సీతమ్మ అగ్ని ప్రవేశం చేసిన చోట… ఇప్పటికీ వేడి నీళ్లు!
సీతమ్మ అగ్ని ప్రవేశం చేసిన చోట… ఇప్పటికీ వేడి నీళ్లు!
రామాయణం ఒక పుక్కిటి పురాణం కాదు… మన మధ్యనే జరిగిన ఓ వాస్తవ గాథ అన్నది భక్తుల నమ్మకం. అందుకు అనుగుణంగా రామాయణంలోని ప్రతి ఘట్టానికీ సంబంధించిన స్థలపురాణాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. శ్రీరామనవమి సందర్భంగా ఆయా పుణ్యక్షేత్రాల్లో సీతారాములను తల్చుకుంటూ, నాటి ఘట్టాలను నెమరువేసుకుంటూ అంగరంగ వైభవంగా సంబరాలు జరుగుతాయి. వాటిలో ఓ అరుదైన స్థలం సీతామర్హి!- సీతమ్మవారు పుట్టినచోటు!
సీతమ్మ భూదేవి ప్రతిరూపం. ఇంద్రుని ప్రసన్నం చేసుకునే క్రతువులో భాగంగా జనకమహారాజు… నాగలితో దున్నుతున్నప్పుడు ఒక కుండ అడ్డు తగిలిందనీ, అందులో సీతమ్మ ఉందని చెబుతోంది రామాయణం. బీహార్ రాష్ట్రంలో ఉన్న సీతామర్హి అనే చోటే ఇది జరిగిందట. ఈ స్థలపురాణానికి అనుగుణంగా ఇక్కడ ఎన్నో కట్టడాలు కనిపిస్తాయి.
సీతమ్మ దొరికిన చోట, జనక మహారాజు ఒక పెద్ద చెరువును తవ్వించారట. ఆమె వివాహ సందర్భంగా సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఆయనే స్వయంగా స్థాపించారట. ఈ ప్రదేశాన్ని జానకి కుండ్ అని పిలుస్తారు. ఇక ఆ ఊరిలోనే సీతమ్మ జన్మించినందుకు గుర్తుంగా, భవ్యమైన ‘జానకి మందిరం’ కూడా నిర్మించారు. కాలక్రమంలో ఈ ప్రదేశం అంతా కూడా అడవిలా మారిపోయిందట. ఇలాంటి సమయంలో బీర్బల్ దాస్ అనే స్వామీజీకి సీతామర్హి గురించి దివ్వదర్శనం కలిగింది. ఆయన పూనికతో నాటి విశేషాలన్నీ మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చాయి.
సీతామర్హిలోనే మరో విశేషం కూడా ఉంది. లంక నుంచి వచ్చిన సీతమ్మ స్వచ్ఛతను నిరూపించుకొమ్మంటూ రాముడు ఆదేశిస్తాడు. అప్పుడు ఆమె అగ్నిప్రవేశం చేస్తుంది. ఈ ఘట్టం జరిగింది కూడా సీతామర్హిలోనే అని చెబుతారు. ఇందుకు నిరూపణగా ఇక్కడ వేడి నీటి బుగ్గలు కనిపిస్తాయి. సీతమ్మవారిని దహించలేకపోయిన అగ్ని, అక్కడి భూగర్భంలోని నీటిలోకి చేరి ఇలా ఉబికి వస్తోందని భక్తులు నమ్ముతారు. మాఘపౌర్ణమి రోజున ఈ వేడి నీటి బుగ్గలలో స్నానం చేసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు.
బీహార్ లోని పాట్నా, ముజఫర్ పూర్, దర్భంగ లాంటి ముఖ్య పట్నాలన్నింటి నుంచి కూడా సీతామర్హిని చాలా తేలికగా చేరుకోవచ్చు. ఉత్తర భారతదేశంలో చాలామందికి తెలియన అరుదైన పర్యటక కేంద్రాల్లో ఇది కూడా ఒకటి.
..నిర్జర