Read more!

శివపురాణంలో అరుంధతి

 

మహేశ్వరుడిని తపస్సు ద్వారా మెప్పించి అనుకున్న వరాన్ని పొందగలిగిన సంధ్య కైలాసవాసుడు చెప్పిన విధంగా మేధాతిథి యజ్ఞం చేస్తున్న ప్రదేశం వద్దకు చేరుకుంది.

తాను శివుడికి విన్నవించుకున్న కోరికను తలచుకుంది. తనకు వరం ఇచ్చేముందు భవానీ మనోహరుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. తాను అగ్నిగుండంలో ఆహుతి అయ్యేముందు మనసులో ఎవరినైతే, తలచుకుంటుందో అతనే మరుసటి జన్మలో మనోహరుడుగా అవుతాడన్న విషయం గుర్తుకు వచ్చింది. 

అంతే! ఈశ్వరుడంతటి వాన్ని తపోనిష్టద్వారా కంట చూడగలిగే అదృష్టాన్ని పొందడానికి కారకుడైన వశిష్టుడూ తలపులోకి వచ్చాడు. పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి తన కోరిక తీరేలా చేసిన ఆ వశిష్టుడి మీదకే మనస్సు మళ్లింది.

ఇదే ఆలోచనతో అగ్నిగుండంలోకి దూకి, తన తనువును సమిధగా చేసింది. అంతటితో సంధ్య వాలిపోయింది. రేపటి ఉషోదయానికి ప్రకృతి ఆయత్తమయింది.

అలా అగ్నిగుండంలో పడ్డ సంధ్య దేహాన్ని సూర్యభగవానుడు రెండు భాగాలుగా చేశాడు. పై భాగాన్ని అంటే ఊర్థ్వభాగాన్ని ప్రాతః సంధ్యగానూ, కింది భాగాన్ని సాయం సంధ్యగానూ మార్చాడు. పితృదేవతలకు ఈ సాయం సంధ్య అంటే బాగా ఇష్టం.

అలా సూర్యుడు ఈ సంధ్యదేహానికి రెండు రూపాలు కలిగిస్తే ఇక సంధ్య ఆత్మకు అగ్నిదేవుడు ఒక అందమైన ఆకృతిని కలిగించాడు. ఆ ఆకృతి ఎలా ఉందంటే అనేక అలంకారశోభితయై అందానికి నిర్వచనంలా ఉందామె మనోహర రూపం. అలా అగ్నిగుండంలో తనద్వారా రూపుదిద్దుకున్న సంధ్యకు ‘అరుంధతి’ అని నామకరణం చేశాడు అగ్నిదేవుడు.

ఆమెను యజ్ఞగుండంలో నుంచి బయటకు తీసుకువచ్చి హోమాన్ని ఆచరిస్తున్న మేధాతిథికి అప్పగించాడు. ఆ కన్యను తనకు అప్పగించినందుకు ఎంతగానో సంతోషించాడు మేధాతిథి. ఇంకా ఉంది.....