తిరుమలు బ్రహ్మోత్సవాల 2వ రోజు... వైభవ వేంకటేశుడు – శ్రీకృష్ణదేవరాయలు!
తిరుమల బ్రహ్మోత్సవాలు 2వ రోజు ...వైభవ వేంకటేశుడు – శ్రీకృష్ణదేవరాయలు!
బ్రహ్మోత్సవాల సంరంభంలో రెండవ రోజున స్వామివారు `చిన్నశేష వాహనం` మీద ఊరేగుతారు. పెద్ద శేష వాహనం ఆదిశేషునికి గుర్తయితే, చిన్న శేషవాహనం సర్పరాజైన వాసుకికి ప్రతీక! క్షీరసాగరమథనంలో సంద్రాన్ని దేవతలు, రాక్షసులు కలిసి మథించేందుకు తోడ్పడినవాడు వాసుకి. జీవితమనే సాగరాన్ని కూడా ఎన్నో మంచిచెడులు(దేవతలు, రాక్షసులు) చుట్టుముట్టి ఉంటాయి. వాటిని కలుపుకుంటూ జీవితాన్ని మథిస్తూ పోతే మొదట బయటపడేది గరళమే! కానీ సంసారానికి వెరువకుండా ముందుకు వెళ్తూ ఉంటే చివరికి అమృతం (ప్రశాంతత) లభిస్తుంది. ఈ జీవితసారాన్ని మనకి చెప్పకనే చెబుతున్నాడు వాసుకి. అలాంటి జీవనమథనాన్ని తాను నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటానని చిరునవ్వుతో చిన్నశేషునిపై ఊరేగుతూ ఉంటాడు వేంకటేశుడు. వేంకటేశుని కృపతో అలాంటి ఓ పరిపూర్ణమైన జీవితాన్ని గడిపినవాడు శ్రీకృష్ణదేవరాయలవారు. తిరుమలతో ఆయనకు ఉన్న అనుబంధం గురించి.
13శతాబ్దం ముందువరకూ కూడా తిరుపతిని దర్శించుకునే రాజులలో దిగువ భారతదేశంవారే ఎక్కువగా ఉండేవారు. అయితే 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన దగ్గరనుంచి భారతదేశంలోని అన్నివైపులకీ తిరుమల ప్రాభవం పాకిపోయింది. విజయనగర స్థాపకులు అయిన హరిహర, బుక్కరాయలు ఇరువురూ కూడా తిరుపతి వేంకటేశ్వరునికి కానుకలు సమర్పించనట్లు ఆధారాలు ఉన్నాయి. వరదరాజస్వామివారి ఆలయంలో ఉన్న ఒక శాసనం ప్రకారం హరిహరరాయల వారు స్వామివారి కోసం 100 నాణేలను బహుకరించినట్లు తెలుస్తోంది. అలా తిరుమలతో మొదలైన విజయనగరాధీశుల అనుబంధం ఏళ్లు గడిచేకొద్దీ వేళ్లూనుకొంది. విజయనగరాన్ని 1646 వరకూ పాలించిన సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాల రాజులు తిరుమలేశుని కొలుచుకున్నారు.
తుళువ వంశ రాజుగా శ్రీకృష్ణదేవరాయల పాలన మొదలైన దగ్గరనుంచీ వేంకటేశ్వరుని పట్ల వారి భక్తి పతాకదశను చేరుకుంది. రాజులు, రాణులు, మంత్రులతో పాటుగా చిన్నచిన్న అధికారులకు కూడా శ్రీనివాసుడు ఇలవేల్పుగా మారిపోయాడు. సాక్షాత్తూ దేవరాయలే ఏడు సార్లు తిరుపతిని దర్శించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. యాభై దాకా శాసనాలు ఆయన సమర్పించిన అమూల్యమైన కానుకలను ప్రస్తావిస్తున్నాయి. ఈ శాసనాలను తెలుగు, తమిళము, కన్నడ భాషలలో రాయించడం ద్వారా అన్ని భాషల పట్ల తన ఉదారతను చాటుకున్నారు దేవరాయలవారు. తొలిసారి ఆయన 1513వ సంవత్సరంలో తిరుమలను చూశారు. లోకాన్ని పాలించే దైవానికి ఒక చక్రవర్తి ఎన్ని కానుకలతో అయినా కొలవలేడు కదా! అయినా ఆ సమయంలో నవరత్న కిరిటంతో పాటుగా మరెన్నో విలువైన బహుమతులను స్వామివారి పాదాల చెంత ఉంచారు దేవరాయలవారు. ఆయనతో పాటు వచ్చిన ఆయన సతీమణులు చిన్నాదేవి, తిరుమలదేవి కూడా స్వామివారి పాల ఆరగింపు కోసం బంగారు గిన్నెలను అందించారు.
తరువాతి కాలంలో కూడా వీలైన ప్రతిసారీ కృష్ణదేవరాయలు, శ్రీవారిని దర్శించుకుంటూనే ఉన్నారు. తన విజయాలు అన్నింటికీ కూడా ఆ స్వామి కృపే ఆధారమని ఆయన నిశ్చితాభిప్రాయం. అందుకే ముఖ్యమైన దండయాత్రలలో గెలిచిన ప్రతిసారీ ఆయన తిరుమలకు వేంచేశారు. ఉదయగిరి కోటను జయించినప్పుడూ, కళింగ యుద్ధంలో పైచేయి సాధించినప్పుడూ ఆ విజయాలను స్వామివారి పాదాలచెంత ఉంచారు. ముత్యాల హారాలు, రత్నవైఢూర్యాలు, మకరతోరణం, భుజకీర్తులు, కిరీటాలు… ఇలా దేవరాయలు అందించిన కానుకలు కొన్ని వేలల్లోనే ఉంటాయి. విమాన గోపురానికి బంగారు తాపడం చేయడంలో కూడా ఆయనదే ముఖ్య పాత్ర.
అన్ని మతాల పట్లా సహనం ఉన్నప్పటికీ కృష్ణదేవరాయలు విష్ణుభక్తునిగానే నిలిచిపోయాడు. అందులోనూ ఆ విష్ణుమూర్తి కలియుగ అవతారమైన వేంకటేశ్వరుని తన గుండెలో నిలుపుకొన్నాడు. బహుశా అందుకే తన వారసునికి కూడా తిరుమలరాయలు అని పేరు పెట్టాడు. `విష్ణుచిత్తీయం`(ఆముక్తమాల్యద) పేరుతో ఏకంగా ఒక కావ్యాన్నే రాశారు. ఇంత చేసినా ఆయనకు తనివితీరలేదేమో… 1517లో అయిదోసారి తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నప్పడు, తన విగ్రహాలను తానే ప్రతిష్టించుకున్నారు. తిరుమల ఆలయ మహాద్వారాన్ని దాటగానే చేతులు జోడించిన భంగిమలో దేవరాయలు, చిన్నాదేవి, తిరుమలాదేవి రాగి విగ్రహాలు మనకి కనిపిస్తాయి. ఆయన రాజాధిరాజైనా కూడా, ఎన్ని రత్నాలను ఇవ్వగలిగినవాడైనా దేవదేవుని కృప కోసం చేతులు జోడించక తప్పలేదు. ఆ భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వేంకటేశ్వరుని ముందు సమానమే కదా!
- నిర్జర.