శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, జూపూడి

 

 

శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, జూపూడి

 


                                                                                  

ఇవాళ నేను చాలామందికి తెలియని ఒక గుహాలయం గురించి చెబుతాను.  ఇది కృష్ణా జిల్లా, ఇబ్రహీం పట్టణం మండలం, జూపూడిలో కృష్ణానదీ తీరాన వున్నది.  విజయవాడనుంచి హైదరాబాదు వెళ్ళే దోవలో, ఇబ్రహీం పట్టణం దగ్గర ఎడమవైపు తిరిగి 3 కి.మీ. లు వెళ్తే జూపూడి గ్రామం వస్తుంది.  అక్కడనుంచి  ఎడమవైపు వున్న సందులోంచి కొంత దూరం లోపలకి వెళ్ళాలి.  దోవ అడిగితే అక్కడివారు చెబుతారు.  ఇక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి స్వయంభూగా వెలవటమే కాకుండా, తన ఉనికి తానే తెలియజేసుకున్నాడని కధనం.  మరి ఆ కధా కమామీషూ మనం కూడా తెలుసుకోవాలికదా...

 

 

పూర్వం జూపూడి గ్రామంలో కృష్ణా తీరంలో ఇసుక పఱ్ఱల మీద కొంతమంది పిల్లలు ఆడుకుంటూ వుండేవారు.  పిల్లలన్నాక ఆడుకోవటం మామూలేకదా.  కానీ ఇక్కడి పిల్లలు ఎంతో అదృష్టవంతులు.  అందుకే స్వయంగా వెంకటేశ్వరస్వామి వచ్చి వారితో ఆడాడు.  వాళ్ళు ఆడుకునే సమయంలో ఒక బాలుడు వచ్చి తానుకూడా వారితో ఆడతానన్నాడు.  మిగతా పిల్లలు అంగీకరించి ఆటలు మొదలు పెట్టారు.  చిత్రమేమిటంటే ఆ బాలుడు ఏ పక్షాన వుంటే ఆ పక్షమే ఆటలో విజయం సాధించేది.  అది గమనించిన పిల్లలు ఈ బాలుడు సామాన్యుడు కాడని, అతనిని పట్టుకుని ఏ విధంగానైనా బాధించాలని ప్రయత్నించారు.  అతనిని పట్టుకోవాలని ప్రయత్నించారు.  ఆ బాలుడు వారికి అందకుండా పరిగెత్తాడు.  పిల్లలూ అతని వెనక పరిగెత్తారు. కానీ కొంత దూరం పరిగెత్తిన ఆ బాలుడు అదృశ్యమయ్యాడు.  దానితో పిల్లలు ఆశ్చర్యపోయారు. 

 

ఆ బాలుడు మళ్ళీ కనిపించగా పిల్లలు మళ్ళీ వెంబడించారు.  ఆ బాలుడు నదీ తీరాన కల ఒక కొండ (శ్రీగిరి) దగ్గర నామములు ధరించిన వామనుని రూపంలో కనిపించి తాను కలియుగ వెంకటేశ్వరుడనని, ఆ కొండపై వెలయుచున్నాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు.  పిల్లలందరూ ఆశ్చర్యపడి పరుగు పరుగున జూపూడి గ్రామంలోకి వచ్చి పెద్దలందరికీ ఆ సంఘటన వివరించారు.  పెద్దవాళ్ళు వాళ్ళ మాటలు పట్టించుకోలేదు.

 

ఆ కాలంలో జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారు.  ఆయన కృష్ణా నది అవతలి తీరానగల ధరణి కోట (నేటి అమరావతి) లో వుండేవారు.  ఆయనకి స్వప్నంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రత్యక్షమై తాను జూపూడి గ్రామంలోని శ్రీ గిరిపై వెలసియున్నానని, తనని దర్శించి, ధూప దీప నైవేద్యములు జరిపించే ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాడు.  స్వప్నంనుండి మేల్కొన్న రాజావారు ఈ విషయాన్ని తన సేవకులకు వివరించి ఆ విషయములు తెలుసుకు రమ్మని పంపించారు.

