సౌభాగ్య సిద్ధికి శ్రావణ మంగళవార వ్రతం
శ్రావణ మాసంలో పార్వతీదేవి సర్వమంగళగా పూజాభిషేకాలు అందుకుంటుంది అని భక్తుల నమ్మకం. తమ సౌభాగ్య రక్షణ కోసం 'మంగళగౌరి' వ్రతాన్ని చేస్తుంటారు.
ఈ మాసంలో వచ్చే మంగళవారాలన్నీ అమ్మవారిని పూజించుకోవాలి. ఈ వ్రతాన్ని ఆరంభించిన తర్వాత అయిదు సంవత్సారాలు ఆచరించవలసి వుంటుంది. ఆ తరువాతే ఉద్యాపన చెప్పాలి. భక్తి శ్రద్ధలతో కొలిస్తే తమ సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని స్త్రీల విశ్వాసం.
నూతన వధువులు తప్పకుండా ఈ వ్రతాన్ని పెళ్లైన మొదటి సంవత్సరం నుంచీ మొదలు పెట్టి ఐదు సంవత్సరాల పాటు ఆచరించటం ఆచారంగా వస్తోంది. ఐదు సంవత్సరాల ఈ వ్రతాన్ని కొన్ని ప్రాంతాల్లో పెళ్లికాని అమ్మయిలతో కూడా చేయిస్తుంటారు. ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఉపదేశించినట్లు పురాణకథనం.
కారణాంతరాల వలన పెళ్లైన మొదటి సంవత్సరం 'మంగళగౌరి' వ్రతం చేసుకోవడం కుదరకపోతే, రెండవ సంవత్సరం కూడా వదిలేసి మూడవ సంవత్సరంలో మొదలుపెట్టవచ్చు. ఈ వ్రతం చేయటం వలన జగన్మాత అనుగ్రహంతో పాటు సౌభాగ్యం, సంతానం, సంతృప్తికరమైన జీవితం ప్రాప్తిస్తాయి.