పొడవైన ఆడవారికి అనారోగ్యం తప్పదా!
మీరు మీ నేస్తాలకంటే కాస్త పొడవు ఎక్కువగా ఉన్నానని సంబరపడిపోతున్నారా. పడండి... పడండి... పనిలో పనిగా మీ పోషకాహారం విషయంలో కూడా కాస్త జాగ్రత్తపడండి. లేకపోతే మీ పొడవే మీకు శాపంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.
ఇదీ పరిశోధన
పొడవనేది మన జన్యువుల మీద ఆధారపడి వచ్చే లక్షణం. అయితే ఆడవారి పొడవుకీ, వారి ఆరోగ్యానికీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో చూడాలనుకున్నారు వెంజీ అనే పరిశోధకురాలు. ఇందుకోసం ఆమె 1980లో ప్రభుత్వం వద్ద తమ ఆరోగ్య వివరాలు నమోదు చేయించుకున్న 68 వేలమంది స్త్రీల గణాంకాలను సేకరించారు. ఇందులో భాగంగా వారి ఎత్తు, బరువు, నడుము కొలత, పొగతాగడంలాంటి వ్యసనాలు, ఆహారపు అలవాట్లు, శారీరిక శ్రమ... లాంటి అనేక విషయాలను పరిశీలించారు. అప్పట్లో వారి సగటు వయసు 44 ఏళ్లు. అంటే ఇప్పటికి వారందరూ కూడా ఇంచుమించుగా 70 ఏళ్లు దాటినవారే అన్నమాట!
ఇదీ సంబంధం
1980 నాటి వివరాలను మళ్లీ తాజా వివరాలతో పోల్చిచూశారు వెంజీ. 70 ఏళ్లు దాటాయి కాబట్టి వీరిలో మతిమరపు, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తడం సహజం. అయితే ఆ సమస్యలకీ పొడవుకీ సంబంధం ఉందేమో తెలుసుకునేందుకు వారిని ఐదు భాగాలుగా విభజించారు. ఆశ్చర్యం ఏమిటంటే వీరిలో పొడవు ఎక్కువ ఉన్నవారిలో ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలింది. వీరి కుటుంబనేపథ్యం, జాతి మూలాలు, వివాహం... వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నా కూడా ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది.
ఇదీ ఉపాయం
పొడవుగా ఉండే ఆడవారికే ఎందుకీ ఆరోగ్య సమస్యలు అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు పరిశోధకులు. బహుశా వారి పొడవుతో పాటుగా వచ్చే ఇతర జన్యువులే ఈ సమస్యలకు కారణం అని ఊహిస్తున్నారు. మరి పొడవుగా ఉంటే దానికి ఫలితం అనుభవించాల్సిందేనా! అంటే దానికి మాత్రం ఓ స్పష్టమైన జవాబు సిద్ధంగా ఉంది. తమ ఆహారపు అలవాట్ల విషయంలో అశ్రద్ధ చేయని స్త్రీల మీద పొడవు ప్రభావం అంతగా కనిపించలేదట. అంటే పోషకాహారమే ఈ శాపానికి మందన్నమాట!
- నిర్జర.