 

వారు వచ్చి చూడగా ముళ్ళ పొదలు, గజిబిజిగా వున్న చెట్లు కనిపించాయిగానీ, స్వామివారు కనిపించక వెనుతిరిగి విషయాన్ని రాజావారికి విన్నవించారు.  ఆయన కూడా తానేదో స్వప్నం కాంచానని మిన్నకున్నారు.  ఆ రోజు రాత్రి స్వామి రాజావారికి మరల స్వప్నంలో కనిపించి కొరడాతో కొట్టి, నేను నిన్ను రమ్మంటే నువ్వు భటులను పంపుతావా అని ప్రశ్నించారు.  ఆ కొరడా దెబ్బకు రాజావారి శరీరమంతా భగభగ మంటలు పుట్టగా వెంటనే తన అపరాధం మన్నించమని వేడుకున్నాడు.  పక్కనే వున్న కృష్ణానదిలో దిగి స్వామీ, నాకు ఈ శరీరపు మంటలు పోగొట్టి నన్ను రక్షించు అని వేడుకొనగా శరీరం చల్లబడింది. 

 

రాజావారు తన భటులతో బయల్దేరి జూపూడి గ్రామంలోని శ్రీగిరికి వచ్చి చూడగా అక్కడ అంతా ముళ్ళు పొదలు, గజిబిజిగా వున్న చెట్లు దర్శనమిచ్చాయి.  దానితో ఏమి చెయ్యాలో తోచని రాజా కొండ సమీపంలో కొబ్బరికాయ కొట్టి స్వామీ, నీవే ఏదైనా ఉపాయాన్ని చూపి నీ దర్శన భాగ్యం కలగజేస్తే నీ సేవ చేసుకుంటాను అని ప్రార్ధించాడు.  స్వామి చిన్న పిల్లాడిరూపంలో, ఊర్ధ్వపుండ్రాలతో  రాజావారికి ప్రత్యక్షమై నేనేరా నిన్ను కోరింది అని కొండపైకి తాను ముందు నడుస్తుండగా దారి ఏర్పడింది.  ముందు బాలుడు, వెనుక రాజావారు, పరివారం కొండపైన గుహ చేరుకున్నారు.  అక్కడ స్వామి తన స్వరూపాన్ని చూపించి అంతర్ధానమయ్యారు.  రాజావారు స్వామి రూపాన్ని చూసి, తన అపరాధాన్ని మన్నించమని వేడుకుని, స్వామి నిత్య ధూప దీప నైవేద్యాలకు ఏర్పాటు చేసి, వాటికోసం 16 ఎకరాల 64 సెంట్ల భూమిని కానుకగా ఇచ్చారు.  అప్పటినుంచి స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలు కొనసాగుతున్నాయి.

ఆలయం వివరాల

 

 

శ్రీగిరి మీద వున్న ఈ ఆలయాన్ని చేరుకోవటానికి దాదాపు 100 మెట్లు ఎక్కాలి.  ధ్వజ స్తంభం కింద ఆంజనేయ స్వామి విగ్రహం వున్నది.  ఎదురుగా చిన్న గదిలా కనబడుతుంది.  అదే ఆలయ ముఖ ద్వారం.  మేము వెళ్ళేసరికి తాళం వేసి వున్నది.  పూజారిగారు ఉదయం 9 గం. లకి వచ్చి పూజ చేసి వెళ్తారు.  మేము వెళ్ళేసరికి ఆయన ఇంకా రాలేదు.  అక్కడ అంతా ఊడ్చి శుభ్రం చేస్తున్న ఒకాయన ఆలయానికి సంబంధించిన వారనుకుని వివరాలు అడిగాము.  కానీ ఆయన  గ్రామంలో వారు.  స్వామి ఆయన ఆరోగ్యం బాగు చేశారని, ఆయనకి చేసే సేవలాగా రోజూ వచ్చి అక్కడంతా శుభ్రం చేసి వెళ్తారుట.  స్వామి అంటే ఎంత నమ్మకమూ, భక్తో  కదా!!  ఆయనే పూజారిగారికి చెబుతాను మీరొచ్చారని అన్నారు.  ఊరు దూరంగా వుండటంతో, కారులో వెళ్ళి రండి, తొందరగా రావచ్చుకదా అంటే అప్పుడు చెప్పారు తన సేవ సంగతి.  ఆ రోజుకి పని అయిపోయిందని, సైకిల్ వుందని వెళ్ళి పూజారిగారికి  చెప్పారు.  ఊరుకి, ఆలయానికి కొంచెం దూరం వుంటుంది.

 

పూజారిగారు వచ్చి తాళం తీసి ముందు ఆలయం లోపల శుభ్రం చేశారు.  బయట ఆలయం శుభ్రంచేసి, ముగ్గు వేసే అవకాశం దక్కిందని మా చెల్లెలుగారమ్మాయి నీలిమ సంతోషించింది.

