కాళీయుని అసలు వృత్తాంతం ఇదే!

 

కాళీయుని అసలు వృత్తాంతం ఇదే!

 

పూర్వం సౌభరి అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన కొంత కాలం కాళిందీ నదిలో వుండి తపస్సు చేశాడు. ఆ సమయంలో ఒక రోజున పక్షీంద్రుడయిన గరుడుడు అక్కడకు వచ్చి ఆ నదిలో వున్న జలచరాన్ని ఒకదాన్ని ఒడిసి పట్టుకుని భక్షించాడు. అది ఆ నదిలోవున్న చేపలన్నిటికీ రాజు. తమకు రాజైన ఆ మీనం అలా మరణించడంవల్ల చేపలన్నీ దుఃఖపడ్డాయి. మత్స్యాల రోదన విని మహర్షి తన దివ్యదృష్టి ద్వారా అక్కడ జరిగిన ఘోర ఉదంతమంతా గ్రహించాడు. ఆ చేపలను చూసి జాలిపడ్డాడు. పక్షీంద్రుని ఉద్దేశించి 'ఇకమీదట నువ్వీ నదిలో అడుగుపెడితే నీ తల నూరు ముక్కలవుతుంది' అని శపించాడు.

సౌభరి అలా శపించిన విషయం పక్షీంద్రుడైన గరుడునికీ, సర్పరాజయిన కాళియునికీ మాత్రమే తెలుసు.

మొదట్లో గరుత్మంతుడు కనిపించిన పామునల్లా పట్టి వధిస్తుండేవాడు. ఆ బాధ భరించలేక పాములన్నీ కలిసి గరుడునితో ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒడంబడిక ప్రకారం సర్పజాతి నెలకో పామును గరుడునికి సమర్పించాలి. కాని నిలువెల్లా విషంతో మదించివున్న కాళియుడు మాత్రం ఆ ఒడంబడికను తోసిపుచ్చాడు. అది తెలిసి గరుడుడు ఒకసారి కాళియుడు వున్న రమణకద్వీపానికి వెళ్ళి, ఆడినమాట తప్పటం అనుచితమనీ, అనవసరంగా పోరుకు దిగటం ఇరుపక్షాలకూ మంచిది కాదనీ కాళియుడికి చెప్పాడు. కాని సర్పరాజం గరుడుని మాటలు లెక్కచేయలేదు. లెక్కచేయక పోవటమే కాదు! అమితంగా అలిగి, హరివాహనమైన అతనిని తన క్రూరమైన కోరలతో కాటువేసి గాయపరిచాడు. గరుడునికి సర్పరాజు మీద అమితమైన కోపం వచ్చింది. వెంటనే తన ఎడమ రెక్కను విసనకర్రలా పెద్దది చేసి కాళియుడ్ని ఒక్క చరుపు చరిచాడు. ఆ దెబ్బకు కాళియుని కళ్ళు తిరిగాయి. విషం కక్కుకుని మూర్ఛపోయాడు. చేసిన పరాభవం చాలనుకుని గరుడుడు వెళ్ళిపోయాడు.

ఆ తరువాత కాళియుడు మెల్లగా తేరుకుని, లేచి, గరుడుని కంటపడటం కూడా అపాయమే అనుకుని, రమణకద్వీపం వదిలి, గరుడునకు ప్రవేశార్హత లేని కాళిందీనదిలో ప్రవేశించాడు. అప్పటినుంచి అక్కడే ఉండిపోయాడు. అలా వున్న సమయంలో ఒకసారి గోపబాలురకు దాహమై దప్పిక తీర్చుకునేందుకు నదికి వెళ్ళారు. ఆ నదిలో కాళీయుడు వుండటంవల్ల నీరంతా కలుషితమయింది. ఆ నీటిని తాగటంవల్ల గోపబాలురందరూ మూర్ఛపోయారు. అది గ్రహించిన శ్రీకృష్ణుడు వెంటనే వారిని సమీపించి తన చల్లని చూపులను వారిమీద ప్రసరింపచేశాడు. వెంటనే వాళ్ళందరూ గాఢనిద్ర నుంచి లేచినట్లు లేచి వచ్చారు. వాళ్ళవెనకే గోవులు కూడా వచ్చాయి.

