బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా – చక్రత్తాళ్వార్ చరిత్ర!
బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా – చక్రత్తాళ్వార్ చరిత్ర!
బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు చివరి రోజున స్వామివారి ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి, వరాహస్వామి ఆలయం చెంతకు చేరుకుంటారు. అప్పుడే `చక్రత్తాళ్వార్`ను కూడా అక్కడికి తీసుకువస్తారు. వారిద్దరికీ అభిషేకం జరిగిన తరువాత, చక్రత్తాళ్వార్‌కు పక్కనే ఉన్న పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. దానినే `చక్రస్నానం` అంటారు. అదే సమయంలో పుష్కరిణిలో స్నానం చేసే భాగ్యం కోసం భక్తులు ఎదురుచూస్తారు. ఆ సాయంత్రం ధ్వజస్తంభం మీద ఉన్న గరుడ పటాన్ని కిందకి దించడంతో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణం అయినట్లు భావించవచ్చు. అంతా బాగానే ఉంది కానీ ఈ `చక్రత్తాళ్వార్` ఎవరు అన్న సందేహం అందరికీ కలుగక మానదు. ఆ శ్రీనివాసుని ఆయుధమైన సుదర్శనచక్రమే తమిళుల నోట చక్రత్తాళ్వార్‌గా మారింది.
సుదర్శనచక్ర ఆవిర్భావానికి సంబంధించి రెండు గాథలు ప్రముఖంగా వినిపిస్తాయి. తొలిగాథ ప్రకారం రాక్షస సంహారం కోసం తనకి ఏదైనా అసాధారణమైన ఆయుధాన్ని అందించవలసిందిగా విష్ణుమూర్తి, శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు శివుడు అందించిన ఆయుధమే సుదర్శన చక్రం! మరో గాథ ప్రకారం దేవతల శిల్పి అయిన విశ్వకర్మ, సూర్యుని రజనుతో సుదర్శన చక్రాన్ని రూపొందించాడు. అదే అనాదిగా విష్ణుమూర్తికి ఆయుధమై, ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి సైతం తోడుగా నిలిచింది. శిశుపాలుని వధలాంటి సందర్భాలలో సుదర్శనచక్ర ప్రస్తావన, ప్రాభవం తప్పక కనిపిస్తుంది. దుర్గామాతతో, విష్ణుమూర్తికి ఉన్న అనుబంధానికి గుర్తుగా కూడా సుదర్శన చక్రం నిలుస్తుంది. మహిషాసురుని సంహరించేందుకు దుర్గామాత సన్నద్ధమవుతుండగా ఆమెకు తన సుదర్శన చక్రాన్ని కూడా అందిస్తాడు విష్ణువు.
భాగవతంలోని అంబరీషుని వృత్తాంతం కూడా సుదర్శన చక్రానికి ఉన్న ప్రభావాన్ని తెలియచేస్తుంది. ఆ కథ ప్రకారం… దూర్వాసుడనే రుషి అకారణంగా అంబరీషుడనే రాజు మీద కోపం తెచ్చుకుని అతని మీదకు `మహాకృత్య`అనే శక్తిని ప్రయోగిస్తాడు. తాను విష్ణుభక్తుడు కావడంతో ఆయననే శరణువేడుకుంటాడు అంబరీషుడు. అంబరీషుని రక్షించే బాధ్యతను సుదర్శనుడికి అప్పగిస్తాడు విష్ణువు. ఇంకేముంది! భక్త రక్షణ కోసం బయల్దేరిన సుదర్శనుడు మహాకృత్యను మట్టిపాలు చేసిపారేస్తాడు. ఆపై దూర్వాసుని వెంటపడతాడు. ఏం చేయాలో దిక్కుతోచని దూర్వాసుడు అటుతిరిగీ, ఇటుతిరిగీ విష్ణుమూర్తిని చేరుకుంటాడు. `నీ ఆయుధం బారి నుంచి నువ్వే నన్ను కాపాడమ`ని వేడుకుంటాడు. `తను భక్త పరాధీనుడిననీ, తన ఆయుధం అంబరీషుని సేవలో ఉంద`నీ తాపీగా సెలవిస్తాడు విష్ణుమూర్తి. ఇక చేసేదేమీ లేక ఆ అంబరీషుడి ముందే మోకరిల్లుతాడు దూర్వాసుడు. అంతట అంబరీషుడు సుదర్శనాన్ని స్తుతించి, శాంతింపచేస్తాడు.
సుదర్శన చక్రం కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు. విష్ణుమూర్తి మనసునెరిగి మసలుకొనే పరమభక్తుడు కూడా. అందుకే సుదర్శనుడికి స్వామివారి సన్నిధిలో ప్రత్యేకమైన మూర్తి ఉంది. తమిళనాట చాలా వైష్ణవాలయాలలో చక్రత్తాళ్వార్‌కు ప్రత్యేకమైన ఉపాలయాలు ఉన్నాయి. ఇక పూరీ జగన్నాథ ఆలయంలో అయితే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలతో పాటుగా సుదర్శన చక్రం కూడా గర్భాలయంలో ఉంటుంది. స్వామివారి రక్షణశక్తికి సుదర్శనుడు ఒక ప్రతీక. దర్శన మాత్రం చేతనే మన జీవితంలోని ప్రతికూలతలను తొలగిస్తుంది కాబట్టి `సు`దర్శనం అని పిలవబడుతోంది. అందుకే ఆటంకాలు తొలగాలంటే సుదర్శనాష్టకాన్ని చదువుకోమని చెబుతారు పెద్దలు. కాస్త స్తోమత ఉన్నవారు సుదర్శన హోమాన్ని కూడా చేయించుకుంటారు. ఇవేవీ కుదరని వారు ఆ వేంకటేశ్వరునీ, ఆయన చెంత ఉన్న సుదర్శనచక్రాన్నీ ఒక్కసారి మనసులో నింపుకొంటే చాలు, అప్పటివరకూ మనసులో తిష్టవేసుకుని ఉన్న భయాలకింక చోటు ఉండదు.
- నిర్జర.