ఆశించిన ఫలితం దక్కలేదనేవారికి అద్భుతమైన సమాధానం!
ఆశించిన ఫలితం దక్కలేదనేవారికి అద్భుతమైన సమాధానం!
మనిషికి జీవితంలో చాలా విషయాలలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటికి కారణం మనిషి ఆలోచనలు. ఆ ఆలోచనల్లో నిండిపోయిన భావాలు. ఈ కాలం మనిషికి ఆశించడం ఎక్కువ. ఆశించడం అనే గుణం ఎక్కువగా ఉంటే ప్రతి పనిలోనూ తనకు ఒరిగే ప్రయోజనాన్ని, తను కోరుకునే లాభాన్ని గురించే మనసంతా ఉంటుంది తప్ప పని గురించి అంతగా పట్టింపు ఉండదు.
ప్రయత్నానికి ముందే 'ఎంత ప్రయోజనం కలుగుతుంది?' అని అంచనాలు వేసుకోవడం కొందరు చేస్తుంటారు. అది క్రమంగా పెరిగి పెద్దదై అలవాటుగా మారిపోతుంది. దాని కారణంగా ఎప్పుడు ఏ పని మొదలు పెట్టినా మంచి జరగదు. ఎందుకంటే మనిషి అంచనాలు అనేవి ఒక నియమితంగా ఉండవు. వాటికి అదుపు ఉండదు. ఒకదాని వెంట ఒకటి ఆశల దారం రెపరెపలాడుతూ కనబడితే ఆకాశంలో ఎగిరే గాలిపటాల మీద ఎంత మనసు కలుగుతుందో అలాగే అంచనాలు కూడా మనిషి మొదలుపెట్టే పని విషయంలో కుదురుగా ఉండవు. వాటి కారణంగా మొదలుపెట్టేవి ఏవి సరిగ్గా జరగవు. దాంతో కొంతమంది చాలా భయపడతారు. తాము మొదలుపెట్టే పని ఎందుకో సరిగా జరగడం లేదని అనుకుంటారు. ఇంకా మనసులో ఉన్న అనుమానాలు, మూర్ఖత్వాలు అన్నీ జోడించి గ్రహాచారం, అపశకునం, ముహూర్తం వంటి కారణాలు ఆ జరగని పనులకు అపాదించుకుంటారు. కావాలంటే వాటికి ఎన్నెన్నో పరిష్కారాలు చేయించుకుంటారు. అంత చేసినా వారు అనుకున్నది జరగదు.
ఎందుకు??
ఆశించడం అనే కారణంతో ఫలితాన్ని ముందే నిర్ణయించుకోవడం వల్ల. చేసే పనికి దక్కే ఫలితాన్ని తీసుకున్నప్పుడు మనిషికి ఎలాంటి ఆందోళన, అసంతృప్తి ఉండదు. కానీ ముందుగానే ఇలా ఉండాలి ఫలితం అని ఆశిస్తే అపుడు మనిషికి నిరాశ ఎదురయ్యే సందర్భాలే ఎక్కువ ఉంటాయి. అదంతా అర్థం చేసుకోకుండా కొందరు ఎందుకులే ప్రయత్నించడం అని నిరుత్సాహం. ఏదో చెప్పలేని ఆందోళన మొదలయిన కారణాలు అన్నింటివల్ల నాలో అసమర్ధత బాగా పెరిగింది అనుకుంటారు. అలాంటి సమస్యకు భగవద్గీతలో ఒక శ్లోకం గొప్ప పరిష్కారం చెబుతుంది.
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ॥ సిద్ధ్యసిద్ద్యోః సిమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ॥
ఈ శ్లోకం చెప్పే అర్థం ఏమిటంటే మనిషి సంకల్పంలోనే పొరపాటుంది. పనిని మొదలుపెట్టేటప్పుడు దాన్ని సక్రమంగా చెయ్యాలి అనే ఆలోచనతో కాకుండా ఏదో పెద్ద ప్రయోజనాన్ని కోరి పని మొదలు పెట్టడం చాలా తప్పు. దైవం అనుకూలించని ఫలితం కలగకపోతే వెంటనే ఆశించిన ఫలితం రాలేదే అని తల్ల కిందులై పోవడం, నిరుత్సాహపడిపోవడం ఆందోళన పడటం జరుగుతుంది. వీటన్నికి కారణం కేవలం ఫలా పేక్ష. అంటే పలితాన్ని ఆశించడమే వీటికన్నింటికి కారణం.
ఫలసిద్ధి కలిగినా కలగకపోయినా, రెండింటి విషయంలో సమభావనతో కర్మలను ఆచరించాలి. ఆ సమభావననే యోగమంటారు. నమభావనతో వ్యవహరించే వారికి ఫలాసంగం ఉండదు, అంటే ఫలితం మీద ఆశ కానీ, ఫలితం పట్ల ఆసక్తి గానీ, ఫలితం మంచి వచ్చినా చెడు వచ్చినా అది నాది అనే భావన కానీ ఉండదు. ఎందుకంటే ఏమి జరిగినా భగవంతుడిదే అనే ఆలోచనే దానికి కారణం. ఇలాంటి వారికి పుణ్యపాపాలు అంటవు. వారే మోక్షానికి అర్హులు.
◆నిశ్శబ్ద.