శ్రీ రామాప్రమేయస్వామి ఆలయం, మల్లూరు

 

శ్రీ రామాప్రమేయస్వామి ఆలయం, మల్లూరు

 


కర్ణాటక రాష్ట్రంలోని మల్లూరులో వున్న శ్రీ రామాప్రమేయస్వామి ఆలయం యుగాల చరిత్రకల ఆలయం.  కర్ణాటక రాష్ట్ర రాజధాని నగరం బెంగుళూరునుంచి 60 కి.మీ.ల దూరంలో, బెంగుళూరు – మైసూరు రహదారిమీద చెన్నపట్టణ దాటగానే  1 కి.మీ. దూరంలో ఎడమవైపు కనబడే కమానులోంచి లోపలకి వెళ్తే వస్తుంది ఈ ఆలయం.

 

 

శ్రీరామచంద్రుడు ఇక్కడ కొంతకాలం వున్నాడనీ, ఆ సమయంలో విష్ణుమూర్తిని అప్రమేయస్వామిగా ఇక్కడ ప్రతిష్టించి పూజించాడనీ అంటారు.  శ్రీరాముడిచేత ప్రతిష్టించబడిన అప్రమేయస్వామి రామాప్రమేయస్వామిగా పేరుపొందాడు.  శ్రీరాముడు ఇక్కడ కొంతకాలం వున్నాడుకనుక వింధ్యపర్వతానికి దక్షిణ దిశగావున్న ఈ స్ధలాన్ని దక్షిణ అయోధ్యగా అభివర్ణిస్తారు.  బ్రహ్మాండ పురాణంలో క్షేత్రమహత్యం కాండలో అప్రమేయస్వామి గురించి 12 అధ్యాయాలలో వర్ణించారు.

అతి పురాతనమైన ఈ ఆలయం 3000 సం. ల క్రితందంటారు.  చారిత్రిక ఆధారాల ప్రకారం 1500 సం. కి పూర్వందంటారు.  శ్రీ వైష్ణవ మత ప్రచారకుడు శ్రీరామానుజులవారు కర్ణాటక రాష్ట్రంలో దిగ్విజయం సాధించటానికి ముందే ఈ ఆలయం వుందంటారు.  980లో స్వామి నందా దీపం కోసం ఇవ్వబడ్డ దాన పత్రం ఇప్పటికీ భద్రంగా వుంది.  పురాణాల ప్రకారం కణ్వ మహర్షి మొదలగు అనేక ఋషులు ఈ స్వామిని సేవించారు.  కపిల మహర్షి ఈ స్వామి కళ్యాణ గుణాలగురించి ప్రజలకి బోధపరచి, ముక్తి మార్గాన్ని బోధించారు.  కపిల మహర్షి, కణ్వ మహర్షి ఈ స్వామిని అర్చిస్తూ ఇప్పటికీ ఇక్కడ వున్నారని ప్రజల విశ్వాసం.  రాత్రి ఆలయం తాళం వేసిన తర్వాత గర్భగుడి తలుపుల తెరిచిన శబ్దం, గంటల  శబ్దాలు వినబడతాయి.  ఈ ధ్వనుల ఆధారంగా ఆ మహామునులు ఏకాంతంలో స్వామిని అర్చిస్తున్నారని విశ్వసిస్తారు.

 

 

ఈ ఆలయ నిర్మాణంలో ఇంకో విశేషం.  ఈ ఆలయం ఏ గట్టి పునాదుల మీదకాక  ఇసుకలో నిర్మింపబడింది. నిర్మాణ రీతులుబట్టి ఈ ఆలయం తదుపరి కాలంలో ఈ ప్రాంతాలనేలిన రాజులచేత విస్తరింపబడింది తెలుస్తున్నది.

ద్రావిడ శిల్పకళా రీతిలో నిర్మింపబడిన సమున్నతమైన రాజగోపురంలో 30 అడుగుల ఎత్తైన మహద్వారం, ఆ ద్వారం ఎదురుగా ఒకే రాతిలో మలచబడ్డ 30 అడుగుల ఎత్తున్న దీపస్తంబమున్నది.   ఆలయం ముఖమండపంలో  రాగితో చేయబడ్డ స్వామివారి వాహనాలున్నాయి.  ప్రదక్షిణ మార్గంలో రాతి స్తంబాలమీద దశావతారాలు, శ్రీకృష్ణుని బాల్య లీలలు చెక్కబడ్డాయి.

 

ప్రదక్షిణ మార్గంలో అమ్మవారి ఉపాలయం వస్తుంది.  ఇక్కడ అమ్మ పేరు అరవిందవల్లి తాయారు.  ఆవిడ తామర పువ్వులో పద్మాసనస్ధితగా దర్శనమిస్తుంది.  చతుర్భుజి.  రెండు చేతులలో తామర పువ్వులు ధరించి ఇంకో రెండు చేతులతో వరద, అభయ ముద్రలతో భక్తులపాలిటి కల్పవల్లిగా దర్శనమిస్తుంది.

