జయవిజయులకు లక్ష్మీదేవి శాపం ?
జయవిజయులకు లక్ష్మీదేవి శాపం ?
వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. వారి పేర్లు జయుడు - విజయుడు. ఇద్దరూ విష్ణుభక్తులే. ఒకరోజు సనకసనందనాదులు విష్ణు సందర్శనం కోసం వైకుంఠానికి వచ్చారు. సనకసనందనాదులు మహామునులు, బ్రహ్మ మానసపుత్రులు, అసాధారణ మహిమలు గల మహనీయులు. సకల జగత్తూ వారికి ఈశ్వరమయంగానే కనిపిస్తుంది. వారికి ఎక్కడా ఎలాంటి అడ్డూ అదుపూ లేదు, ఉండదు, వారెప్పుడూ అయిదేళ్ళ ప్రాయంలోనే ఉంటారు. నగ్నంగా ఉంటారు, బాలురిలా కనిపిస్తారు. వైకుంఠంలో ప్రవేశించిన సనకసనందనాదులు ఆరు ద్వారాలు దాటారు, ఏడవ ద్వారం దగ్గరకు చేరుకున్నారు. అక్కడే జయవిజయులు కాపలాగా ఉన్నారు. లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల కేళీమందిరమే ఏడవ ద్వారం. ఆ ద్వారం దాటాలంటే జయవిజయుల అనుమతి తీసుకోవాల్సిందే!
అయితే సనకసనందనాదులకు ఒకరి అనుమతితో పనిలేదు. బ్రహ్మ స్వరూపులు వారు. ఏడవ ద్వారం దాటబోతుండగా జయవిజయులు వారిని అడ్డగించడమే కాక మదాంధులై ఆ మహామునుల్ని నిందావాక్యాలతో అవమానించారు. "చిన్నపుల్లలు ... దిగంబరులై ఉన్నారు. ఇంకో మాటగా చెప్పాలంటే పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇది వైకుంఠం, ఏడవ ద్వారం. ఏకాంత మందిరంలోని శ్రీవారిని దర్శించాలంటే మా అనుమతి కావాలి మీరు తీసుకున్నారా? లేదు. లేనప్పుడు ఎలా లోపలికి వెళ్ళగలరు? వెళ్ళండి, వెనక్కి వెళ్ళిపొండి ముందు ఇక్కడినుంచి'' సనకసనందనాదులు నిలబడిపోయారు.
ఒకరినొకరు చూసుకుని జయవిజయుల్ని చూసి ఆగ్రహం చెంది ఇలా అన్నారు ... "జయవిజయులారా! మమ్మల్ని ఎవరని అనుకుంటున్నారు? మేము సనకసనందనాదులం, విష్ణుభక్తులం. ఆ శ్రీహరిని సందర్శించడానికి మాకు ఒకరి అనుమతి అవసరం లేదు. నిష్కాములమయిన మేము శ్రీహరిని సేవించేందుకు వెళ్తుంటే మీరు మమ్మల్నే అడ్డుకుంటారా? దురాత్ములు మీరు. ఇక్కడీ పున్యలోకంలో ఉండడానికి మీరు అనర్హులు. మీ పాపానికి భూలోకమే సరైంది. వెళ్ళి భూలోకంలో పుట్టండి'' అని శంపించారు. ఆ శాపానికి జయవిజయులు భయకంపితులై మునుల కాళ్ళ మీద పడి తమని కాపాడమని వేడుకున్నారు. "మహా మునులారా! మీ పుటల తప్పుగా ప్రవర్తించాం, మా అజ్ఞానాన్ని క్షమించండి. శ్రీహరికి దూరంగా మేము ఒక్క క్షణం కోదోయా జీవించి ఉండలేము. కరుణించండి. మీ శాపానికి తిరుగులేదు. ఆ సంగతి మాకు తెలుసు అందుకనే మా కోరిక మన్నించండి. మేము ఏ జన్మ ఎత్తినా, ఎక్కడ ఉన్నా మాకు భగవద్భక్తీ, భగవన్నామస్మరణా ఉండేలా అనుగ్రహించండి.'' ఏకాంత మందిరంలో ఉన్న శ్రీహరికి ఇదంతా వేడుకగా అనిపించింది. నవ్వుకుని బయటికి వచ్చాడు.
