Surya Grahanam ( A Special Video On 26th December 2019 Solar Eclipse)
శ్రీ గణేశాయ నమః
శ్రీ గురుభ్యో నమః
భూమి ఒక గ్రహము, చంద్రుడు భూమికి ఉపగ్రహము, సూర్యుడు స్వయంప్రకాశం ఉన్న నక్షత్రము. ఈ ముగ్గురు ఒకే సరళ రేఖ పైకి వచ్చే అరుదైన కాలాన్నే "గ్రహణం" అంటారు. ఈ క్రమములో భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ,పాక్షికంగా కానీ కనపడకుండా పోవడం వలన సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇది నాలుగు రకాలుగా ఏర్పడుతుంది.
1. సంపూర్ణ సూర్య గ్రహణము : చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయడం వలన ఇది ఏర్పడుతుంది. నక్షత్రం అంటే తానే స్వయంగా వెలుగుతూ ఉండే సూర్యుడు చంద్రుడిని పూర్తిగా కప్పి వేయడం వలన ఒక సన్నటి అంచులాగా కనిపిస్తాడు. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. భూమి మీద నుంచి ఎక్కడైనా ఒక్క ప్రదేశంలో మాత్రమే కనిపిస్తుంది.
2. అంగుళీయక సూర్య గ్రహణము : సూర్యుడు చంద్రుడు ఒకే కక్షలోనికి వస్తారు, కానీ సూర్యుడి కంటే చంద్రుడి పరిమాణం చిన్నగా ఉండడంతో చంద్రుడి చుట్టూ సూర్యుడు ఒక అద్భుతమైన ప్రకాశవంతమైన ఉంగరంలా కనిపిస్తాడు. ఇలా చూడడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. అద్భుతమైన, అందమైన, అపురూపమైన దృశ్యం అది.
3. సంకర సూర్యగ్రహణం : సంపూర్ణ సూర్య గ్రహణము మరియు అంగుళీయక సూర్య గ్రహణములకు మధ్యస్థముగా ఉంటుంది ఈ గ్రహణము. మరీ మరీ అరుదైన సూర్య గ్రహణం ఇది.
4. పాక్షిక సూర్య గ్రహణం : ఇందులో సూర్య చంద్రులు ఒకే కక్షలో ఉండరు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటాడు. అలా ఏర్పడిన గ్రహణం భూమి మీద ఎన్నో ప్రదేశాలలో కనిపిస్తూ ఉంటుంది.
సాధారణంగా ఈ గ్రహణాన్ని ఎలా పడితే అలా చూడకూడదు. తగిన జాగ్రత్తలతో మాత్రమే చూడాలి. వీటికొరకు ప్రత్యేకమైన కళ్లద్దాలు కూడా లభిస్తున్నాయి. నక్షత్రశాలలో అంటే ప్లానిటోరియం లలో వీటిని చూడడం కొరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు.
ఈ గ్రహణం గురించి ఎన్నో విషయాలు మన పెద్దలు చెపుతూ ఉంటారు. అవే ఈ రోజుల్లో వైజ్ఞానికంగా నిర్ధారించబడ్డాయి కూడా. అనేక జంతు ప్రదర్శనశాలలో చేసిన ప్రయోగాల అనంతరం గ్రహణ సమయములో కడుపుతో ఉన్న సింహాలు,పులులు, ఏనుగులు వంటి జంతువులు గ్రహణం పడుతుంది అని స్ఫురించగానే ఎక్కడివి అక్కడ కదలకుండా పడుకుండి పోతాయి అని తెలిసింది. ఆకలిగా ఉన్న, పక్కనే ఆహరం ఉన్న కూడా పట్టించుకోకుండా గ్రహణం విడిచేదాకా పడుకునే ఉంటాయి. కానీ ఎలుకలు వంటివి కడుపుతో ఉన్నవి అదేమీ పట్టించుకోకుండా తిరగడం వల్ల వాటికి గ్రహణ మొర్రి తో ఉన్న పిల్లలు పుట్టాయి అని కూడా నిరూపించబడింది. ఎందుకు ఇలా అంటే గ్రహణ సమయములో వచ్చే అతి నీల లోహిత కిరణాల వలన మన నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితము అవుతాయి. కడుపుతో ఉన్నప్పుడు తిరుగుతూ ఉంటే చాలా హానికలుగుతుంది కాబట్టి మన పెద్ద తరాల వారు ఇంట్లో కడుపుతో ఉన్న ఆడపిల్లలు తిరగకుండా జాగ్రత్తగా చూసుకునేవారు. కదలకుండా పడుకోమనేవారు.
