బౌద్ధమత వ్యాప్తి గురించి స్వామి వివేకానంద చెప్పిన కారణాలివే!
బౌద్ధమత వ్యాప్తి గురించి స్వామి వివేకానంద చెప్పిన కారణాలివే!
భారతదేశంలో పురోహితులకూ, ప్రవక్తలకూ సాగుతూ ఉండిన సంఘర్షణలో కలిగిన విజయమే బుద్ధుడిలో మూర్తీభవించింది. భారతదేశంలోని పురోహితుల విషయమై ఒక్క మాట చెప్పొచ్చు. వారికి ఏనాడూ మత విషయమై అసహనం లేదు. అన్యమతస్థుల నెన్నడూ వారు హింసించలేదు. మతాభిప్రాయాల వల్ల ఎవరినీ వారెన్నడూ బాధించలేదు. అయితే వారూ పురోహితులందరికీ ఉన్న విచిత్ర లోపాల వల్ల బాధపడ్డారు. వారూ అధికారాన్ని కాంక్షించారు. తత్ఫలితంగా తమ మతావలంబులను నిర్వీర్యులను చేశారు.
ఈ కలుపుమొక్కలన్నిటినీ బుద్ధుడు తొలగించివేశాడు. అత్యద్భుత సత్యాలను అతడు బోధించాడు. యావత్ ప్రపంచానికీ అతడు తన మతాన్ని బోధించాడు. 'మానవులంతా సమానులే. ఎవరికీ ప్రత్యేకాధిక్యాన్ని చూపనవసరం లేదు' అని సమత్వాన్ని బోధించిన మహాత్ముడు బుద్ధుడు. పురోహిత వర్గానికీ, తదితర కులాలకూ మధ్యనున్న భేదాలను బుద్ధుడు నిర్మూలించాడు. ఎంతటి నికృష్ట స్థితిలో ఉన్నవారైనా పరమోత్కృష్ట ప్రయోజనాలకు అర్హులేనని, నిర్వాణ ప్రాప్తికి ద్వారాన్ని అందరికీ తెరిచి ఉంచాడు. అతడు కేవలం మాటలు చెప్పి ఊరుకోలేదు. లోకం నిమిత్తం తన జీవితాన్ని త్యజించడానికి సంసిద్ధుడయ్యాడు. "జంతువును బలి ఇవ్వడం మంచిపనైతే, మనిషిని బలి ఇవ్వడం అంత కంటే మంచి పని కదా” అన్నాడతడు. బలి అయ్యేందుకు సిద్ధమయ్యాడు. జంతుబలి మరొక మూఢవిశ్వాసం.
హైందవులు దేన్నైనా విసర్జించగలరు, కానీ దేవుణ్ణి మాత్రం కాదు. దేవుడు లేడనడం భక్తికి ఆధారంగా ఉన్న పునాదిని తీసివెయ్యడమే. దేవుణ్ణి, భక్తినీ హైందవులు అంటి పెట్టుకొని ఉండక తప్పదు. ఏ పరిస్థితుల్లోగాని వీటిని హైందవులు విడనాడరు. బుద్ధుడి సందేశంలో దేవుడు లేడు, ఆత్మ లేదు కేవలం కృషి మాత్రమే ఉంది. కృషి ఎందుకోసం? స్వార్థం కోసం కాదు. 'అహం' భ్రాంతే. ఈ భ్రాంతి తొలగిపోగానే మన యథార్థ తత్త్వమేదో అదే మనమవుతాం. ఈ స్థాయిని అందుకొని కేవలం లక్ష్యం కోసమే కృషి చేసేవారు, ఉదార లక్ష్యసిద్ధికై నడుం కట్టేవారు ప్రపంచంలో ఏ కొద్ది మంది మాత్రమే ఉంటారు.
అయినా, బుద్ధుని మతం శీఘ్రగతిలో వ్యాప్తి గాంచింది. మానవ చరిత్రలోనే మొదటిసారిగా విశాల హృదయం నుండి దివ్యప్రేమ పొంగి పొరలింది. అది సమస్త మానవకోటి సేవకే కాక, సమస్త జీవకోటి సముద్ధరణకూ అర్పితమైంది. సకల జీవులకూ బాధల నుండి విముక్తి కలిగించడానికి మార్గం కనిపెట్టే ఆలోచన తప్ప ఆ ప్రేమకు వేరొక తలంపు లేదు. ఈ కారణం చేతనే బౌద్ధమతం అంత వేగంగా వ్యాపించింది.
◆నిశ్శబ్ద.