కిష్కింధలో ఏమి జరిగింది?

 

కిష్కింధలో ఏమి జరిగింది?


కిష్కింధలో లక్ష్మణుడు సుగ్రీవుడితో మాట్లాడుతూ భార్యల మధ్యలో ఉండిపోయి స్నేహితుడికి ఇచ్చిన మాట మరిచిపోయి నువ్వు తప్పు చేస్తున్నావని గట్టిగా అడిగాడు అప్పుడు తార లక్ష్మణుడితో "లంకలో నూరు వేల కోట్ల రాక్షసులు (1 ట్రిలియన్), మరియు 36 వేల సంఖ్యలో (ఒక్కొక్క సంఖ్యలో 100 మంది సైనికులు) బలగాలు ఉన్నాయి. వాలి బతికి ఉన్నప్పుడు ఈ విషయాలని నాకు చెప్పాడు, కాని నాకు పూర్తిగా తెలియదు. అంతమంది రాక్షసులని మట్టుపెట్టడానికి మనకి కూడా కొన్ని కోట్ల కోట్ల వానర సైన్యం అవసరముంది. అందుకని సుగ్రీవుడు వానర సైన్యం కోసం కబురుపెట్టాడు. నువ్వు మాటకు ముందు బాణ ప్రయోగం చేస్తాను అంటుంటే, ఆనాడు రాముడి బాణానికి వాలి పడిపోయిన సంఘటన గుర్తుకువచ్చి ఇక్కడున్నటువంటి స్త్రీలందరూ భయపడుతున్నారు. నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, నీ కోపాన్ని విడిచిపెట్టు" అని చెప్పింది.

అప్పుడు లక్ష్మణుడు "అమ్మా! నువ్వు చెప్పిన మాట యదార్ధమే, నేను అంగీకరిస్తున్నాను. ఇక నేను కోపంగా మాట్లాడను, నేను ప్రసన్నుడను అయ్యాను" అన్నాడు. 

లక్ష్మణుడి మాటలు విన్న సుగ్రీవుడు ఆనందంతో తన మెడలో ఉన్న పుష్పహారాలని పీకేసి "లక్ష్మణా! నేను రాజ్యాన్ని, భార్యను పోగొట్టుకున్నాను. మళ్ళీ రాముడి అనుగ్రహంతో వాటిని పొందాను. కేవలం తన చూపు చేత, బాణ ప్రయోగం చేత రాముడు లంకని కాల్చేయగలడు, అటువంటి రాముడికి సహాయం చేయుటకు నేను ఎంతటి వాడిని. 'నా రాముడే కదా అని ప్రేమ చేత కాలాన్ని మరిచిపోయానో, లేకపోతే వానర సైన్యానికి కబురు పంపించాను కదా అన్న విశ్వాసంతో మరిచిపోయానో, నేను కాలాన్ని మరిచిపోయిన మాట యదార్థమే లక్ష్మణా. ప్రపంచంలో పొరపాటు చెయ్యనివాడు అంటూ ఉండడు కదా, అందుకని నన్ను క్షమించు" అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు "నువ్వు మా అన్నయ్యకి నాథుడిగా ఉన్నావు. నీవంటి వాడి నీడలో ఉన్న రాముడి పని జరిగి తీరుతుంది. అపారమైన శక్తి ఉండికూడా, తిరగబడకుండా, తప్పు జరిగితే ఇలా చేతులు కట్టుకొని క్షమించమని అడగగలిగే ధార్మికమైన బుద్ధి మా అన్న రాముడి దగ్గర ఉంది, అలాగే సుగ్రీవ నీ దగ్గర కూడా ఉంది. ఆ ప్రస్రవణ పర్వత గుహలో బాధపడుతున్న నీ స్నేహితుడిని ఓదార్చు. మా అన్నయ్య బాధపడుతున్నాడన్న బాధతో కోపానికి లొంగి నిన్ను అనకూడని మాటలు ఏమైనా నేను అని ఉంటే, సుగ్రీవా! నన్ను క్షమించు" అన్నాడు.

తరువాత సుగ్రీవుడు హనుమంతుడిని పిలిచి "ఈ భూమండలంలో ఎక్కడెక్కడ ఉన్న వానరాలు ఇక్కడికి రావాలని చెప్పాను. వాళ్ళని కేవలం 10 రోజులలో రమ్మని చెప్పండి. మలయ, హిమాలయ, మహేంద్ర, వింధ్య మొదలైన పర్వతాల మీద ఉన్నవాళ్లు ఇక్కడికి వచ్చెయ్యాలి. కాటుక రంగులో ఉన్నవారు, బంగారు రంగులో ఉన్నవారు, వెయ్యి ఏనుగుల బలం కలిగినవారు, పది ఏనుగుల బలం కలిగినవారు, నీటిమీద నడిచేవారు, నీళ్ళల్లో ఉండేవారు, పర్వతాల మీద ఉండేవారు, చెట్ల మీద ఉండేవారు మొదలైన వానరాలన్నిటికి కబురు చెయ్యండి" అని చెప్పాడు.

సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం మంత్రులు మొదలైనవారు వానరాలని తీసుకురావడానికి వెళ్ళారు. అలా వెళ్ళినవారు అన్ని ప్రాంతాలలోని వానరాలని కూడగట్టుకొని కిష్కిందకి పయనమయ్యారు.

        ◆వెంకటేష్ పువ్వాడ.