శ్రీహరిని చూస్తూనే సనకసనందనాదులు చేతులెత్తి నమస్కరించి అనేక వేదమంత్రాలతో స్తుతించారు. శ్రీహరి సంతోషించి మునులను చూసి తరువాత జయవిజయులను చూసి తాను అంతా గ్రహించినట్టుగా చూపులతోనే వారికి తెలియజేశాడు. మునులతో ఇలా అన్నాడు "మహామునులారా! ఈ జయవిజయులు మీ పట్ల క్షమించరాని నేరమే చేశారు. వారు శిక్షార్హులే. సేవకులు చేసిన అపకారాలు, అపచారాలు అన్నీ ప్రభువుకే చెందుతాయి. ఈ కారణంగా నేను కూడా మీ పట్ల తప్పుగా ప్రవర్తించినట్లే. అందుకే వేడుకుంటున్నాను. క్షమించండి. మునులు దైవసమానులు, అందునా నా భక్తులు నాకంటే అధికులు. మీ మాటలు పోల్లుపోవు, మీ శాపం ఫలించి తీరుతుంది'' "అంతా నీ లీల'' అని మునీశ్వరులు శ్రీహరిని మరొక్కసారి మనసారా చూసుకుని నమస్కరించి నిష్క్రమించారు.
జయవిజయులు శ్రీహరి కాళ్ళపై పడి "అజ్ఞానంతో మునులను అవమానించాం. నీ సేవకులుగా నీకు మహోపచారం చేశాం. తప్పే అని ఒప్పుకుంటున్నాం. కాని, వారి శాపాన్ని మేము భరించలేము. నీకు దూరంగా జీవించలేము, కరుణించు మహాదేవా ... కటాక్షించు'' అని వేడుకున్నారు. శ్రీహరి వారిని చూస్తూ "మునుల శాపం తిరుగులేనిది, అనుభవించి తీరాల్సిందే. పైగా లక్ష్మీదేవి కూడా మిమ్ములను శపించింది జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకరోజు నేనూ లక్ష్మీదేవి ప్రణయకలహం కారణంగా విడిపోయాం. నేను నా ఏకాంత మందిరంలో అలిగి పడుకుని ఉన్నాను. నా అలక తీర్చేందుకు లక్ష్మీదేవి మందిరంలోకి వస్తుంటే అప్పుడు కూడా మీరు ఆమెను అడ్డుకున్నారు. అప్పుడు ఆమె కూడా మిమ్మల్ని శపించింది. మునుల శాపం, లక్ష్మీదేవి శాపం ఫలించి తీరాల్సిందే ... తప్పదు'' అన్నాడు.
జయవిజయులు వెక్కివెక్కి ఏడుస్తూ శ్రీహరిని పరిపరివిధాల వేడుకున్నారు. శ్రీహరి వారిని చూసి జాలి కలిగి ఇలా అన్నాడు "దిగులు పడకండి. భూలోకంలో మీరు రాక్షసులై జన్మించి, నాకు బద్ధశత్రువులుగా మారి దేవ బ్రాహ్మణులకు అపకారం చేస్తూ జీవిస్తారు. ఆఖరికి నా చేతుల్లోనే మరణిస్తారు. మూడు జన్మల అనంతరం మళ్ళీ మీకు వైకుంఠ ప్రవేశం ఉంటుంది. స్నేహంతోకానీ, శతృత్వంతో కానీ నిరంతరం నన్నే స్మరించేవారికే నా సాయుజ్యం లభించకుండా ఉండడు. విరోధం కారణంగా మీరు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటారు. అనుక్షణం నన్ను ద్వేషిస్తూ ఉంటారు. ఆ కారణంగా మీరు నన్ను ఎడబాసి ఉన్నట్లే ఉండదు. శ్రీఘ్రకాలంలో మీరు నన్ను చేరేందుకు ఇదే సరైన మార్గం'' అని శ్రీహరి జయవిజయుల్ని ఓదార్చాడు. అలా జయవిజయులు అటు సనకసనందాదుల శాపానికి, ఇటు శ్రీలక్ష్మీదేవి శాపానికి గురయ్యారు.