Read more!

పింగళ అనే వేశ్య గురించి తెలుసా?

 

పింగళ అనే వేశ్య గురించి తెలుసా?

పురాణాలలో ఎన్నో కథలు ఉంటాయి. వాటిలో ఎన్నో పాత్రలు ఎన్నో సందేశాల్ని మానవాళికి అందిస్తాయి. వాటిలో పింగళ కూడా ఒకటి.  పింగళ ఒక వేశ్య. విదేహ పట్టణంలో నివసిస్తు ఉండేది. ఆమె చాలా అందగత్తె. ధనవంతులకు గాలం వెయ్యడం వారిని బికారులను చెయ్యడం ఆమె వృత్తి. ఒకనాటి సాయంకాలం అద్భుతంగా సింగారించుకొని తన భవంతి గుమ్మంలో నిలబడింది. వీధినపోయే ధనవంతుల్ని పసికట్టి ఆకర్షిద్దామని ఆమె ఆశ. గంటలు గడుస్తున్నాయి. కానీ ఎవడూ ఈమెకేసి కన్నెత్తి అయినా చూడడం లేదు. అయినా ఆశగా అలాగే నిలబడింది. చీకట్లు ముసురుకున్నాయి గుడ్డివెన్నెల కాసింది. పింగళ ఒక సారి లోపలికి వెళ్ళి సింగారానికి సవరింపులు చేసుకుని మళ్ళివచ్చి నిలబడింది. వీధిలో జనసంచారం తగ్గింది. అర్ధరాత్రి వేళకదా అప్పుడైనా విటులు వస్తారని ఆశగా అలాగే నిలబడింది. కానీ ఆమె ఎంత ఎదురుచూసినా ఆశ ఫలించలేదు. కాళ్ళు లాగాయి, విసుగువచ్చింది. ఇక నిలబడలేక లోపలికి వెళ్ళి హంస తూలికా తల్పం మీద నడుం వాల్చింది. 

అంతలో వాకిట గుమ్మం దగ్గర ఏదో అలికిడి అయింది. అలికిడి వినగానే  విటుడెవడో వచ్చాడనుకొని చివాలున లేచి చరాలున గుమ్మంలో నిలిచింది. అక్కడ ఎవ్వరూ లేరు. అంతా గుడ్డి వెన్నెల చెట్లనీడలు, సగం నిద్రలో ఉలిక్కిపడిన పులుగు కూనల కువకువలు వినబడ్డాయి. అంతటా నిశ్శబ్దం ఒక్కసారిగా పింగళ హృదయంలో తుఫాను చెలరేగింది. నేనేమిటి? నేను చేస్తున్న పని ఏమిటి? నా జన్మకు ప్రయోజనం ఏమిటి? ఎంతమందిని బికారుల్ని చేశాను? ఎంత కూడ బెట్టాను? చచ్చిపోయేటపుడు ఇందులో ఎంత వెంటపట్టుకు వెళతాను? అసలు ఇదంతా తీసుకుని ఎక్కడికి వెడతాను? చచ్చాక నేను ఎక్కడికి వెళతాను నరకానికేనా? అక్కడ నేను అనుభవించే యాతనలు ఏమిటి? నేను చస్తే ఒక్కడైనా అయ్యోపాపం అంటాడా? ఇలాంటి ప్రశ్నలు ఆలోచనలు ఉవ్వెత్తున చెలరేగాయి ఆమె మనసులో.

ఆ వెంటనే  సమాధానాలూ దొరికాయి. తన మీద తనకే అసహ్యం వేసింది. తన వృత్తి మీద జుగుప్స కలిగింది. వైరాగ్యభానుడు ఉదయించాడు. అయ్యో! ఎన్ని సంవత్సరాల జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను. ఒక్కనాడైనా హరి నామస్మరణ చెయ్యలేదే. అనంత సుఖప్రదుడూ మనశ్శాంతి కారకుడూ  అయిన భగవంతుణ్ని, చేరువలో ఉన్న పెన్నిధానాన్ని విస్మరించి ఎవడెవడో సుఖాలు ఇస్తాడని నిధులు పంచుతాడనీ ఎండమావుల వెంట పరుగులు తీశాను. ఛీ! ఇక ఆ జీవితానికి స్వస్తి అనుకుంది. ఇలా ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. 

ఆ క్షణం నుంచి శేష జీవితాన్ని హరినామస్మరణతో గడిపింది. ధర్మ కార్యాలు ఆచరించింది. తీర్థయాత్రలు చేసింది. పాప పంకిలాలను ప్రక్షాళన చేసుకుని మనశ్శాంతితో తనువు చాలించింది. ఈవిడ జీవితం అందరికీ చెప్పే పాఠమేమిటో ఎవరికైనా అర్థమవుతుందా? ఆశ అనేది దుఃఖ ప్రదమని వైరాగ్యం సుఖ ప్రదమని ఇందులో అర్థమవుతుంది. ఆశ వెంట పరుగులు తీసే మనిషి ఎప్పటికీ సుఖాన్ని పొందలేడు.

     ◆నిశ్శబ్ద.