గ్రహణ సమయంలో పాటించే ఆచారాలు - ఆంతర్యాలు

 

గ్రహణ సమయంలో పాటించే ఆచారాలు - ఆంతర్యాలు

గ్రహణం అంటే మనకు స్పురించేవి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం! సూర్యుడినీ, చంద్రుడినీ మనం ప్రత్యక్ష దైవాలుగా పూజిస్తున్నాం. అప్పటి వరకూ ప్రకాశంగా కనిపిస్తున్న సూర్యుడు, చంద్రుడు హఠాత్తుగా కాంతివిహీనం కావడం ప్రారంభమై, కొద్దిసేపు అదృశ్యమై, తిరిగి ప్రకాశవంతంగా మారడాన్ని గ్రహణం అని మనం భావిస్తున్నాం. గ్రహణాలకు సైన్స్ చెప్పే కారణాలేమిటో మనకు తెలుసు. అయితే గ్రహణ సమయాలలో భారతీయులు అనేక ఆచారాలు పాటిస్తారు.

గ్రహణ సమయంలో నీటి పాత్రల పైనా, ఊరగాయ పచ్చళ్ళ జాడీల మీద దర్భలు వేస్తారు. గర్భిణీలను బయటకు రానివ్వరు. వారిని గ్రహణం చూడనివ్వరు. అస్సలు కదలకుండా జాగ్రత్తగా పడుకోమంటారు. గ్రహణ సమయంలో ఏ ఆయుధాలూ పట్టుకోవద్దు అంటారు. ఆఖరికి చాకుతో కూరగాయలు కూడా తరక్కూడదని పెద్దలు చెప్తారు. ఇలాంటి ఆచారాలెన్నో పాటిస్తున్నాము. వీటిని మూఢ నమ్మకాలుగా, అర్థం లేని ఆచారాలుగా భావిస్తున్నాము. ఇవి నిజంగా అర్థం లేని ఆచారాలేనా? గ్రహణ సమయంలో మనం పాటించే ఆచారాలు అర్థం లేనివి కాదు. అందులో సైన్స్ తో ముడిపడిన అంశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలోకి రావడం వల్ల మూడు గ్రహాల మధ్య పరస్పరం ఆకర్షణ శక్తి స్వల్పంగా మారుతుంది. ఈ ఆకర్షణ శక్తి ప్రభావం ఆరుబయట సంచరించే గర్భిణీ స్త్రీల గర్భస్థ శిశువుపై పడే అవకాశం ఉంటుంది కనుక, ఎక్కడికీ వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ఇలాంటివి వింటున్నప్పుడు మనకేమనిపిస్తుంది? మన పూర్వులు పెట్టిన ఆచారాలు శాస్త్రాన్ని నిర్వచించకపోయినప్పటికీ, అర్ధవంతమైనవే అనిపించడంలేదూ?!