నవనీత కృష్ణుడు:
ముందుకు సాగితే ఇంకొక ఉపాలయంలో నవనీత కృష్ణుడిని దర్శించవచ్చు.  ఈ కృష్ణాలయం ఇక్కడ చాలా ప్రసిధ్ధి చెందినది.  వ్యాస మహర్షి ప్రతిష్టగా విశ్వసించే ఈ పారాడే చిన్ని కృష్ణుడు కుడి చేతిలో వెన్నముద్దతో చూపరుల మనసులను దోచే బంగారు తండ్రి.  గరుడ పీఠంపై విలసిల్లుతున్న ఈ చిన్ని కృష్ణుడిని చూసే మహాకవి పురందరదాసు జగదోధ్ధరణా…అనే కృతి పాడారు.  ఆయన గౌరవార్ధం మహా గోపురానికెదురుగా ఆయన పేరుతో ఒక మండపం నిర్మింపబడింది.  అదే పురందరదాసు మండపం.  ఈ చిన్ని కృష్ణుడు సంతానాన్ని కోరేవారికి సంతానాన్ని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం.  తమ కోరిక తీరినవారు సమర్పించే చిన్ని ఊయలలే దీనికి తార్కాణం.  

ముందుకు సాగితే ఆళ్వారులు, తర్వాత వైకుంఠనారాయణుని సన్నిధి, దాటగానే  స్వయంభూగా అవతరించిన ఆంజనేయస్వామిని దర్శించవచ్చు.  తర్వాత దర్శనమిచ్చేది సాలిగ్రామ శిలలో మలచబడ్డ శ్రీ అప్రమేయస్వామి.  ఈ స్వామి దయ అపారమూ, కొలతలు లేనిదీ. అందుకే  స్వామికా పేరు.  శ్రీరాముడిచేత ప్రతిష్టించబడ్డారుగనుక శ్రీ రామాప్రమేయ స్వామి అనే పేరు వచ్చింది.  స్వామి చతుర్భుజుడు.   చేతులలో శంఖం, చక్రం, గద ధరించి,  అభయ హస్తంతో భక్తుల ఆర్తి తీర్చే ఈ స్వామిని చూడటానికి రెండు కళ్ళూ చాలవు.  శ్రీదేవీ భూదేవీ సమేతుడైన అప్రమేయస్వామి ఉత్సవ విగ్రహంతోబాటు స్వామి సేవలో వున్న రామానుజాచార్యుల విగ్రహంకూడా చూడవచ్చు.

ఈ ఆలయంలో వున్న బావిలో నీరు చాలా స్వఛ్ఛంగా, తియ్యగా వుంటాయి.  స్వామి కైంకర్యానికి,తీర్ధ ప్రసాదాలకీ, ఈ నీటినే వుపయోగిస్తారు.  

ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యంగా చెప్పుకో దగ్గది ఏప్రిల్, మే నెలలో 10 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలు.  ఈ బ్రహ్మోత్సవాలలో రధోత్సవంరోజున స్వామికి అక్కడవున్న ముస్లిం కుటుంబాలవారు సుగంధ ద్రవ్యాలు సమర్పించటం విశేషం.  డోలోత్సవం, కృష్ణ జయంతి, నవరాత్రి, దీపావళి, ధనుర్మాసం..ఇలా అనేక ఉత్సవాలతో నిత్యకళ్యాణం పచ్చ తోరణంలాగా విరాజిల్లుతోంది ఈ ఆలయం.

సమీపంలోనే రామాలయం వున్నది.  ఇక్కడ సీతారాములు కూర్చుని వుంటే లక్ష్మణుడు పక్కనే నమస్కరిస్తూ వారి ఆనతికోసం వేచి వున్నట్లు నిల్చుని వుంటాడు.  ఆంజనేయుడు శ్రీరాముడి పాదసేవలో నిమగ్నమయివుంటాడు.  ఇక్కడే వేణుగోపాలస్వామి ఆలయంలో వేణుగోపాలస్వామి చతుర్భుజాలతో శంఖ, చక్ర, వేణువులను ధరించి దర్శనమిస్తాడు.  ఇక్కడ దర్శనమిచ్చే సుదర్శన లక్ష్మీ నరసింహస్వామికూడా అరుదుగా కనిపించే స్వామే.  ఎందుకంటే సుదర్శన చక్రంతో లక్ష్మీ నరసింహస్వామి ఎక్కువ ఆలయాలలో వుండడు.  అలాగే సీతారామ లక్ష్మణుల భంగిమలు, వేణుగోపాలుని చతుర్భుజాలుకూడా విశేషాలే.

ఇన్ని విశేషాలు, ఇంత చరిత్రకల ఈ ఆలయాలు అవశ్య దర్శనీయాలుకదా.

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి​
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)