శ్యామలా నవరాత్రులు చేస్తే ఇంత గొప్ప ఫలితం ఉంటుందని తెలుసా...

 

శ్యామలా నవరాత్రులు చేస్తే ఇంత గొప్ప ఫలితం ఉంటుందని తెలుసా...

 


నవరాత్రుల గురించి చాలామందికి తెలిసింది కేవలం దేవీ నవరాత్రులు మాత్రమే. ఆ తరువాత గణేష్ నవరాత్రులు కూడా చేస్తారు. అయితే హిందూ ధర్మంలో తెలుగు పంచాంగంలో ఏడాదిలో నాలుగు నవరాత్రులు ఉంటాయి.  వాటిలో ఒకటే శ్యామలా దేవి నవరాaత్రులు. అసలు శ్యామలా దేవి ఎవరు అంటే.. శ్యామలా దేవి ఆ సరస్వతి దేవి స్వరూపం అని అంటారు నండూరి శ్రీనివాస్ గారు.  లిలితాదేవి భండాసురుడి మీద  యుద్దానికి వెళ్తున్నప్పుడు లిలితా దేవికి  నాలుగు వైపులా  నాలుగు శక్తులు ఉంటాయి.  ఆ నాలుగు శక్తులు నాలుగు దేవతా స్వరూపాలు. ఆ నాలుగు దేవతా స్వరూపాలలో శ్యామలా దేవి కూడా ఉంటారు. ఈ శ్యామలా దేవి నవరాత్రులు జనవరి 30 వ తేదీ నుండి ప్రారంభం అవుతున్నాయి. మాఘమాసం ప్రారంభం నుండి, మాఘమాసం నవమి వరకు వచ్చే 9 రోజులే శ్యామలా నవరాత్రులు అనబడతాయి.  అయితే శ్యామలా దేవి నవరాత్రులు ఎవరు చేయవచ్చు? శ్యామలా నవరాత్రులు చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి? ఎలా చేసుకోవాలి? తెలుసుకుంటే..

శ్యామలా నవరాత్రుల  ఆరాధన ఇచ్చే ఫలితాలు..

శ్యామలా నవరాత్రులు చేయడం వల్ల నాలుగు ఫలితాలు లభిస్తాయట.   వాటిలో ఒకటి.. వాక్కు.. శ్యామలా దేవిని ఆరాధిస్తే.. శ్యామలా నవరాత్రులు చేస్తే అద్బుతమైన వాక్కును, విద్యను ప్రసాదిస్తుందట.  చిన్న పిల్లలైనా, మనసులో ఏదైనా నేర్చుకోవాలి అనే కోరిక ఉన్నవారు అయినా శ్యామలా నవరాత్రులు చేస్తే  వారు నేర్చుకోవాలి అనుకున్న విద్య వారిని  వరిస్తుంది.  అంతే కాదు జ్ఞాపకశక్తి కూడా  పెరుగుతుంది.  

ఉద్యోగాలు కావాలని అనుకునేవారు, ఉన్నత పదవులు పొందాలని అనుకునేవారు శ్యామలా దేవిని పూజిస్తే ఆ తల్లి అనుగ్రహంతో అన్నీ చేకూరుస్తుందట.

వశీకరణ అనే మాట  అందరూ వినే ఉంటారు. వశీకరణ అంటే ఆకర్షించే శక్తి.  శ్యామలా నవరాత్రులు చేస్తే వశీకరణ శక్తి లభిస్తుందట. వశీకరణం అంటే మనుషుల్ని స్వార్థం కోసం ఆకర్షించడం కాదు.. వశీకరణం అంటే  ఏదైనా పని చేయాలి అనుకుంటే పరిస్థితులు అనుకూలించడం,  అందరూ ఆ పని జరగడానికి సహకరించడం. అలాగే ఏదైనా మాట్లాడినప్పుడు, చెప్పినప్పుడు  ఆ విషయాన్ని అందరూ వినేలా ఉండటం. ధర్మ బద్దమైన విషయాలు అయితేనే ఇవి కూడా జరుగుతాయి. లేకుంటే ఆ తల్లి ధర్మ సంబద్దమైన పనులకు తోడ్పాటు ఇవ్వదు.

భార్యాభర్తల మధ్య కలహాలు,  గొడవలు ఉన్న్టటైతే వారి మధ్య సమస్యలను దూరం చేసి వారిని దగ్గర చేస్తుందట శ్యామలా దేవి. అందుకే శ్యామలా నవరాత్రులు చేయాలి అంటారు.శ్యామలా నవరాత్రులు చేస్తే భార్యాభర్తలు పరస్పరం సయోధ్య కలిగి అన్యోన్యంగా ఉంటారట.

ఎలా పూజించాలి..?

శ్యామలా అమ్మవారిని పూజించాలని, శ్యామలా నవరాత్రులు చేయాలని అనుకునేవారు శ్యామలా సహస్ర నామాలు కానీ, శ్యామలా దండకం కానీ పారాయణ చేయవచ్చు. లేకపోతే శ్యామలా దేవి స్తుతి కూడా పారాయణ చేయవచ్చు. శ్యామలా స్తుతిలో చాలా మంత్రపూరితమైన రహస్యాలు ఉన్నాయని పురాణ పండితులు చెబుతున్నారు.  దేవీ నవరాత్రులను దీక్ష తీసుకుని చేసినట్టే శ్యామలా నవరాత్రులను దీక్ష తీసుకుని చేయవచ్చు. 9 రోజులు చేయలేని మహిళలు వారికి ఎదురయ్యే నెలసరి రోజులు మినహా 5 వ రోజు నుండి కూడా చేయవచ్చు. ఎన్ని రోజులు అందుబాటులో ఉంటే అన్ని రోజులు చేయవచ్చు.  9 రోజులు దీక్ష తీసుకుని చేయలేని వారు సాధారణంగా శ్యామలాదేవిని పూజించి, శ్యామలా సహస్రం,  శ్యామలా  దండకం, శ్యామలా స్తుతి వంటివి పారాయణ చేసుకోవచ్చు. అమ్మ వారికి బెల్లంతో  చేసిన పాయసం,  గారెలు, చక్కెర పొంగలి, పులిహోర, అరటిపళ్లు.. ఇలా వీటిలో ఏదో ఒకటి రోజుకు ఒకటి నైవేద్యం పెట్టవచ్చు.

ఎవరు చేయాలి?

 చిన్న పిల్లలు, వివాహం అయిన మహిళల నుండి ఎవరైనా శ్యామలా నవరాత్రులు చేయవచ్చు.  కనీసం నవరాత్రులు  చేయలేకపోతే ఈ 9 రోజులలో శ్యామలా దేవి ఆరాధన చేసుకోవచ్చు. శ్యామలా దండకం, శ్యామలా స్తుతి వంటివి ప్రతిరోజూ కూడూ దేవుడి పూజ సమయంలో చెప్పుకోవచ్చు.

                                  *రూపశ్రీ.