 

 

ఆలయం లోపల ప్రవేశించగానే ముందు ఒక గదిలాగా వున్నది.  అక్కడ వెంకటేశ్వరస్వామిది, ఇంకా కొందరు దేవుళ్ళ విగ్రహాలున్నాయి.  ఎడమపక్క పైకి వెళ్ళే మెట్లు .. సన్నని దోవ.  ఆ పైనే స్వామి వెలసినది.

 

 

స్వామి వెలసిన కొండ గుహ ఐస్ క్రీం కోన్ తిరగవేసినట్లు వుంటుంది.  కొన్ని మెట్లు ఎక్కాక  ఎడమవైపు గోడకి నామాలు, ఆది శేషు, శంఖం, చక్రం గోడలోనే వుబ్బెత్తుగా దర్శనమిస్తాయి.  అంతకు మించి స్వామి రూపం ఏమీ వుండదు. 

 

ఈ గుహ చాలా సన్నగా వుంటుంది.  ఒకళ్ళు వెళ్ళటానికి మాత్రమే అవకాశం వుంటుంది.  అర్చన జరిపించేటప్పుడు మనకి స్వామిని చూసే అనకాశం వుండదు.  అక్కడ పూజారిగారు నుంచుని అర్చన చేస్తారుగనుక.  అర్చనానంతరం వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాము.  మరి ఆ అద్భుతమైన గుహని మీకు చూపించటానికి ఫోటోలు కూడా తెచ్చాను.

 

 

పైన చెప్పిన కధంతా జరిగి 350 సంవత్సరాలయిపోయింది.  ప్రస్తుతం నిత్య పూజలు జరుగుతున్నా, ఈ మారు మూల ఆలయానికి జనం ఎక్కువగా రాని కారణంగా పూజారిగారూ ఉదయం 9 గం.లకి వచ్చి పూజ చేసి వెళ్ళిపోతారు.    పూజారిగారు వివరాలు చెబుతూ, కొండ ఇదివరకు ఒకటిగానే వుండేది.  స్వామి దానిని పగలుగొట్టుకుని అక్కడ వెలిశారు. 80 ఏళ్ళ క్రితం దిట్టకవి వరదాచార్యులు అనే ఆయన ప్రజల సహకారంతో ఆ ప్రాంతాన్ని బాగుచేయించారు.  ఆయన సంతతివారే వంశపారంపర్యంగా పూజారులుగా వుంటున్నారు.   ప్రస్తుతం ఎండౌమెంట్స్ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో వున్నది.  ఆలయ భూములని కౌలుకిస్తారు.

 

 

వైశాఖ శుధ్ధ చతుర్దశినాడు స్వామి కళ్యాణం అతి వైభావంగా జరుగుతుంది.  శనివారంనాడు భక్తులు ఎక్కువగా వస్తారుట

 

శ్రీ గంగా భవానీ సమేత భీమేశ్వరస్వామి ఆలయం

 

పక్కనే వున్న చిన్న కొండమీద గ్రామస్తులు శ్రీ గంగా భవానీ సమేత భీమేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు.  ప్రజలు రాజావారి దగ్గరకెళ్ళి ఆ ఆలయం గురించి వివరించగా, దానికి కూడా 16 ఎకరాల 70 సెంట్ల భూమిని కానుకగా ఇచ్చారుట.  అప్పటినుంచీ, అక్కడ కూడా నిత్య పూజలు జరుగుతున్నాయి.

 

శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజారిగారికి నా యాత్రా దీపిక – 6 శ్రీ నరసింహ క్షేత్రాలు పుస్తకం ఇస్తే చాలా సంతోషించి జూపూడిలో ఈ వెంకటేశ్వరస్వామి భక్తుల కోరికలు నెరవేర్చే కరుణామయుడనీ, ఇక్కడివారికి ఈయనంటే గొప్ప గురి అనీ, అయితే ఎక్కువమందికి తెలియక పోవటంవల్ల భక్తుల రాక తక్కువనీ చెప్పారు.  ఇలాంటి ఆలయాల గురించి వీలయినంతమందికి తెలియజెయ్యాలనే నా తపన గురించి చెబితే సంతోషించారు.  ఎవరైనా వచ్చేటట్లయితే ఫోన్ చెయ్యమని ఫోన్ నెంబరు ఇచ్చారు.

 

మరి మీరా ప్రాంతానికి వెళ్తే ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి.  పూజారిగారి పేరు శ్రీ వెంకట సత్యన్నారాయణాచార్యులు.  


..పి.యస్.యమ్. లక్ష్మి