (ఆరు నెలలు), సంవత్సరం అంటూ విభజించాడు. ఈ లెక్కల ననుసరించి మనకు సంవత్సరం అంటే దేవతలకు కేవలం ఒకరోజు. అంటే ఆరు నెలల కాలం దేవతలకు ఒక రాత్రి లేదా పగలుతో సమానం.

 

సూర్యుడు మేషం మొదలు మీనం వరకూ ఒక రాశి నుండి మరో రాశిలోకి మారతాడు. దీన్నే సంక్రమణం అంటారు. సూర్యుడు మకర రాశిలోకి మారడం లేదా ప్రవేశించడమే మకర సంక్రమణం. సూర్యుడు కర్కాటక రాశి నుండి ధనూరాశి వరకూ సంచరించే కాలం దక్షిణాయనం కాగా, మకర రాశి నుండి మిథునరాశి వరకూ సంచరించే కాలం ఉత్తరాయణం.

 

మరోరకంగా చెప్పుకుంటే సూర్యుడు భూమధ్య రేఖ నుండి ఆరు నెలలు ఉత్తర దిక్కుగా, ఆరు నెలలు దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. ఉత్తర దిక్కుగా ప్రయాణించే కాలం ఉత్తరాయణం, దక్షిణ దిక్కుగా ప్రయాణించే కాలం దక్షిణాయనం.

 

ముఖ్యంగా దేవతలకు పగటిపూట అయిన ఉత్తరాయణం పుణ్యప్రదమైంది. స్వర్గ ద్వారాలు తెరిచి ఉండే ఈ కాలంలో పూజలు చేయడం, యజ్ఞయాగాదులు నిర్వహించడం వల్ల దేవతలు మరింత ప్రసన్నం అవుతారని, కోరుకున్నవన్నీ నెరవేరుతాయని ధార్మిక గ్రంధాలు తెలియజేస్తున్నాయి. ఉత్తరాయణంలో చనిపోయినవారు తిన్నగా స్వర్గం చేరతారని కూడా పురాణాలు చెప్తున్నాయి. ఆషాఢమాస ఏకాదశినాడు.. దీన్నే ''శయనైకాదశి'' లేదా ''తొలి ఏకాదశి'' అంటారు.. ఆరోజు క్షీరసాగరంలో శేషతల్ప శాయి అయిన మార్గశిర మాస ఏకాదశినాడు నిద్ర నుండి మేల్కొంటాడు. కనుకనే ఈ ఏకాదశిని ''ఉత్థాన ఏకాదశి'' అంటారు. కనుక శ్రీమహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొని భక్తుల మొర ఆలకించి, సర్వ సంపదలూ సమకూర్చేది ఉత్తరాయణ కాలంలోనే. ''ఉత్థానం'' అంటే లేవడం. విష్ణుమూర్తి నిద్రనుండి లేస్తాడు కనుక ''ఉత్థాన ఏకాదశి''. వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి కనుక ''వైకుంఠ ఏకాదశి'' అని, ముక్కోటి దేవతలు కూడా మేల్కొంటారు కనుక ''ముక్కోటి ఏకాదశి'' అని అంటారు.

 

మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రేఖను దాటుతాడు. ఈరోజుతో సంధ్య సమయంలోనే కమ్ముకొచ్చే చీకట్లు తగ్గుతూ పోతాయి. చలి తీవ్రత తగ్గుతుంది.

 

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన వెంటనే వచ్చే ఇరవై ఘడియలు మరీ పవిత్రమైనవి. ఇందుకో ఉదాహరణ కూడా ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు దక్షిణాయనంలో గాయపడ్డాడు. కానీ ఆయన ఉత్తరాయణ పుణ్యకాలంలో చనిపోవాలనే ఉద్దేశంతో మరణాన్ని వాయిదా వేశాడు. ఉత్తరాయణ పుణ్య ఘడియలు వచ్చేవరకూ అంపశయ్యపై పడుకున్నాడు. ఆ తర్వాతే తనువు చాలించాడు. మకర సంక్రాంతి పరమ పవిత్రదినం కనుకనే బలిచక్రవర్తి సంక్రాంతినాడు భూమ్మీదకు వచ్చేందుకు విష్ణుమూర్తిని ప్రార్ధించి అనుమతి పొందాడు. వామనుడి రూపంలో వచ్చిన విష్ణుమూర్తికి మూడడుగుల స్థలం ఇస్తానని మాట ఇచ్చి, దాన్ని నిలబెట్టుకోవడంకోసం తనపై మూడో అడుగు వేయమని పాతాళానికి వెళ్ళాడు కదా బలిచక్రవర్తి. అలా పాతాళం చేరిన బలి, సంక్రాంతి రోజున భూమ్మీదికి వస్తాడు. అలా వచ్చే బలిచక్రవర్తిని ''సంక్రాంతి పురుషుడు'' లేదా ''సంకురమయ్య'' అంటారు.

 

ఉత్తరాయణంలో చేసే నదీస్నానం, పూజలు, తర్పణాలు, పురాణ శ్రవణం, దానధర్మాలు వెయ్యిరెట్ల ఫలితాన్ని ఇస్తాయి. పుణ్యలోకాలను ప్రసాదిస్తాయి. అందుకే కాయగూరలు, వస్త్రాలు, ధనధాన్యాలు మొదలు, గోవులు, వెండి, బంగారం వరకూ ఎవరి శక్తిని బట్టి వారు దానం చేస్తుంటారు. ఉత్తరాయణం తొలి ఘడియల్లో భూమ్మీద ఉన్న జలమంతా గంగాజలంతో సమానమౌతుంది.

 

telugu festival makar sankranti, Auspicious Uttarayanam, Uttarayanam is the day time for angels, Dhanurmasam and Uttarayanam auspicious period, vaikuntha doors opens in Uttarayan