కాళియుడి ఉనికి వల్లనే ఆ నీరంతా విషపూరితమైందనీ, సర్పరాజును నదిలోంచి తొలగిస్తే కానీ నీరు తాగడానికి ఉపయోగపడదనీ శ్రీకృష్ణుడు భావించాడు. వెంటనే అక్కడికి సమీపంలోవున్న ఒక కదంబ వృక్షమెక్కి అక్కడనుంచి ఒక్కసారిగా ఆ నదిలోకి దూకాడు. అలా దూకటం వలన ఆ మడుగులోని నీళ్ళన్నీ చెల్లాచెదురయ్యాయి. కాళియుడు ఉగ్రుడైనాడు. అది తన నివాసమని తెలియక ఎవరో మడుగులోకి ప్రవేశించి ఉంటారనుకున్నాడు. నీటిలోకి దూకిన వాళ్ళను చంపేందుకు విజృంభించాడు. చరచరా కృష్ణుడ్ని సమీపించి అతని శరీరమంతా గాట్లుపడేటట్లు కరిచాడు. నల్లనయ్యను గట్టిగా చుట్టుకుని నలిపేసే ప్రయత్నం చేశాడు.

తమ కన్నయ్య నిస్సహాయంగా నలుగుతున్నట్లు కనిపించేసరికి గోపబాలురు హడలిపోయారు. పెద్దగా రోదించారు. గోవులు, గోవత్సలు కూడా పెద్దగా అరిచాయి.

వాళ్ళ ఆక్రందనలు విన్న కృష్ణయ్య తనకోసం వాళ్ళు విలపించటం సహించలేక, ఒక నిముషం అలా నిస్సహాయుడుగా వున్నట్టు వుండి మెల్లిగా ఒళ్ళు విరుచుకున్నాడు. దాంతో అంతవరకూ కృష్ణయ్యను గట్టిగా చుట్టుకుని వున్న కాళీయుని పక్కటెముకలు పటపటలాడినాయి. అతని పడగలు కుంచించుకు పోయాయి. ముక్కురంధ్రాలనుంచి నెత్తురు వరదలై పారింది. కృష్ణుడు  అతడ్ని చెయ్యెత్తి చరిచాడు. ఆ దెబ్బ భరించలేక కాళీయుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని కృష్ణయ్య అతనిని వదిలిపెట్టలేదు. కాళీయుని తోక పట్టుకుని గిరగిరా తిప్పి వదిలాడు. అప్పటికే సగం చచ్చిన కాళీయుడు చేయగలిగిందేమీలేక దీనంగా తల వంచుకుని నిలబడ్డాడు. 

కృష్ణయ్య ఒక్కసారిగా పైకెగిరి, కాళీయుని పడగమీదకు దూకి మనోహరంగా నృత్యం చెయ్యటం మొదలు పెట్టాడు. గోపబాలురు ఆ నాట్యం చూసి ఆనంద పరవశులయ్యారు. కాళీయుడు మనసులో 'ఇతను పరమ పురుషుడే కాని, మానవ మాత్రుడు మాత్రం కాదు' అని నిశ్చయించుకుని 'శ్రీకృష్ణా! నేను నీ దాసుడ్ని, మితిమీరిన గర్వంతో నీ పట్ల అపచారం చేశాను. నన్ను క్షమించు. నన్ను రక్షించు' అని శరణు కోరాడు.

కాళియుని భార్యలయిన నాగకాంతలు కూడా శ్రీకృష్ణుని వద్దకు వచ్చి తమ భర్త చేసిన అపరాధాలు మన్నించమని వేడుకున్నారు. తమకు పతిభిక్ష పెట్టవలసిందిగా ప్రార్ధించారు. తమ భర్త దుర్మార్గపు ప్రవర్తనను వదులుకుంటాడనీ, ఇకముందు ఎవరినీ హింసించడనీ వాళ్ళు నల్లనయ్యకు మాట ఇచ్చారు. అలా ప్రార్థించిన భుజంగసతులను కృష్ణయ్య కరుణించాడు. 'కాళిందిని విడిచి బయటకు పోయే పక్షంలో గరుడుడు బతకనివ్వడేమోనన్న భయం మీకు అక్కరలేదు. కాళీయుడి శిరసుపైన నా పాద ముద్రలు పడ్డాయి. వాటిని గరుత్మంతుడు మన్నిస్తాడు. ఇకపై మీరు ఎక్కడ వున్నా గరుడుడు మిమ్మల్ని బాధించడు' అని వాళ్ళకు అభయం ఇచ్చాడు శ్రీకృష్ణుడు. కాళియుడు శిరస్సు వంచి నమస్కరించాడు. ఆ తరువాత కాళియుడు కాళిందిని వదిలి తిరిగి రమణ ద్వీపం చేరుకున్నాడు. అప్పటినుంచి కాళింది విషరహితమైంది. నీరు తాగేందుకు యోగ్యమైంది.

                                      ◆నిశ్శబ్ద.