రావణుడికి సీత చెప్పిన గట్టి సమాధానం!
రావణుడికి సీత చెప్పిన గట్టి సమాధానం!
రావణుడి మాటలను విన్న సీతమ్మ ఒక నవ్వు నవ్వి, ఒక గడ్డిపరకని తనకి రావణుడికి మధ్యలో పెట్టి "రావణా! నీ మనస్సు నీ వాళ్ళ మీద పెట్టుకో. నీకు అనేకమంది భార్యలు ఉన్నారు. వాళ్ళతో సుఖంగా ఉండు, పరాయి వాళ్ళ భార్యల గురించి ఆశపడకు. ఒంట్లో ఓపిక ఉంటే ఎలాగన్నా బతకవచ్చు, కాని చనిపోవడం నీ చేతులలో లేదు. నువ్వు సుఖంగా బతకాలన్నా, చనిపోవాలన్నా నీకు రామానుగ్రహం కావాలి. నీకు ఒంట్లో ఓపిక ఉందని పాపం చేస్తున్నావు, కాని ఆ పాపాన్ని అనుభవించవలసిన రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు చాలా బాధపడతావు. నా గురించి ఆలోచించి నన్ను సొంతం చేసుకొని అనుభవించాలనే ఆలోచనను మానుకో.నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించి సంతోషంగా జీవించు, శరణు అన్నవాడిని రాముడు ఏమి చెయ్యడు.
"నేను సీతని తీసుకొచ్చాను అంటావేంటి, నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు. సూర్యుడి నుండి సూర్యుడి కాంతిని వేరు చేసి తేగలవా, వజ్రం నుండి వజ్రం యొక్క ప్రభని వేరు చేసి తేగలవా, పువ్వు నుండి పువ్వు యొక్క వాసనని వేరు చేసి తేగలవా, ఇవన్నీ ఎలా తీసుకురాలేవో అలా రాముడి నుండి నన్ను తీసుకురాలేవు. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటావేమో, ఇదంతా నిన్ను చంపడానికి బ్రహ్మగారు వేసిన ప్రాతిపదిక. నీకు మరణించే కాలం దగ్గరకు వస్తోంది. అందుకే నువ్వు ఒక పతివ్రత అయిన స్త్రీని అపహరించి చెయ్యరాని పాపం చేశావు, ఇక నీ పాపం పోదు. దీనికి ఒకటే మార్గం, నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించు, బతికిపోతావు.
నేను నిన్ను ఇప్పుడే నా తపఃశక్తి చేత బూడిద చెయ్యగలను, కాని నేను అలా చేయడం లేదు. నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడన్న కారణం వల్ల నేను అలా చెయ్యకుండా ఆగిపోయాను. నువ్వు ఎక్కడో వంద యోజనాలకు ఇవతల నన్ను తీసుకొచ్చి పెట్టావని, ఇక్కడికి ఎవ్వరూ రాయలేరు అని అహంకారంతో ఉన్నావు. కానీ ఈ సృష్టిలో రాముడు కనుక్కుని ప్రదేశం అంటూ ఏదీ ఉండదు. నువ్వు పాతాళంలో దాక్కున్నా రాముడు కనుక్కునేస్తాడు. అయినా నువ్వు పరిపాలిస్తున్న ఈ ఊరిలో ధర్మం అనేది చెప్పేవారు లేరా? ఒకవేళ ఎవరన్నా చెప్పినా నువ్వు వినవా? ఒకవేళ విన్నా దానిని ఆచరించవా?" అని ప్రశ్నించింది.
ఈ మాటలు విన్న రావణుడికి ఆగ్రహం వచ్చి "ఏ స్త్రీ మీద విశేషమైన ఇష్టం ఉంటుందో ఆ స్త్రీ గురించి ఉపేక్షించే స్వభావం కూడా ఉంటుంది. నన్ను చూసి ఇంతమంది స్త్రీలు కామించి వెంటపడ్డారు. నీకు ఐశ్వర్యం ఇస్తాను, సింహాసనం మీద కుర్చోపెడతాను, నా పాన్పు చేరు అంటే ఇంత అమర్యాదగా మాట్లాడుతున్నావు. నీకు నా గొప్పతనం ఏంటో తెలియడం లేదు"అని చెప్పి, అక్కడున్న రాక్షస స్త్రీలను పిలిచి "ఈమె మాటలతో వినడం లేదు. అందుకే సామమును, దానమును, బేధమును ప్రయోగించండి అని నేను మీకు చెప్పాను, కానీ ఈమె లొంగలేదు, 10 నెలల సమయం అయిపోయింది. ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఆ సమయంలో సీత నా పాస్సు తనంతట తాను చేరితే సరి, లేకపోతే మీరు సీతని దండించండి" అన్నాడు.
◆వెంకటేష్ పువ్వాడ.