ఇక ఈ విషయానికి సంబంధించిన ఆధ్యాత్మిక కోణం వైపుకు చూస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు గోచరిస్తాయి. తులసి పరమపవిత్రం అయింది అని మనకు తెలిసిందే. కానీ ఈ అతి నీల లోహిత కిరణాల కిరణాల నుంచి కాపాడగలిగిన అమృత శక్తి దర్భలకు మాత్రమే ఉంది. ఎందుకు అలాగా అంటే ఒక ఆసక్తి కరమైన కథ ఉంది. తన తల్లి అయిన వినతకు, తనకు దాస్యం నుంచి ముక్తి కొరకు గరుక్మంతుడు స్వర్గం నుంచి అమృత కలశం తీసుకుని వచ్చి పిన తల్లి అయిన కద్రువ, నాగులు తీసుకోవడానికి వీలుగా అక్కడే పరచబడి ఉన్న దర్భల పైన పెడతాడు. అసలే దర్భలు అత్యంత పవిత్రం. పైన అమృత కలశం నుంచి కొన్ని బిందువులు వాటిపై బడి వాటి శక్తి మరింత ద్విగుణీకృతం అయ్యాయి. కద్రువ, నాగులు తీసుకునేలోపు గానే ఇంద్రుడు వచ్చి అమృత కలశం తీసుకుని వెళ్లిపోవడం తో నిరాశ చెందిన నాగులు దర్భలను నాకాయి. కానీ అప్పటికే అమృత తత్త్వం లోపలి వెళ్ళిపోయింది. దర్భలు కోసుగా ఉండడం తో పాముల నాలుక రెండుగా చీలింది అని చెపుతూ ఉంటారు. ఇలా అమృత తత్త్వం ఉండడం వల్ల దర్భలు అత్యంత శక్తివంతము అయ్యాయి. అందుకే ఉరగాయల పైన, నిల్వ ఉంచుకోవడం చేసుకునే పదార్ధాల పైన దర్భలను వేయడం ద్వారా ఆ దుష్ప్రభావం నుంచి కాపాడుకోవచ్చని మన పెద్దతరల వారు తెలిపి ఆచరించేవారు.
అంతేకాకుండా "ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్" అని పెద్దలు చెపుతూ ఉంటారు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే సూర్యుడి అనుగ్రహం ఉండాలి. ఆ సూర్యుడి కిరణాల స్పర్శ మనకు లభించని సమయం హానికరం అవుతుంది. జీర్ణ శక్తి తగ్గి పోతుంది. అందుకే గ్రహణ సమయమునకు కనీసం 3 గంటల ముందు నుంచి ఏమీ తినకుండా ఉండమని చెపుతూ ఉంటారు. మామూలుగానే అమావాస్యకు మనిషి మనసు కుదురుగా ఉండదు. అందులో గ్రహణం సమయంలో మరింత ఇబ్బందిగా ఉండడం చేత మనలోని దుర్మార్గపు ప్రవర్తన విజృంభిస్తుంది. అందుకే నియంత్రణ కోసము పట్టు స్నానం, విడుపు స్నానం అంటూ, దైవారాధన అంటూ మనసుకు ఆధారం ఇచ్చే అలవాటు మన పెద్ద తరాల వారికి ఉండేది. దీనిలో ఉన్న వైజ్ఞానిక అంశం విషయానికి వస్తే మనసు కుదురుగా లేనప్పుడు, చికాకుగా ఉన్నప్పుడు చన్నీళ్లతో తల స్నానం చేస్తే వెంటనే మనసు కూడా శాంత పడుతుంది. అందుకే ఉపాసన చేసుకునేవారు తమకు దగ్గరలో నది ఉంటే గ్రహణం సమయం మొత్తం నీటిలోనే ఉండి ఉపాసన చేసుకుంటూ ఉంటారు.
