దత్త జయంతి అంటే ఏమిటి.. ఎవరు దత్తాత్రేయుడు?
దత్త జయంతి అంటే ఏమిటి.. ఎవరు దత్తాత్రేయుడు?
సాధారణంగా కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో ఇలా కొన్ని ముఖ్యమైన మాసాలలో వచ్చే పౌర్ణమిలలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. గురు పూర్ణిమ, రాఖీ పూర్ణిమ వంటి ప్రముఖ దినాలు వస్తాయి. అదే విధంగా మార్గశిర మాసంలో వచ్చే పూర్ణిమ రోజు ఒక ప్రత్యేకత ఉంది. అదే దత్త జయంతి. అందరికి శ్రీ గురు దత్తునిగా, దత్తాత్రేయ స్వామిగా తెలిసిన ఈ అవతార పురుషుడి జయంతిని తెలుగు మరియు ఇతర రాష్ట్రాలలో కూడా ఎంతో భక్తిగా జరుపుకుంటారు. అయితే దత్త జయంతి ప్రాముఖ్యత, దత్తాత్రేయుడి జననం, ఈయన వృత్తాంతం గురించి తెలుసుకుంటే…
ఎవరు దత్తాత్రేయుడు?
దత్తాత్రేయుడు అత్రి మహర్షికి, అనసూయకు జన్మించినవాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురు అంశలతో జన్మించినవాడు కాబట్టి ఈయనను మూడు తలల బాలుడిగానూ, అలాగే మూడు తలల గురువుగా కూడా చూపెడతారు. అయితే శ్రీమన్నారాయణుడి అంశగా అత్రి, అనసూయలకు దత్తాత్రేయుడు జన్మించాడని నమ్మకం. అందుకే అత్రి మహర్షి గురించి ప్రస్తావించేటప్పుడు శ్రీమన్నారాయణుడినే కుమారుడిగా పొందిన గొప్పవాడని చెబుతారు.
దత్తాత్రేయుడి జననం!
దత్తాత్రేయ స్వామి అవతారగాధ చాలా మనోహరంగా ఉంటుంది. పూర్వం నారదుడు అడిగితే బ్రహ్మ చెప్పాడట. అత్రి మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అత్రికి కొడుకుగా అవతరించాడు. అత్రిపుత్రుడు కనుక, ఆత్రేయుడు. అనసూయాత్రి దంపతుల తపస్సుకు మెచ్చి వాసుదేవుడు తనంతతానుగా దత్తమయ్యాడు కనుకనే దత్తాత్రేయుడయ్యాడు. ఇదీ దత్తాత్రేయుడి జననం కథనం.
ఈయనను గురువుగా ఎందుకు కొలుస్తారు?
దత్తాత్రేయుడు అత్రి మహర్షికి జన్మించి ముని బాలకుడు అనిపించినా ఈయనలో ఉన్న జ్ఞానం అపారం. ఈయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అయినందువల్ల ఈయనను గురువుగా భావించి ఆశ్రయించినవారు ఉన్నారు. తన భక్తులైన యదు, కార్తవీర్యార్జున, ప్రహ్లాద, అలర్కుడు, మొదలైన వారికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి తరింపచేసాడు. అందుకే ఈయనను గురుదత్తుడిగా పేర్కొంటారు.
దత్తజయంతి రోజున ఏం చేయాలి?
దత్తాత్రేయుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని ప్రజల విశ్వాసం మరియు పురాణ కథనాలు చెబుతున్నాయి. దత్తజయంతి రోజున వేకువజామున లేవడం, నదీ స్నానం లేదా ప్రవహించే నీటిలో స్నానం అదీ కుదరకపోతే బావి నీరు లేదంటే చన్నీటి స్నానం చేస్తూ నదీజలాల ప్రార్థన చేస్తూ స్నానం చేయవచ్చు. తరువాత దత్తాత్రేయుడికి షోడశోపచార పూజను చేస్తారు. దత్తాత్రేయుడు జ్ఞానాన్ని ప్రసాధించేవాడు. ఆయన కృప ఉండాలని దత్త జయంతి రోజున ధ్యానం, జపం మొదలైనవి చేస్తారు. దత్తాత్రేయుడు గురువుల లాగా యోగ మార్గాన్ని అనుసరించాడు. అందుకే ఆయన్ను కొలిచేవారు కూడా ఆయన అనుసరించిన యోగ మార్గంనే తాము కూడా అనుసరిస్తామని నిర్ణయం తీసుకుంటారు. భారతీయ ఆధ్యాత్మిక తత్వంలో ఉన్న గురువుల చరిత్రలను దత్తజయంతి రోజున పారాయణం చేస్తారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసి భక్తిని చాటుకుంటారు.
పురాణ కథనం!
త్రిమూర్తులు అత్రి మహర్షి ఆశ్రమ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడి ఆహ్లదకర వాతావరణాన్ని చూసి ఎంత బాగుంది ఈ ప్రాంతం. మనమూ చిన్న పిల్లలు అయిపోయి ఇక్కడి ముని బాలురతో ఆడుకుంటే బాగుండు అనుకుంటారు. అయితే తాము వచ్చిన పని వేరే…. భార్యలకు ఇచ్చిన మాట మీద అనసూయ పాతివ్రత్యం చెడగొట్టాలని వారి ఆలోచన. వారు సాధువుల రూపంలో ఆశ్రమంలోకి వెళ్లగా వారిని చూసి సంతోషించి వారికి భోజనం ఏర్పాటు చేస్తారు అత్రి, అనసూయ ఇద్దరూ.
అయితే అనసూయతో నగ్నంగా భోజనం వడ్డిస్తేనే తింటాం అంటారు సాధువుల రూపంలో ఉన్న త్రిమూర్తులు. తనకున్న పాతివ్రత్య శక్తితో వారు త్రిమూర్తులే అని తెలుసుకున్న అనసూయ వారిమీద కమండలంలో నీళ్లు చల్లి వారిని చిన్న పిల్లలుగా మార్చేసింది. తరువాత వారికి స్తన్యం ఇచ్చి వారు అడిగినట్టే వారి కోరిక తీర్చింది. అయితే భర్తలు కనిపించలేదని వెతుక్కుంటూ వచ్చిన త్రిమూర్తుల భార్యలకు ఆ ముగ్గురు పిల్లలు ఒకే ఆకారం, ఒకే విధంగా నోట్లో వేలు పెట్టుకుని నిద్రపోతూ కనిపించారు.
అయోమయమైన వారు ముగ్గురూ అనసూయను శరణు వేడగా వారికి త్రిమూర్తుల రూపం ప్రసాదించింది. వారి తపఃశక్తికి మెచ్చుకుని త్రిమూర్తులు ఏమి వరం కావాలని అడిగినప్పుడు మాకు శాశ్వతంగా బిడ్డలుగా ఉండమని అడుగుతారు. త్రిమూర్తులలో శివుడు, బ్రహ్మ తమ రూపాన్ని శ్రీమన్నారాయణుడికి ఇవ్వగా దత్తాత్రేయ అవతారం సాక్షాత్కరించింది. ఇది దత్తుడి జననం వెనుక పురాణ కథనం.
◆నిశ్శబ్ద.