పరమం పవిత్రం సాయిపథం !
పరమం పవిత్రం సాయిపథం !
బాబా మార్గం మిక్కిలి విశిష్టం. దుర్మార్గుల్ని దునుమాడటం, సజ్జనుల్ని రక్షించటం భగవంతుని అవతారాల కర్తవ్యం. అయితే సాయి దుర్మార్గుల్ని శిక్షించటం కాక శిక్షణ ద్వారా వారిని సజ్జనులుగా మార్చటానికి తన అవతార కాలాన్ని మొత్తం త్యాగం చేశారు. దుష్టబుద్ధుల్ని ఎలా దూరం చేసుకోవాలో సోదాహరణంగా చూపించారు. బాబా దృష్టిలో మంచి, చెడు అనేవి లేవు. మంచివాళ్లు, చెడ్డవాళ్లు అనే భేషజాలూ బాబాకు లేవు. అందరూ సమానమే. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీర్లు, సజ్జనులు, దుర్జనులు అందరినీ బాబా సమాదరించారు. భక్తుల కర్మ ధ్వంసం కోసం బాబా తన పుణ్యాన్నంతా ధారపోశారు.
భవసాగరాన్ని హరించటంలో బాబా అగస్త్యుల వంటి వారు, అజ్ఞానమనే చీకట్లను చీల్చివేయటంలో సూర్యుని వంటివారు. "యోగులు తన ఆత్మ అని, వారి హృదయంలో తాను నివాసం ఉంటా''నని శ్రీకృష్ణుడు భగవద్గీతలో, మహా భాగవతంలో సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్పాడు. వాస్తవానికి భగవంతుడు, బాబా వేరు కాదు. బాబా హృదయం వాసుదేవ నిలయం. బాబా భక్తుల యోగక్షేమాల కోసం వారి హృదయాల్లోనే ఆవాసం ఏర్పర్చుకుని, కంటికి రెప్పలా చూసుకునే భగవంతుడు.
సద్గురు శ్రేష్టుడైన బాబా జ్ఞానంలో ఉత్క్రుష్టుడు. దైవీ తేజస్సుతో ప్రకాశించే వారు. బాబా అభయహస్త వరద ముద్ర సర్వజగద్రక్ష. బాబాకు ఇష్టం లేకుంటే ఎవరూ దగ్గరకు వెళ్ళలేకపోయేవారు. తమవంతు రానిదే బాబాను దర్శించలేకపోయేవారు. కనీసం సాయి నామాన్ని సైతం స్మరించలేకపోయేవారు. చాలామంది బాబాను దర్శించుకోవాలనుకున్నారు. కానీ, బాబా మహాసమాధి చెందేవరకు వారికా అవకాశం రాలేదు. పలువురు బాబాను దర్శించాలనే కోరిక గలవారు జీవితకాలంలో తమ కోర్కెను తీర్చుకోలేకపోయారు. కొందరు అదృష్టవశాత్తూ బాబాను దర్శించుకున్నారు. కానీ బాబా సన్నిధిలో కొద్దిసేపు గడపాలన్నా గడపలేకపోయేవారు. ఎవరూ తమ ఇష్టానుసారం షిర్డీలో అడుగైనా పెట్టలేరు. కొందరు భక్తులను బాబా షిర్డీలోనే ఉండమనేవారు. కొందరిని తక్షణం వెళ్లిపొమ్మనే వారు. బాబా మాటంటే మాటే. వెళ్లమంటే వెళ్లాలి. ఉండమంటే ఉండాలి. కాదూ కూడదని ఎవరైనా మొండికేసినా ఏదో ఆపద బారిన పడేవారు. అసలు తన భక్తులు ఏ ఆపదల బారిన పడకుండా ఉండేందుకే బాబా సమయానుకూలంగా భక్తులను షిర్డీ విడిచి వెళ్లమనటం కాని, ఉండమనటం కాని చేసేవారు. సర్వమూ బాబా ఇష్టానుసారమే జరిగేది.
"ఎవరి పాపాలు క్షీణించాయో, ఎవరి కర్మలు ధ్వంసమయ్యాయో వారిని పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగినట్టు షిర్డీకి లాగుతాను. నా వాళ్లు కాని వాళ్లెవరూ లేరు. కానీ, కర్మలను బట్టి ఎవరు అనుభవించాల్సిందే".