కృష్ణా తీరాన వెలసిన ఆలయాలు-6

 

 

 

కృష్ణా పుష్కరాల సందర్భంగా.... కృష్ణా తీరాన వెలసిన ఆలయాలు....6

శ్రీశైలం

 

 

శ్రీశైలం ... పరమ శివుడు స్వయంభూగా ఆవిర్భవించిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో 2వ పుణ్య క్షేత్రం, జగజ్జనని శ్రీ భ్రమరాంబికా దేవి వెలసిన అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది. జీవనది కృష్ణమ్మ ప్రవహించిన పవిత్ర స్ధలం, నల్లమల అడవుల సౌందర్య దీప్తితో ప్రకాశిస్తున్నది. ఇలా అనేక శోభలతో విరాజిల్లో ఈ మహిమాన్విత ప్రదేశం భూమండలానికి నాభిస్ధానంగా చెప్పబడుతోంది. అందుకే పూజాదుల ముందు సంకల్పం చెప్పుకునేటప్పుడు మనం శ్రీశైలానికి ఏ వైపున వుండి పూజ చేస్తున్నదీ చెప్పుకోవటం మనకి ప్రాచీన కాలంనుంచీ వస్తున్న ఆచారం. అంటే ఈ క్షేత్రం ఎంత పురాతనమయినదో కదా.

 

ఇంత పురాతనమైన క్షేత్రాన్ని అనేక యుగాలనుంచి అనేక ప్రముఖులు సేవించారు. శ్రీశైలం హిరణ్యకశిపుడి పూజా మందిరం అనీ, అహోబిలం సభా మండపమనీ పురాణాలు చెబుతున్నాయి. హిరణ్యకశిపుడు ఈ పర్వతంపై తపస్సు చేసినట్లు అగ్ని పురాణంలో వుంది. శ్రీరాముడు, సీతాదేవి ప్రతిష్టించినవిగా చెప్పబడే సహస్ర లింగాలతో కూడుకున్న శివ లింగాలు, పాండవులచే ప్రతిష్టింపబడినవిగా చెప్పబడే శివ లింగాలనూ నేటికీ ఈ క్షేత్రంలో దర్శించవచ్చు.

 

 

తెలుగు, తమిళ, కన్నడ గ్రంధాలలో పలువురిచేత ప్రశంసింపబడిన ఈ క్షేత్రం గురించి అనేక చారిత్రక ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. దక్షిణ భారత దేశంలో తొలి స్వాతంత్ర్య రాజ్యమైన శాతవాహనుల పరిపాలనా సమయానికే శ్రీశైలం ప్రసిధ్ధి చెందింది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, ఆ తర్వాత కాకతీయులు పరిపాలించినట్లు తెలుస్తున్నది. వీరు శ్రీశైలాభివృధ్ధికి అనేక కార్యక్రమాలు చేబట్టారు.

 

తెలుగు సాహిత్యంలో తొలి యాత్రా రచనగా పేరు పొందిన కాశీ యాత్ర చరిత్ర (1830) లో రచయిత ఏనుగుల వీరాస్వామి కాశీ వెళ్తూ దోవలో తాను దర్శించిన క్షేత్రాల గురించి వర్ణించారు. ఆ కాలంలో శ్రీశైలం వాస యగ్యంగా వుండేది కాదుట. క్రూర మృగాల భయంవల్ల ఆలయానికి సంబంధించి వారంతా ఆత్మకూరులో వుండేవారుట. ఈ ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు నవాబుకి దర్శనానికి, గుఱ్ఱానికి వగైరా డబ్బులు చెల్లించేవారుట.

 

 

మరి మనం చెప్పుకోవాల్సింది కృష్ణా నది గురించి కదా. శ్రీ శైలంలో కృష్ణానదిని పాతాళ గంగ అంటారు. మల్లికార్జనస్వామి ఆలయం నుంచి సుమారు అర కిలో మీటరు దూరంలో వుంటుంది. ఈ పాతాళ గంగ, అంటే కృష్ణా నదిలో స్నానం చేసి భక్తులు మల్లికార్జున స్వామిని దర్శిస్తారు. ఈ పాతాళ గంగను చేరటానికి 750 మెట్లు దిగాలి. ఈ మెట్ల మార్గాన్ని 1393-94 సంవత్సరాల్లో (ఇంకా క్షేమంగానే వున్నాయండోయ్) విజయనగర చక్రవర్తి అయిన రెండో హరిహరరాయల భార్య విఠలాంబ నిర్మించింది. ఈ మెట్ల మార్గంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ పాతాళేశ్వరుల ఆలయాలు వున్నాయి. ఈ దోవలోనే కళ్యాణ కట్ట కూడా వుంది. తలనీలాలు సమర్పించికునే భక్తులు ఇక్కడ తమ మొక్కు తీర్చుకోవచ్చు. పాతాళ గంగను చేరుకోవటానికి రోప్ వే కూడా వున్నది. మెట్లు దిగలేనివారు ఈ సౌకర్యాన్ని వుపయోగించుకోవచ్చు.

 


పాతాళ గంగ లోని నీరు ఆకుపచ్చగా వుంటుంది. పూర్వం చంద్ర గుప్తుడు అనే రాజు అక్కడ రాజ్యం చేస్తూ వుండేవాడు. అతని కుమార్తె చంద్రావతి. ఒకసారి చంద్ర గుప్తుడు రాజ్య విస్తరణ కాంక్షతో దండయాత్రకి వెళ్ళాడు. ఆ సమయంలో అతని భార్య గర్భవతి. చంద్రగుప్తుడు 16 సంవత్సరాల యుధ్ధానంతరం రాజధానికి తిరిగి వస్తాడు. అత్యంత సౌందర్యరాశి అయిన తన కూతురుని చూసి మోహిస్తాడు. భార్య వారిస్తున్నా వినకుండా కూతురు వెంట పడతాడు. చంద్రావతి కృష్ణానది దాటి శ్రీశైలం వైపు పారిపోయింది. వెంటాడుతున్న తండ్రిని కృష్ణానదిలో పచ్చల బండగా పడి వుండమని శపిస్తుంది. చంద్రగుప్తుడు కృష్ణానదిలో పచ్చల బండగా పడి వుండటంవల్లనే అక్కడ కృష్ణా నదిలో నీరు ఆకు పచ్చగా వుంటుందంటారు. ఈ కధ అనేక రకాలుగా చెప్పబడుతోంది.

 

పాతాళ గంగ స్నాన ఘట్టాలకు కొంచెం దూరంలో శ్రీ శైలం ప్రాజెక్ల్ వుంది. ఇది రెండు కొండలను కలుపుతూ నిర్మింపబడింది. ప్రాజెక్ట్ అవతలవైపున కూడా స్నాన ఘట్టాలున్నాయి. వాటిని కూడా పాతాళగంగగానే వ్యవహరిస్తారు. అయితే ఇవి శ్రీశైలానికి 20 కి.మీ.ల దూరంలో వున్నాయి. హైదరాబాద్ నుంచి వెళ్ళే బస్సులన్నీ ఈ స్నాన ఘట్టాల మీదనుంచే వెళ్తాయి. దోవలో డాం కూడా చూడవచ్చు. తెలంగాణానుంచి వెళ్ళేటప్పుడు ఈ సుందర దృశ్యాలన్నీ చూడవచ్చు.

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)