సాయినామ స్మరణ.....బతుకెంతో తీయన !
సాయినామ స్మరణ.....బతుకెంతో తీయన !
శ్రీ సాయితత్వం మానవ జన్మకు ఈ భూమిపైనే చరితార్థం చేయగల శక్తిపాతం. 'సాయి' ణామం పావన మంత్రం. అదొక అమృత గుళిక. సాయిలీలామృతాన్ని ఒడిసిపట్టి తాగిన వారు ధన్యులు. సాయి సచ్చరిత్ర సముద్రమంత లోతైనది. ఆకాశమంత విశాలమైనది. భక్తి, జ్ఞానమనే మణులు అందులో దాగి ఉన్నాయి. ఎవరెంత లోతుకు వెళ్ళగలిగితే అన్ని మణులను, రత్నాలను పొందవచ్చు. వీటిని పొందాలంటే మనలోని అహంకారాన్ని తీసి బాబా పాదాలపై పెట్టాలి. శ్రద్ధ, సహనం....దక్షిణగా సమర్పించాలి.
సాయి సచ్చరిత్రలోని ఒక్కో సత్కథ ఒక్కో సద్గతి కలిగిస్తుంది. బాబా చాటిన నీతి, ఉపదేశాలు జీవనరీతుల్ని నేర్పుతాయి. బాబా లీలలు ఆశ్చర్యానందాలను కలిగిస్తాయి. అవి చదివినంతనే మనో విచారాలు ఎగిరిపోయి శాంతి ఆవరిస్తుంది. బాబా జీవన విధానం మనకు బుద్ధిని, జ్ఞానాన్ని అలవరుస్తుంది. ఇక, బాబా చెబుతున్నదేమిటో ఆలకిద్దాం.
"అహంకారాన్ని విడిచి నా పాదాలపై పెట్టండి. వారికి నేను మిక్కిలి సాయపడతాను. వారి జీవిత చర్యల్లోను, గృహకృత్యాల్లోనూ తోడునీడగా ఉంటాను. అహంకారం మీ మనస్సులో మచ్చుకైనా లేని రోజున మీ హృదయాల్లోనే శాశ్వతంగా కొలువుండిపోతాను. నా లీలలు, బోధలు విన్న, ఆచరించిన భక్తులకు భక్తి, విశ్వాసాలు కుదురుతాయి. వారు ఆత్మసాక్షాత్కారాన్ని, బ్రహ్మానందాన్ని పొందుతారు. నా నామాన్ని ప్రేమతో స్మరించే వారి కోరికల్ని తీరుస్తాను. వారిలో, భక్తి, జ్ఞాన వికాసాన్ని కలిగిస్తాను. ఎవరైతే మనఃపూర్వకంగా నా బోధనల్లోని విషయాలను గ్రహిస్తారో వారు సంతోషగ్రస్తులవుతారు. నన్నే స్మరించి, ధ్యానించి, పూజించే వారిని జనన మరణ బంధాల నుంచి బయట పడవేస్తాను. భక్తి శ్రద్ధలతో నా లీలల్ని చదవండి. మనసులో నిలుపుకోండి. ఉపదేశాలను ఆచరించండి. అప్పుడు గర్వం, అహంకారం నశిస్తాయి. ఆనందానికి, తృప్తికి ఇదే మార్గం. 'సాయి...సాయి' అనే నామ స్మరణ వల్ల చెడు వినుట, చెడు పలుకుత వలన కలిగే పాపాలు పటాపంచలైపోతాయి. నా మాటలపై నమ్మకం ఉంచిన వారు తరిస్తారు. మనసు చెదిరిపోనీయకండి. దేనికీ భయపడకండి. చలించకండి. స్థిరంగా, విశ్వాసంతో ఉండండి. నా లీలలు చదవటం కాదు, వాటిలోని నీతిని, మంచిని గ్రహించి ఆచరించటం ముఖ్యం."