ప్రలంబుడి శాపం వెనుక కథ ఇదే!

 

ప్రలంబుడి శాపం వెనుక కథ ఇదే!

కంసుని దగ్గర నమ్మిన బంటుగా ఉన్న  ప్రలంబుడు అనే రాక్షసుడు  శ్రీకృష్ణుని అపహరించుకుపోవాలని ఒకసారి బృందావనానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో ఒక గోపబాలుని రూపంలో తిరగసాగాడు. కృష్ణయ్య అది పసిగట్టి, ఏమీ తెలియని వాడిలాగా ప్రలంబుడ్ని కూడా 'మాతో ఆడుకుందువుగాని రమ్మ'ని ఆటలకు పిలిచాడు.

శ్రీకృష్ణుడి మాయోపాయాలను గురించి విని వున్నాడు కాబట్టి ప్రలంబుడు శ్రీకృష్ణునితో ఆటలాడేందుకు కొంచెం సంకోచించాడు. కాని సంకోచించినట్టు కనిపిస్తే వాళ్ళకు అనుమానం వస్తుందని ఆటకు ఒప్పుకున్నాడు.

మాధవుడు చిత్రమైన ఆటను సృష్టించాడు. గోపబాలురను రెండు సమాన జట్టులుగా  విభజించాడు. ఒక జట్టును తను తీసుకున్నాడు. మరొక జట్టును బలరాముడికి అప్పచెప్పాడు. శ్రీదాముడు, వృషభుడు మొదలైన వారు బలరాముడి జట్టులోకి వెళ్ళారు. భద్రసేనుడు, ప్రలంబుడు మొదలైన వారు గోవిందుని పక్షానికి వచ్చారు.

ఇరుపక్షాల వారికి దూరంగా వున్న కొన్ని చెట్లను చూపించి 'వాటిలోంచి ఎంచుకున్న చెట్టుకు మాత్రమే తగిలేటట్టుగా రాయి విసరాలి. ఒకవేళ తగలకపోతే ఓడిపోయినవారు గెలిచినవారిని భుజాలమీద ఎక్కించుకుని ఊరంతా తిరగాలి, సరేనా' అన్నాడు కృష్ణుడు. అందుకు అందరూ అంగీకరించారు.

ఆట మొదలయింది. ఆ ఆటలో కృష్ణయ్య జట్టు కావాలనే ఓడిపోయింది. ఒప్పందం ప్రకారం గెలిచిన బలరాముడి జట్టువారిని శ్రీకృష్ణుని పక్షాన వున్నవారు భుజాల మీద మోసుకు పోవాలి. శ్రీదాముడ్ని శ్రీకృష్ణుడు తన భుజాలమీద ఎక్కించుకున్నాడు. ప్రలంబుడు బలరాముడ్ని ఎత్తుకున్నాడు. భద్రసేనుడు వృషభుడ్ని మోశాడు. అలా తన భుజాలమీద కూర్చున్న బలరాముడ్ని ప్రలంబుడు అపహరించుకు పోవాలనుకున్నాడు. పరుగుతీశాడు. అది బలరాముడు గ్రహించాడు. క్షణంలో పర్వతం మాదిరి బలరాముడు బరువెక్కాడు. ప్రలంబుడు ఆ బరువును మోయటానికి మామూలుబలం చాలదనుకుని రాక్షసబలం తెచ్చుకుని ఆకాశానికి ఎగిరాడు. ప్రలంబుని మోసం గ్రహించిన బలరాముడు అతడ్ని పిడికిళ్ళతో మోదసాగాడు. ఆ ముష్టిఘాతాలకు తట్టుకోలేక ప్రలంబుడు నెత్తురు కక్కుకుని చనిపోయాడు. అంతలో ఒకజ్యోతి అతనినుంచి బయటకు వచ్చి బలరాముడిలో కలిసిపోయింది.

ప్రలంబుడు 'హూహూ' అనే గంధర్వుని కుమారుడు. అతని పేరు విజయుడు. విజయుడు శ్రీహరి భక్తుడు. అనుదినం శ్రీమన్నారాయణుని స్మరిస్తూ నగరసంచారం చేసేవాడు. అలా తిరుగుతూ ఒకసారి కుబేరుని ఉద్యానవనానికి వెళ్ళాడు. ఆ తోటలోని పూలను కుబేరుడు శివపూజకోసం ఉపయోగించేవాడు. అది తెలియక విజయుడు ఆ పుష్పాల్ని శ్రీహరి పూజకోసం కోసాడు. కుబేరుడికి కోపం వచ్చింది. 'పూలను తస్కరించిన వాడు రాక్షసుడై పుడతాడు' అని శపించాడు.

విజయుడు కుబేరుని సమీపించి ఆయన పాదాలమీదపడి తన తప్పిదాన్ని మన్నించమని వేడుకున్నాడు. శాంతించిన ధనపతి 'నాయనా! నా శాపం తిరుగులేనిది. ద్వాపరయుగాంతాన బలరాముని చేతిలో నీకు శాపవిముక్తి కలుగుతుంది' అని కుబేరుడు అభయమిచ్చాడు. ఆ విజయుడే ప్రలంబుడై పుట్టి బలరామునిచేత పిడిగుద్దులు తిని మృత్యువాతపడి ఆ తరువాత పరమపదం పొందాడు.

                                     ◆నిశ్శబ్ద.