శ్రీవేంకటేశ్వరునికై నారదుడి ప్రార్థన
శ్రీవేంకటేశ్వరుని కోసం నారదుడు ప్రార్థన చేశాడు. ఎప్పుడు, ఏ సందర్భంలో అంటారా? నారదునికి శ్రీవేంకటేశ్వరునితో ఏమి పనిపడిందో, ఎందుకు శ్రీవేంకటేశ్వరుని కోసం ప్రార్ధించాడో తెలుసుకుందాం. దుష్టులను శిక్షించే విషయంలో త్రిలోకాలు తిరుగుతూ దేవతలతో మాట్లాడుతూ, పుల్లలు పెట్టడం నారదుడి లక్షణం. అందుకే ఆయన్ను కలహప్రియుడు, కలహభోజనుడు అంటారు. అయితే, నారదుడు పెట్టే తగవు లేదా కలహం ఎప్పుడూ మంచి కోసమే.
అసలు నారదుడు ఎవరో కాదు, బ్రహ్మదేవుడి కొడుకు. ఒకసారి నారదుడు తండ్రిని చూట్టానికి సత్యలోకానికి వెళ్లాడు. అక్కడ తల్లితండ్రులతోబాటు సూర్యుడు, ఇంద్రుడు, దిక్పాలకులు, నవగ్రహాలు, సప్త ఋషులు ఉన్నారు. నారదుడు లోక్ సంచారి కనుక ముల్లోకాల విశేషాలు ఏమిటి అని అడిగారు వాళ్ళు. నారదుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా తండ్రి బ్రహ్మదేవుని చూస్తూ "శ్రీహరి, కృష్ణావతారం ముగించిన తర్వాత భూలోకంలో అవతరించలేదు. దాంతో మానవలోకంలో అరాచకం పెరిగిపోయింది. కొందరు దుష్టులు విచక్షణ కోల్పోయారు.
పాపభీతి నశించింది. పుణ్యాత్ములను పీడిస్తున్నారు. కనుక భువిలోని మంచివారిని కాపాడాల్సిన తరుణం వచ్చింది. శ్రీమన్నారాయణమూర్తి భూలోకంలో అవతరించే మార్గం మీరే చెప్పాలి" అని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు తల పంకించి "నీకు తెలీనిది లేదు. నీలో ఎంతో మహత్తర శక్తి ఉంది. నువ్వు చేపట్టిన పనిలో విజయం సాధిస్తావు. సంకల్పమాత్రాన అనుకున్నది నెరవేరుతుంది. నీ మనోభీష్టం నెరవేరుతుంది. లోక కళ్యాణం జరుగుతుంది. శ్రీమన్నారాయణమూర్తి వెంకటాద్రిపై శ్రీవేంకటేశ్వరునిగా అవతరించనున్నాడు" అంటూ మందస్మితం చేశాడు. అలా నారదుని ప్రార్థన ఫలించిందన్నమాట.