సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలిగించే సుబ్రహ్మణ్యుడు
సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలిగించే సుబ్రహ్మణ్యుడు
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం శక్తి, అది విజ్ఞానానికి, తెలివికీ ప్రతీక. పదునైన ఈటెను ఆయుధంగా ధరించి, సాధకులు తాము సాన చేసేందుకు ఉపకరించే మనస్సును, ఏకాగ్రతలో నడుపవలెననిన, కుశాగ్రబుద్ధితో చరించవలెనన్న భావాన్ని కలిగించే జ్ఞాన వైశిష్ట్యం కలవాడు. పాము కాల స్వరూపం కనుక జ్ఞాన స్వరూపుడైన స్వామి కాలాతీతుడు. ఆయన సన్నిధిలో ద్వేషాలు, దోషాలు కలిగేందుకు వీలులేదని సత్యవాహనంలోని అంతరార్థం.
శివుడు ధ్యాననిమగ్నుడై ఉన్న సమయంలో తపస్సును భగ్నం చేయడానికి మన్మథుడు కామ శరములు ప్రయోగించగా ఆగ్రహించిన శివుడు తన జ్ఞాన నేత్రం తెరవగనే మన్మథుడు భస్మమైయినాడు. శివుని జ్ఞాన నేత్రంనుండి కదలిన జ్ఞానాగ్ని మన్మథుని మసి చేసి ఆకాశ మార్గాన పయనిస్తుండగా, వాయువు సంగ్రహించి, మోయలేక అగ్నిదేవునికి ఇవ్వగా, అగ్నిదేవుడు ఆ దివ్య తేజస్సును గంగాజలమందు వదిలివేయగా, ఆ తేజస్సును భరించలేని గంగా, రెల్లుగడ్డి పొదనందు పడవేయగా ‘కుమారస్వామి’ ఆవిర్భవించాడు.
శ్రీ సుబ్రహ్మణుని రెల్లు గడ్డినందు జన్మించిన పిదప ఆరుగురు కృత్తికలు పెంచారని అందుకే ఆయనకు షట్ ముఖులు వచ్చి ‘షణ్ముఖుడు’ అనే పేరువచ్చింది. కృత్రికలచే పెరిగినవాడుకనుక ‘కార్తికేయుడు’ అయ్యాడు. ‘‘కృత్తికానామ్ అపత్యం పుమాన్ కార్తికేయం’. కృత్తికా నక్షత్రానికి సంబంధించిన సంతాన పుత్రుడెవరో ఆయనే కార్తికేయుడు. కృత్తిక అంటే కత్తెర అని అర్థం. ఈ శరీరాన్ని ఆ కృత్తిక కృత్రికా నక్షత్రానికి తగినట్లు ఆరు చోట్ల కత్తిరించబడిన వస్తువు ఏడు ముక్కలయింది. ఆ ఏడు ముక్కలే శరీరంలో కనిపించే సప్త చక్రాలు. మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరన, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారాలు.
శ్రీ మహావిష్ణువు లేక శివుడు పరమ పురుషుడు, మహాలక్ష్మీ లేక ఉమాదేవి అవ్యక్తశక్తి. వీరిరువురి సమైక్య, సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కంద పురాణం తెల్పుతోంది. కుమారస్వామిని ఆరాధిస్తే శివశక్తులను, లక్ష్మీనారాయణులను కలిసి ఆరాధించినట్లే. ప్రకృతి పురుషుల ఏకత్వం స్వామితత్వం. షట్కోణ యంత్రం షణ్ముఖ తత్వానికి ప్రతీక. ద్వికోణాల సంగమం ఊర్థ్వంగా సాగే త్రికోణం శివతత్వం, అధోముఖంగా సాగే త్రికోణం శక్తితత్వం. ఈ శివశక్తుల సంకేతమైన త్రికోణాల సంగమం షట్కోణం. ఈ రెండు త్రికోణాల వల్ల ఏర్పడ్డ షట్కోణాలు షణ్ముఖాలకు ప్రతీకలు.
మార్గశీర్ష మాసంలో శుద్ధ షష్ఠి, అమావాస్య వెళ్లిన ఆరవ రోజును సుబ్రహ్మణ్యషష్ఠి అని, ‘సుబ్బరాయ్ షష్ఠిగా, స్కంద షష్ఠిగా జరుపుకుంటారు. శ్రీ సుబ్రహ్మణ్యుడంటే ‘సు’ అంటే మంచి, ‘బ్రహ్మణ్యుడు’ అంటే వికాసము, తేజస్సు కలవాడని అర్థం.
సర్ప, రాహు, కేతు దోషాలున్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారములతో అర్చించడంవల్ల సత్ఫలితాలు పొందుతారని సంతాన భాగ్యానికి నోచుకోని స్ర్తి, పురుషులు ఈ రోజున సర్పపూజలు చేసి, వెండి పడగలను పుట్టలో వేసినట్లైతే సత్‌సంతాన యోగ భాగ్యం కల్గుతుందనే విశ్వాసం. మంత్రగాళ్ళు ఈ రోజున స్కందుని ఆరాధించి మంత్రాన్ని వశ్యం చేసుకునే శక్తిని పొందుతారు. బ్రహ్మచారియైన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచెల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం.
ఈ స్వామి అర్చనవల్ల కుటుంబంలో శాంతి, సౌఖ్యాలు, ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయి.