Read more!

Sankranti Festival Recipes

 

సంక్రాంతి ప్రత్యేక పిండివంటలు

Sankranti Festival Recipes


పాలతాలికలు

కావలసిన పదార్థాలు

బియ్యప్పిండి - అరకిలో

బెల్లం - అరకిలో

పాలు - ఒక లీటరు

జీడిపప్పు , కిస్మిస్ - వంద గ్రాములు

యాలుకల పొడి - తగినంత

తయారుచేసే పద్ధతి

బియ్యాన్ని నానబెట్టి దంచిన పిండిని జల్లించి తగినన్ని నీళ్ళు పోసి బాగా కలపాలి. బెల్లాన్ని సన్నగా తరిగి ఉంచాలి. జీడిపప్పు, కిస్మిస్ లను నేతిలో వేయించి ఉంచుకోవాలి. పాలను కాచి అందులో సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత బియ్యప్పిండిని కారప్పూస గిద్దల్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా వత్తాలి. గడ్డ కట్టకుండా మెల్లగా తిప్పుతూ తరిగిన బెల్లం వేసి కలయతిప్పాలి. చివరికి మిగిలిన బియ్యప్పిండిని కూడా వేసి కలపాలి. పచ్చితనం పోయి చక్కగా ఉడికింది అనుకున్నాక ఇలాచీ, కిస్మిస్, జీడిపప్పు వేసి దించితే సరిపోతుంది.

 

అరిసెలు

కావలసిన పదార్థాలు

బియ్యం - కిలో

బెల్లం - ముప్పావు కిలో

నూనె - అరకిలో

నువ్వులు - వంద గ్రాములు

తయారుచేసే పద్ధతి

బియ్యం ఒకపూట ముందు నానబెట్టి ఎందపోయాలి. ఆ బియ్యాన్ని దంచి జల్లెడ పట్టాలి. బెల్లం తరిగి సుమారుగా కప్పుడు నీరు పోసి పాకం పట్టాలి. బెల్లంలో సన్నటి రజను లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది కనుక పాకం పల్చగా ఉండగా వడకట్టాలి. తర్వాత మరోసారి స్టవ్ మీద పెట్టి ముదురు పాకం రానివ్వాలి. అందులో బియ్యప్పిండివేసి ఉండ కట్టకుండా తిప్పాలి. తర్వాత దింపి, చల్లారిన పిండితో చిన్న ఉండలు చేసి బాదం ఆకు లేదా పాలిథిన్ కవరు మీద వేసి సన్నగా వత్తి నువ్వులను జల్లి, అరచేత్తో అద్ది బాణలిలో వేసి వేయించాలి. కాలిన అరిసెలను రెండు అపకల సాయంతో బాగా వత్తి, నూనె కారిపోయేటట్లు చేసి తీయాలి. తడి లేని డబ్బాలో భద్రపరచుకోవాలి.

 

కొబ్బరి వడలు

కావలసిన పదార్ధాలు

కొబ్బరికాయ – 1

బియ్యం – పావుకిలో

నూనె – పావుకిలో

ఉల్లిపాయలు – 2

పచ్చిమిర్చి - 6

కొత్తిమీర – 1 కట్ట

జీలకర్ర – 1 టీ స్పూను

వంట సోడా – చిటికెడు

కరివేపాకు – 2 రెబ్బలు

ఉప్పు - తగినంత

తయారు చేసే పద్ధతి

కొబ్బరిని తురమాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. బియ్యం కడిగి నానబెట్టాలి. నీళ్ళు ఓడ్చి, కొబ్బరి తురుము కలిపి రుబ్బుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి నూరి కలపాలి. వంటసోడా, ఉప్పు, తరిగిన కొత్తిమీర, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. బాణలిలో నూనె కాగనిచ్చి కలిపి ఉంచుకున్న పిండిని వడల్లా వత్తి ఎర్రగా వేయించుకోవాలి. కొబ్బరి వడలు క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి.


చెక్క గారెలు

కావలసిన పదార్థాలు

బియ్యప్పిండి - 4 పావులు

శనగపప్పు - అర్ధపావు

నూనె - కిలో

వెన్న – కప్పుడు

పచ్చిమిర్చి - వంద గ్రాములు

కరివేపాకు - పది రెబ్బలు

అల్లంవెల్లుల్లి పేస్టు - కొద్దిగా

ఉప్పు - తగినంత

తయారుచేసే పద్ధతి

శనగపప్పును కడిగి ఒక గంటసేపు నానబెట్టి పక్కన ఉంచాలి. బియ్యప్పిండిలో శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, వెన్న, ఉప్పు, కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్టు, తగినన్ని నీళ్ళు వేసి బాగా కలపాలి. అరటి ఆకు లేదా పాలిథిన్ కవరు మీద కొద్దిగా నూనె రాసి, పిండిని సన్నటి గారెలుగా చేసి వేయించుకోవాలి. ఈ చెక్కగారెలు పదిరోజులు నిలవుంటాయి.

 

రవ్వ పులిహోర

కావలసిన పదార్ధాలు

రవ్వ – అరకిలో 

నూనె - ముప్పావు కిలో

చింతపండు - వంద గ్రాములు

శనగపప్పు - చారెడు

మినప్పప్పు - చారెడు

పల్లీలు - అర కప్పుడు

పచ్చిమిర్చి - పది

ఎండుమిర్చి - పది

కరివేపాకు - నాలుగు రెబ్బలు

పసుపు - కొద్దిగా

ఆవాలు - తగినన్ని

ఉప్పు - తగినంత

తయారుచేసే పద్ధతి

చింతపండు నానబెట్టి గుజ్జు తీసి ఉంచుకోవాలి. ఒక పాత్రలో సుమారుగా ఒక లీటరు నీళ్ళు పోసి మరిగిన తర్వాత అందులో రవ్వ వేసి పొడిపొడిగా ఉడికించి దించాలి. పైన రెండు గరిటెల నూనె పోసి మూత పెట్టాలి. కొంతసేపటి తర్వాత మూత తీసి బాల్చీలోకి తీయాలి. ఎంతమాత్రం ఉండలు కట్టకుండా చేత్తో చిదిమి పసుపు, ఉప్పు కలపాలి. మూకుట్లో నూనె పోసి తాలింపు దినుసులు వేసి వేగిన తర్వాత రవ్వ ముద్ద వేసి, చింతపండు గుజ్జు కూడా వేసి కలయతిప్పి కొద్దిసేపు స్టవ్ మీద ఉంచి, దించితే సరిపోతుంది.

 

Sankranti festival recipes, special recipes for pongal festival, sankranti festival sweets and hots, andhra recipes of sankranti festival, indian recipes of sankranti festival, sankranti rituals and recipes, pongal recipes palatalikalu and chekka garelu, sankranti festival and ariselu