గ్రహణం అనంతరం దేవాలయాలు శుద్ధి చేసినట్లే మనము స్నానము చేసి ఇంట్లో పూజా మందిరమును, ఇంటినీ నీటితో శుభ్రం చేయడం అనేది ఆధ్యాత్మికతతో పాటు,వైజ్ఞానికంగా మంచి చేస్తుంది. అప్పటివరకు ప్రసరించిన కిరణాల ప్రభావము తొలగిపోయి మరలా శాంతి లభిస్తుంది.
ఈ గ్రహణముకు సంబంధించి మనకు భాగవత పురాణంలో ఒక అద్భుతమైన కథ కూడా ఉంది. పూర్వం దేవదానవులు అమృతం కోసం పాల కడలిని చిలికినప్పుడు ఎన్నో బాధలు,అవాంతరాల తరువాత అమృత కలశం తీసుకుని ధన్వంతరి స్వామి ఆవిర్భవించాడు. నియమం తప్పి దానవులు అమృత కలశం గుంజుకుని వెళ్ళిపోతూ ఉంటే శ్రీహరి మోహిని దేవి వేషం దాల్చి వాళ్ళను మాయలో ముంచి దేవతలకు నిజమైన అమృతం, దానవులకు మాయ అమృతం పోస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని దానవులైన రాహువు, కేతువు గ్రహించి నెమ్మదిగా దేవతల రూపు దాల్చి వారి పంక్తిలో చివరలో కూర్చున్నారు. మోహినీ దేవి వారికి కూడా అమృతం పోయగానే సూర్యుడు, చంద్రుడు దేవికి విషయం అర్ధం అయ్యేలా సైగ చేయగానే చక్రాయుధం ప్రయోగించి వారిని నిరోధించాడు శ్రీహరి. అప్పటికే అమృతం గొంతులో ఉండడం తో తలతో రాహువు, కిందకు దిగడం తో మొండెం తో కేతువు జీవించి ఉన్నారు. సూర్య చంద్రుల పైన కోపం పెట్టుకుని అమావాస్య అప్పుడు సూర్యుడిని, పౌర్ణమి అప్పుడు చంద్రుడిని కబళించే ప్రయత్నం చేస్తూ ఉంటారని అలా గ్రహణాలు ఏర్పడతాయని భాగవతం తెలుపుతున్న కథ.
విషయం ఏదైనప్పటికీ, మన ఈ శరీరంతో, ఈ కంటితో భగవంతుడిని ప్రత్యక్షంగా దర్శించలేము. కానీ సూర్య భగవానుడు మాత్రం ప్రత్యక్ష నారాయణుడిగా మనకు దర్శనం ఇస్తూనే ఉంటాడు.అందరినీ కరుణించే ఆ ప్రత్యక్ష దైవం కి గ్రహణం అని పేరు చెప్పి ఏవేవో భయాలతో కాకుండా ఆధ్యాత్మిక, వైజ్ఞానిక అంశాలను అర్ధం చేసుకుని, సమన్వయం చేసుకుని మన పెద్దలు నడిచిన బాటలో నడుద్దాం. ఆరోగ్యంగా, ఆనందంగా జీవిద్దాము.