బతుకే ఒక దేవత
బతుకే ఒక దేవత
భారతదేశమంతా ఆశ్వయుజమాసంలో వచ్చే పండుగను దీపావళి పేరుతో ఘనంగా జరుపుకొంటారు. కానీ తెలంగాణలో అంతకు నెలరోజుల ముందరే తమ జీవితాలను కాంతిమంతం చేసుకుంటారు. దసరా నవరాత్రులకు ఒక రోజు ముందరే మొదలయ్యే ఆ బతుకమ్మ పండుగ తెలంగాణకే ఓ తలమానికం. ప్రకృతిలోని భిన్న రూపాలలో దైవిక శక్తులను కొలుచుకోవడం మానవనైజం. కానీ బతుకునే ఒక దేవతగా, ఆ బతుకుని సంబరాలు చేసుకోవడాన్నే ఒక పండుగగా భావించడం గొప్ప విషయం.
అక్టోబరు తొలిరోజుల్లో వచ్చే మహాలయ అమావాస్య నాటికి ప్రకృతి సంబరాలకు సిద్ధంగా ఉంటుంది. నైరుతి అప్పటికి పూర్తిగా వెనక్కి మళ్లిపోతుంది. పొలం పనులు సజావుగా సాగిపోతుంటాయి. అప్పటివరకూ పడిన వర్షాలకు చెట్లన్నీ పూలతో కళకళలాడుతుంటాయి. ప్రకృతి మొత్తం బతుకమ్మ ఆడుతోందా అన్నంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అటు వర్షాకాలం కాదు, ఇంకా చలికాలం మొదలవలేదు. ప్రకృతిని ఆరాధించడానికి ఇంతకంటే గొప్ప తరుణం ఇంకేముంటుంది.
బతుకమ్మ పండుగ వెనుక చాలానే కథలు ఉన్నాయి. భూస్వాముల అకృత్యాలకు బలైపోయిన ఒక ఆడపిల్లకు ఇది గుర్తనీ; ధర్మాంగదుడనే చోళరాజుకి పుట్టిన కూతురు ఎన్నో బాలారిష్టాలను తట్టుకుని నిలబడటంతో ఆమె బతుకమ్మగా స్థిరపడిందనీ; వదినల సూటిపోటి మాటలను తట్టుకోలేక చనిపోయి, పూవుగా మారిన ఓ ఆడపడుచే బతుకమ్మ అనీ చెప్పుకొంటారు. కథ ఏదైనా వీటిలో మానవులే పాత్రలు కావడం, వారి గుర్తుగానే పండుగ చేసుకోవడం గమనించదగ్గ విషయం.
బతుకమ్మకు రూపమైనా, శిల్పమైనా పూలతోనే. పల్లల్లో సమృద్ధిగా కనిపించే తంగెడు, బంతి, చామంతి, గన్నేరు, గునుగు పూలను వరుసలు వరుసలుగా గోపురాకారంలో పేరుస్తారు. పైన తమలపాకులలో పసుపుముద్దను ఉంచడంతో బతుకమ్మ రూపాలనికి నిండుదనం వస్తుంది. సాయంత్రం వేళల్లో ఈ బతుకమ్మ చుట్టూ చేరి ఆడిపాడే ఆడవారితో పల్లె వాకిళ్లన్నీ మారుమోగిపోతాయి.
బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ, చప్పట్లు చరుస్తూ వారు పాడుకునే పాడలు… అచ్చమైన కష్టజీవుల జీవితాలను ప్రతిబింబిస్తాయి. తొమ్మిదిరోజుల పాటు బతుకమ్మను ఘనంగా జరుపుకొని ఆఖరిరోజున సద్దుల బతుకమ్మ పేరుతో ఆమెకు వీడ్కోలు పలుకుతారు. ఆ రోజున చెరువులో నిమజ్జనం చేసిన బతుకమ్మలు తేలుతూ వెళ్తుంటే, వాటి మీద పడుతున్న వెన్నెల కూడా పూల రంగులుగా ప్రతిఫలిస్తుంది. మళ్లీ బతుకమ్మ వచ్చే రోజుల కోసం ప్రకృతి సైతం ఎదురుచూస్తుంది.
- నిర్జర.