వినాయకుడి ఆశీస్సులు పొందడానికి సులభ మార్గాలు ఇవిగో
వినాయకుడి ఆశీస్సులు పొందడానికి సులభ మార్గాలు ఇవిగో
హిందూ ధర్మంలో, వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవుడు లేదా దేవతకు ముఖ్యమైనదిగా చెబుతారు. బుధవారాన్ని వినాయకుడికి , బుధ గ్రహానికి చాలా ముఖ్యమని చెబుతారు. వినాయకుడు తెలివితేటలు, వివేకం, జ్ఞానానికి అధిపతి, అలాగే ఆటంకాలను తొలగిస్తాడని చెబుతారు. ఇవన్నీ విద్యార్థులకు ఎంతో అవసరం. ఈ కారణంగానే విద్యార్థులకు బుధవారం చాలా ప్రత్యేకమని, ఈ రోజు వినాయకుడిని ఆరాధించడం మంచిదని చెబుతారు. బుధవారం రోజు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే, విద్యలోని ఆటంకాలు తొలగిపోతాయని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని , చదువులో ఏకాగ్రత కలుగుతుందని నమ్మకం. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధ గ్రహం తెలివితేటలు, వాక్చాతుర్యం, తార్కిక సామర్థ్యం , విద్యకు కారకంగా పరిగణించబడుతుంది. వినాయకుడి ఆశీర్వాదం కావాలంటే పిల్లలు వినాయకుడిని ఎలా ఆరాధించాలి? తెలుసుకుంటే..
వినాయకుడు జ్ఞానానికి, వివేకానికి అధిపతి..
హిందూ గ్రంథాలలో, వినాయకుడిని తొలి దైవంగా , జ్ఞానానికి అధిపతిగా వర్ణించారు. ఏ శుభకార్యమైనా సజావుగా పూర్తి కావడానికి మొదట ఆయన పూజతోనే ప్రారంభిస్తారు. విద్యార్థులకు గణేశ పూజ ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని చెబుతారు. క్రమం తప్పకుండా వినాయకుడిని స్మరించుకునే విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, జ్ఞానం , సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెంపొందుతాయని నమ్ముతారు. అందుకే పరీక్షకు ముందు లేదా కొత్తగా చదువు ప్రారంభించే ముందు వినాయకుడిని పూజించే సంప్రదాయం ప్రాచీన కాలం నుండి ఉంది.
బుధ గ్రహానికి విద్యకు సంబంధం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు తెలివితేటలు, జ్ఞాపకశక్తి, వాక్చాతుర్యం, రచన, గణితం , తార్కిక శక్తితో సంబంధం కలిగి ఉంటాడు. బుధుడు శుభ స్థానంలో ఉంటే వ్యక్తి అభ్యాస సామర్థ్యాలు , భావవ్యక్తీకరణ అద్భుతంగా ఉంటాయి. అందువల్ల బుధవారం నాడు వినాయకుడిని పూజించడంతో పాటు, బుధ గ్రహం శాంతి కోసం కూడా ప్రార్థన చేయడం మంచిది. ఈ రోజున చేసే శుభకార్యాలు , మంచి ప్రవర్తన కలిగి ఉండటం పిల్లలలో మానసిక వికాసానికి దోహదపడతాయి.
వినాయకుడిని ఎలా పూజించాలి?
బుధవారం ఉదయం స్నానం చేసిన తర్వాత వినాయకుడికి గరిక,, ఆకుపచ్చ, పసుపు, ఎరుపు లేదా తెలుపు రంగు పువ్వులు, కుంకుమ , ఉండ్రాళ్లు లేదా బెల్లం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మంచిదని చెబుతారు. ఇలా చేసిన తర్వాత "ఓం గం గణపతయే నమః" అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు భక్తిశ్రద్ధలతో జపించడం మంచిది. వీలైతే గణేష్ అధర్వశిరను కూడా పఠించవచ్చు. వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు చేయవచ్చు. విద్యార్థులు వినాయకుడిని పూజిస్తూ, పుస్తకాలను గౌరవిస్తూ ఉంటే వారికి మంచి విద్య, జ్ఞానం లభిస్తాయని చెబుతారు.
ఈ పరిహారాలు మంచివి..
జ్యోతిష్య నమ్మకాల ప్రకారం బుధవారాల్లో పెసరపప్పు దానం చేయడం, ఆవులకు పచ్చి మేత పెట్టడం, పక్షులకు ఆహారం, నీరు అందించడం, పేద విద్యార్థులకు నోట్బుక్లు, పుస్తకాలు లేదా వ్రాత సామగ్రిని బహుమతిగా ఇవ్వడం వంటివి చాలా మంచి పుణ్యకార్యాలుగా పరిగణించబడతాయి. ఈ పనులు పుణ్యానికి దారితీయడమే కాకుండా, సేవాభావం, కరుణ, సహకారం వంటి స్ఫూర్తిని కూడా పెంపొందిస్తాయి. ఈ విలువలు విద్యార్థుల వ్యక్తిత్వాలను మెరుగుపరుస్తాయి.
కష్టం, అంకితభావం..
వినాయకుడి ఆశీస్సులు పొందడానికి కేవలం పూజలు, ప్రార్థనలు సరిపోవు, ఎప్పటి విషయాలు అప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి, ఉపాధ్యాయుల పట్ల గౌరవం, తల్లిదండ్రులకు సేవ, సత్యమార్గంలో ఉండటం కూడా అంతే ముఖ్యం. విద్యార్థులు అంకితభావంతో, క్రమశిక్షణతో చదువుకునేటప్పుడు వినాయకుడిని స్మరించుకుంటే వారిలో ఆత్మవిశ్వాసం, సానుకూల ఆలోచనా విధానం పెంపొందుతాయి. ఈ గుణాలు వారిని కేవలం చదువులోనే కాకుండా, జీవితంలోని ప్రతి విషయంలోనూ మంచి ఎదుగుదలకు సహాయపడతాయి.
*రూపశ్రీ.