తొలి భారతీయ సెయింట్ - అల్ఫోన్సా

 

తొలి భారతీయ సెయింట్ - అల్ఫోన్సా

 

క్రైస్తవమతంలో సెయింట్‌ హోదాని పొందడం అంటే ఆషామాషీ కాదు. ఎలాంటి మచ్చ లేని జీవితాన్ని గడిపి ఉండాలి. పరిశుద్ధమైన హృదయంతో లోకుల మనసుని గెలుచుకుని ఉండాలి. తనను ఆశ్రయించిన వారి దుఃఖాలను కడతేర్చగలగాలి. అందుకే ఎన్నో శల్యపరీక్షల తరువాతే సెయింట్‌ హోదాని అందిస్తారు. అలాంటి హోదాని పొందిన తొలి భారతీయురాలు ‘అల్ఫోన్సా’ జీవిత చరిత్ర ఇది.

వందేళ్ల క్రితం

1910లో కేరళలోని ఓ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు అల్ఫోన్సా. ఆమె అసలు పేరు ‘అన్నా ముత్తత్తుపడత్తు’. అల్ఫోన్సా చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను అనుభవించారు. పసితనంలోనే తల్లి చనిపోవడంతో అల్పోన్సాను ఆమె మేనత్త చేతిలో పెట్టారు. ఆ మేనత్త మహాకఠినాత్మురాలని అంటారు. ఎలాగైనా అల్ఫోన్సాని బాగా చదివించడం, ఓ అయ్య చేతిలో పెట్టడమే ఆమె ధ్యేయంగా ఉండేది. కానీ అల్ఫోన్సా మనసు మాత్రం క్రీస్తు మీదే నిమగ్నమై ఉండేది.

 

 

పెళ్లిని తప్పించుకునేందుకు

అల్ఫోన్సాది సంపన్న కుటుంబం కావడంతో ఎక్కడెక్కడి నుంచో సంబంధాలు రావడం మొదలుపెట్టాయి. చదువు, అందం ఉన్న అల్ఫోన్సాని చేసుకుంటామంటూ వర్తమానాలు మొదలయ్యాయి. కానీ అల్ఫోన్సాకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. క్రీస్తు కోసమే తన జీవితాన్ని అంకితం చేయాలన్నది ఆమె లక్ష్యంగా ఉండేది. అందుకే! తనకి ఎలాగైనా పెళ్లి చేయాలన్న మేనత్త ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఆమె ఓ సాహసానికి ఒడికట్టారు. భగభగ మండుతున్న ఊకలో కాళ్లు పెట్టారు. దాంతో ఆమె కాళ్లు తీవ్రంగా కాలిపోయాయి. జీవితాంతం అల్ఫోన్సా ఆ గాయంతోనే గడిపారు.

సన్యాసినిగా

క్రమేపీ అల్ఫోన్సా జీవితం పూర్తిగా క్రీస్తుకి అనుకూలంగా మారిపోయింది. సంసారాన్ని పరిత్యజించేందుకు క్యాథలిక్కుల నిబంధనలన్నింటినీ స్వీకరిస్తూ... 1931 నాటికి సన్యాసాన్ని స్వీకరించారు. సిస్టర్ అల్ఫోన్సాగా మారి కేథలిక్‌ పాఠశాలలోని పిల్లలకు చదువు చెప్పసాగారు. అల్ఫోన్సాకి మొదటి నుంచి కూడా ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉండేది. ఒకదాని తరువాత ఒకటిగా ఏదో ఒక అనారోగ్యం ఆమెను వెన్నాడుతూనే ఉండేది. కానీ అల్ఫోన్సా ఎన్నడూ ధైర్యాన్ని కోల్పోలేదు సరికదా... ఆ బాధని ఓ వరంగా భావించేవారు. క్రీస్తు పడిన బాధని తన వ్యధలో చూసుకునేవారు.

 

 

మరణం - అనంతరం

చిరకాలం ఏదో ఒక అనారోగ్యంతో వ్యధ చెందుతున్న అల్ఫోన్సాకి, దైవం విముక్తి ప్రసాదించాలనుకుందేమో! ఆమె 36 ఏటే అల్ఫోన్సా భగవంతుని సన్నిధికి చేరిపోయింది. అయితే మరణించిన తరువాత అల్ఫోన్సా మరింత ప్రభావం చూపించడం మొదలుపెట్టారు. భక్తులు ఆమెను తల్చుకోగానే ఎలాంటి కష్టం నుంచైనా విముక్తి పొందసాగారు. కాళ్లు లేనివారు సైతం ఆమెను ప్రార్థించి స్వస్థత పొందడంతో... క్యాథలిక్ చర్చ్‌ ఆమెకు సెయింట్‌ హోదాను సంతోషంగా అందించింది. అలా సెయింట్‌ హోదాను పొందిన తొలి భారతీయురాలిగా అల్ఫోన్సా చరిత్రలో నిలిచిపోయారు. కొట్టాయం జిల్లాలో ఉన్న ‘భారనగణం’ అనే ఊరిలో ఉన్న అల్ఫోన్సా సమాధి ఇప్పటికీ అనేక మహత్యాలకు నెలవుగా ఉంది. ఆమె సమాధిని దర్శించి తమ గోడుని విన్నవించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు భారనగణానికి చేరుకుంటూ ఉంటారు.

- నిర్జర.