ఇండోనేషియాలో ఓ ప్రాచీన ఆలయం – ప్రంబనన్‌!

 

 

 

ఇండోనేషియాలో ఓ ప్రాచీన ఆలయం – ప్రంబనన్‌!

 


భారతదేశానికి ఆవల ఉన్నా ప్రాచీన ఆలయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చాలామంది కంబోడియాలో ఉన్న అంకోర్‌వట్ ఆలయం గురించే గుర్తు చేస్తారు. నిజానికి అంకోర్‌వట్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే మరో ఆలయం గురించి చాలామంది అసలు వినే ఉండరు. అదే ఇండోనేషియాలో ఉన్న ‘ప్రంబనన్‌’ ఆలయం.

 

ప్రంబనన్‌ ఆలయం ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ ఆలయం. ఆ మాటకు వస్తే ప్రపంచంలోని అతి పెద్ద ఆలయాలలో ఒకటి. లక్షన్నర చదరపు మీటర్ల వైశాల్యంతో, 150 అడుగులకి పైగా ఎత్తున ఉన్న విమాన గోపురంతో వెయ్యేళ్ల గతానికి ఘనచిహ్నంగా ఉండే ఈ ఆలయం త్రిమూర్తులు ముగ్గురినీ కొలుచుకునేందుకు నిర్మించారు.

 

 

8వ శతాబ్దంలో ఇండోనేషియాలోని జావా ద్వీపం మీద ‘సంజయ’ అనే రాజవంశం ఓ వెలుగు వెలిగింది. ఈ వంశంలో ఒకరైన ‘రకై పికటన్’ అనే రాజు తొమ్మిదో శతాబ్దిలో ప్రంబనన్‌ ఆలయాన్ని నిర్మించేందుకు తలపెట్టాడు. ఒపాక్‌ అనే నదిని దారిమళ్లించి మరీ ఆ రాజు ఈ ఆలయాన్ని నిర్మించ పూనుకున్నాడు. ఆయన మొదలుపెట్టిన నిర్మాణాన్ని తరువాత కాలంలో వచ్చిన వారసులు కూడా కొనసాగించడంతో, ఒక బృహత్‌ ఆలయం రూపుదిద్దుకుంది. సంజయ వంశం ఏలిన రాజ్యాన్ని ‘మాతరం’ రాజ్యం అని పిలుచుకునేవారు. ఆ రాజ్యంలో జరిగే పూజాదికాలకీ, ఉత్పవాలకీ, యజ్ఞయాగాలకీ, ఇతరత్రా క్రతువులకీ కూడా ప్రంబనన్‌ ఆలయం వేదికగా ఉండేది. అందుకనే ఈ ఆలయంలో ఒకటీ రెండూ కాదు... దాదాపు 240 ఆలయాలు కనిపిస్తాయి.

 

 

సంజయ వంశపు పాలనలో ఓ వెలుగువెలిగిన ప్రంబనన్‌ ఆలయం తరువాత కాలంలో క్షీణదశకు చేరుకుంది. రాజ్యంలోని అధికారం చేతులు మారడం, దగ్గర్లో ఉన్న అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం, తరచూ భూకంపాలు రావడం... ఇలా రకరకాల కారణాల చేత ప్రంబనన్‌ ఆలయం జీర్ణావస్థకు చేరుకుంది. అలా శిధిలమైన ఆలయం చుట్టూ దేవతలు, దయ్యాలు, శాపాలతో కూడిన జానపద కథలు ప్రచారంలోకి వచ్చాయి. తరువాత కాలంలో ప్రభుత్వాలు మేలుకొని ప్రంబనన్‌లోని ముఖ్యాలయాలను పునరుద్ధరించాయి. ఇక యునెస్కో కూడా దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడంతో ప్రంబనన్‌ కాలగర్భంలో కలిసిపోకుండా నిలిపి ఉంచే చర్యలు మొదలయ్యాయి.

 

 

పరబ్రహ్మ అనే సంస్కృత పదానికి వికృత రూపమే ప్రంబనన్‌. అవడానికి ఇది త్రిమూర్తుల పేరున నిర్మించిన ఆలయమే అయినా, సంజయ వంశ రాజులు శైవారాధకులు కావడంతో... ముఖ్యాలయంలో శివుడు దర్శనమిస్తాడు. ఆ ఆలయానికి అటూ ఇటూ ఉన్న మరో రెండు ఆలయాలలో విష్ణుమూర్తి, బ్రహ్మదేవులను ప్రతిష్టించారు. ఈ మూడు ఆలయాలకూ ఎదురుగా, ఆయా దేవతల వాహనాలైనా నంది, గరుడ, హంసలకు కూడా ఆలయాలు కనిపించడం విశేషం. ఇవే కాకుండా వినాయకుడు, దుర్గాదేవి, సూర్యచంద్రులు... ఇలా పలు దేవీదేవతలకు చెందిన విగ్రహాలు ప్రంబనన్‌ ఆలయాలలో అడుగడుగునా కనిపిస్తాయి.

 

 

ఆలయ గోపురాలు, విగ్రహాలే కాదు.. ఆలయ గోడలు, స్తంభాల మీద కూడా అద్భుతమైన శిల్పచాతుర్యం కనినిస్తుంది. రామాయణ, భాగవతాలలో ఘట్టాలు కుడ్యచిత్రాలుగా దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఎన్ని ఉపాలయాలు శిధిలావస్థకు చేరుకున్నా, ఎన్ని గోడలు కూలిపోయినా... ఒకనాడు అక్కడ అద్భుతమైన ఆధ్మాత్మిక సామ్రాజ్యం విలసిల్లింది అనేందుకు అడుగడుగునా ఏదో ఒక ఆనవాలు కనిపిస్తూనే ఉంటుంది.   

 

 - నిర్జర.