మహాశివుని చరితం -మనోల్లాస భరితం

 

మునులంతా కలసి చేసిన ఆ వినమ్ర పూర్వకమైన అర్ధింపునకు సూత మౌనీంద్రుడు ఎంతగానో సంతోషించాడు .

''ముని శ్రేష్టులారా !మీరు సామన్యులు కారు .ప్రతి నిమిషం భగవదారాధనలో తనువూ ,మనస్సులను విలీనం చేసిన తాపసోత్తములు మీరు.నియమనిష్ఠలతో కూడిన సదాచార సంపన్నులు ,సశ్చీలురు.నిశ్వార్ధ చింతనతో మీరు ఏది చేసినా ,ఏది కోరినా అది లోకకళ్యాణం కోసమే అవుతుంది .కాబట్టి మీలాంటి అభిలాష గల వారికి చెప్పగలగడం కూడా ఒక విశేషమే .ఆ భాగ్యం నాకు మీ వల్లే రావడం నా పూర్వజన్మ విశేషం .కాబట్టి నేనూ కూడా ధన్యుణే''.అన్నాడు సూతుడు మరింత భక్తి భావంతో . 

మళ్లి సూతమహర్షి ''ఇంత సౌమ్యంగా నన్ను చెప్పండని అర్ధించడంలోనే మీరెంత ఉన్నత చరితులో అర్ధం అవుతుంది .అయినా మీరు కోరినా కోరికా సామాన్యమైనది కాదు .అదిపురుషుడైన ఆ పరమేశ్వరుని గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది .చెప్పిన తరువాత అంతా తెలిసినట్లే ఉంటుంది గానీ,ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవడానికి ఎంతో ఉందన్న విషయం ఆశ్చర్యాన్నేకాదు ,అభిలాషనూ రేకెత్తిస్తుంది .సదాతనుడు ,సనూతనుడు, సనాతనుడు అయిన సర్వేశ్వరుని లీలలు చాలా విచిత్రమైనవి .అయన చేతలు ఎవరికీ అంత తేలిగ్గా అర్ధం కావు.అయన గురించి తెలుసుకోవడమంటే ఒక రకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది .ఎందుకంటే సృష్టే అయన .ఆయనే సృష్టి .

ఒకసారి మార్కండేయుడనే గొప్ప శివభక్తుడు శివుని గురించి పూర్తిగా తెలుసుకోవాలన్న అభిలాషతో బ్రహ్మలోకానికి వెళ్ళి ,వాణివిరించిలకు భక్తితో నమస్కరించి ''విధాతా!నాకు పరమేశ్వరుని గురించి ,అయన మహత్యాన్నిగురించి కూలంకుషంగా తెలుసుకోవాలని ఉంది . మీరు తెలియజేసి ధన్యుణ్ణి చెయ్యి'' అంటూ ప్రార్ధించాడు .

అందుకు బ్రహ్మ''నాయనా !శివుడి గురించి తెలుసుకోవాలంటే నా కంటే బాగా కేశవుడికే తెలుసు .కాబట్టి నీవు వైకుంఠానికి వెళ్ళి నారాయణుడిని ఆర్ది౦చు ''అని చెబుతాడు . బ్రహ్మ చెప్పిన మేరకు మార్కండేయుడు సరాసరి వైకుంఠానికి చేరుకుంటాడు .అక్కడ శేషతల్పంపై లక్ష్మిదేవి పాదాలు వత్తుతుండగా శయన రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువుని చూసి చేతులు జోడించి వివిధ రకాలుగా ప్రార్ధనలు చేస్తాడు మార్కండేయుడు .

ఆ స్తోత్రానికి పరవశుడై''మార్కండేయా !నీవు వచ్చిన పని చాలా విశిష్టమైనది .పరమేశ్వరుని గురించి తెలుసుకోవాలనే అభిలాష ,ఉత్సుకత ,సంకల్పం ఎంతో ఉన్నతమైనది .అయితే మహాశివుని ఆసాంతం తెలిసిన వారు ఎవరు లేరు .కాబట్టి నీవు పరమేశ్వరుని దగ్గరకెళ్ళి అయన గురించి తెలుసుకోవాలన్న నీ సంకల్పాన్ని వ్యక్తం చెయ్యి.నీకోరిక తప్పక తీరుతుంది ''అని అన్నాడు వైకుంఠవాసుడు.

మన సంకల్పం బలంగా ఉంటే అది ఎలాగైనా తీరుతుంది .ఒకసారి ప్రయత్నించగానే ఫలితం రాలేదని కుంగిపోకుండా ,విసుగుతో అనుకున్నదాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా అది తీరేవరకు యత్నిస్తున్నే ఉండాలి .సంకల్పబలం చిత్తశుద్దిఉంటే ,అది తీరేందుకు భగవంతుని సాయం కూడా తప్పకుండా లభిస్తుంది.ఇక్కడ భగవంతుని సాయం అంటే అది తీరేందుకు మార్గం లభ్యం కావడమే నని గ్రహించాలి.

మార్కండేయునికి అదే జరిగింది .మహాశివుని మహిమలు గురించి తెలుసుకోవాలన్న కోరిక మార్కండేయుడులో బలంగా ఉంది .ఆ ప్రయతంలో ఇప్పటికే బ్రహ్మ,విష్ణువులను అడిగి కొద్దిగా నిరాశకు గురైనా ,తన కోరికా తీర్చగలిగే తెరువును ,తీరుతుందన్న భరోసా పొందగలిగాడు .దాంతో అతని ఉత్సహం రెట్టింపైంది.అదే సంతోషంతో కైలాసం వైపునకు తన పయనాన్నిసాగిస్తాడు మార్కండేయుడు.