సకల రోగాలు నశించిపజేసే సోమనాథుడి వృత్తాంతం!
సకల రోగాలు నశించిపజేసే సోమనాథుడి వృత్తాంతం!
కార్తీక మాసంలో శివ నామ స్మరణకు ఎంతో విశిష్టత ఉంది. కేవలం శివ పంచాక్షరీ మంత్రంతోనే ముక్తిని సాధించవచ్చు అంటారు పురాణ పండితులు, పెద్దలు. అయితే పరమేశ్వరుడు జ్యోతిర్లింగాల రూపంలో వెలిశాడు. ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకంలో సౌరాష్ట్రే సోమనాథంచ అని ఉండటం అందరికీ తెలిసిందే. అయితే ఈ సోమనాథ ఆలయం ఎక్కడుంది?? దాని విశిష్టత ఏంటి?? ఇక్కడ శివుడు వెలసిన కారణం ఏమిటి?? వంటి విషయాలు తెలుసుకుంటే…..
సౌరాష్ట్ర దేశంలో ప్రభాస తీర్ధమున్నది. దక్ష ప్రజాపతికి అశ్వని, భరణి మొదలయిన ఇరవై ఏడుమంది పుత్రికలు ఉన్నారు. వారిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు దక్షప్రజాపతి. వీరందరూ నక్షత్రాలు. అయితే చంద్రుడికి తన భార్యలందరిలోకి రోహిణి మీద ఎక్కువ ప్రేమ, అనురాగము కలిగి, ఎక్కువ కాలము ఆమె వద్దనే గడిపేవాడు. ఈ విషయం మిగిలిన భార్యలకు బాధాకరంగా మారింది. వారంతా ఒక రోజు తండ్రియైన దక్షప్రజాపతి వద్దకు వెళ్లి, చంద్రుడు తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని మొర పెట్టుకున్నారు.
దక్షప్రజాపతి చంద్రుని పిలిపించి "చంద్రా! నా కుమార్తెలు ఇరవై ఏడుమందిని నీకిచ్చి వివాహం చేశాను. నువ్వు అందరినీ సమంగా చూడాలి కదా!! కాని నువ్వు ఒకరిపై ఎక్కువ అనురాగము, వేరొకరిపై తక్కువ అనురాగము చూపకూడదు కదా. ఈ ధర్మాన్ని గ్రహించి నీ భార్యలను జాగ్రత్తగా చూసుకో" అన్నాడు. సరే అన్నాడు చంద్రుడు. ప్రజాపతి మాట కాదనలేక సరే అన్నాడు. అంతేకాని తన బుద్ధిమాత్రం మార్చుకోలేదు. రోహిణితోనే ఎక్కువకాలం గడుపుతున్నాడు. చంద్రుని తీరు మారకపోయేసరికి మిగిలిన భార్యలు దక్ష ప్రజాపతి దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం చెప్పారు. దాంతో కోపగించిన ప్రజాపతి చంద్రుని క్షయవ్యాధి పీడితుడుగా మారిపొమ్మని శాపం పెట్టాడు..
ఆయన శాపం పెట్టగానే చంద్రుడికి క్షయ వ్యాధి సోకింది. రోజురోజుకు కృశించిపోతున్నాడు. ఇంక భరించలేక బ్రహ్మదేవుని దగ్గరకు పోయి తనను రక్షించమని మొరపెట్టుకున్నాడు. విషయం అంతా.. విన్న బ్రహ్మదేవుడు చంద్రునితో "సారాష్ట్ర దేశంలో ప్రభాస తీర్ధమున్నది. అక్కడికి పోయి మృత్యుంజయ మహామంత్రాన్ని జపించు" అని మంత్రోపదేశం కూడా చేశాడు. ప్రభాస తీర్ధములో చాలా కాలము మృత్యుంజయ మంత్ర జపం చేశాడు చంద్రుడు.
చివరకు పరమేశ్వరుడు అనుగ్రహించి అతడికి ప్రత్యక్షమై 'నీకే వరం కావాలో కోరుకో' అన్నాడు. అప్పుడు చంద్రుడు తన మామగారు తనకిచ్చిన శాపం సంగతి చెప్పి, క్షయ వ్యాధి నుండి తనను రక్షించమని కోరాడు. దానికి శంకరుడు "చంద్రా! దక్ష ప్రజాపతి సామాన్యుడు కాదు. నవబ్రహ్మలలో ఒకడు. కాబట్టి అతడి మాట వ్యర్థం కాదు. అలా అని నీ ప్రార్ధన త్రోసి పుచ్చటం న్యాయం కాదు. అందుచేత కొంతకాలం నువ్వు వ్యాధి గ్రస్తుడవుగా, మరికొంతకాలము సుఖంగా ఉండు. అంటే కృష్ణపక్షములో క్రమక్రమంగా నీ కళలు క్షీణిస్తాయి. మళ్ళీ శుక్లపక్షంలో ప్రతిరోజు వృద్ధి పొందుతాయి. ఈ రకంగా పౌర్ణమి రోజున పదహారు కళలతో విరాజిల్లు. అమావాస్య రోజున కళావిహీనుడివి అవుతావు అన్నాడు. అప్పటి నుంచీ చంద్రుడికి వృద్ధి క్షయాలు ఏర్పడినాయి.
ఆ తరువాత చంద్రుని ప్రార్ధన మీద పరమేశ్వరుడు ప్రభాస తీర్ధములో జ్యోతిర్లింగముగా వెలిశాడు. సోముడు అంటే చంద్రుడు. అక్కడ సోమునిచే పూజింపబడ్డాడు కాబట్టి సోమనాధుడు అని పిలవబడుతున్నాడు. సోమనాధుని అర్చించినవారికి భయంకర రోగములు కూడా పటాపంచలవుతాయి. మానసిక బాధలు తొలగిపోతాయి.
◆నిశ్శబ్ద.