విష్ణు సహస్రనామ పారాయణ ప్రాముఖ్యత ఏంటి... పారాయణ నియమాలేంటి!  

 

విష్ణు సహస్రనామ పారాయణ ప్రాముఖ్యత ఏంటి... పారాయణ నియమాలేంటి!  

 

హిందూ ధర్మంలో దైవ ఆరాధనకు,  దైవ స్తుతికి చాలా రకాల స్తోత్రాలు, శ్లోకాలు, దైవ నామాలు ఉన్నాయి. వీటిలో లలిత సహస్ర నామాలు,  విష్ణు సహస్ర నామాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. విష్ణుసహస్ర నామాలు ఆ శ్రీమన్నారాయణుడిని కీర్తిస్తూ సాగేవి అయితే.. లలిత సహస్రనామాలు అమ్మావారిని స్తుతిస్తూ సాగేవి. అయితే వీటిలో విష్ణుసహస్ర నామాలకు చాలా ప్రాధాన్యత ఉంది. విష్ణు సహస్రనామాలలో మహా విష్ణువుకు సంబంధించి వెయ్యి పేర్లు ఉంటాయి. ఇది మహాభారతంలో శాంతి పర్వంలో ప్రస్తావించబడింది.  విష్ణు సహస్ర నామ పారాయణ వల్ల దైవ కృప మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ప్రయోజనం కూడా చేకూరుతుందని అంటారు. విష్ణు సహస్రనామం ప్రాముఖ్యత ఏంటి? దీని పారాయణకు నియమాలు ఏంటి తెలుసుకుంటే..

భీష్ముడిని భీష్మపితామహుడు అంటారు.  కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు అంపశయ్యకు చేరినప్పుడు భీష్ముని నుండి  కొన్ని మంచి మాటలు వినమని పాండవులకు శ్రీకృష్ణుడు చెబుతాడు. అప్పుడే.. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు విష్ణు సహస్రనామాలను ధర్మరాజుకు బోధిస్తాడు.

విష్ణుసహస్రనామ ప్రాధాన్యత..

విష్ణుసహస్రనామ పారాయణ వల్ల మనిషి చేసిన పాపాలు నశిస్తాయని చెబుతారు.  దీన్ని రోజూ పఠించడం వల్ల ఆలోచనలు,  మనసు, చేసే పనులు అన్నీ పవిత్రం అవుతాయి. దీని కారణంగా కర్మల శుద్ది జరుగుతుంది.

మానసిక ఒత్తిడిత.. ప్రతికూల ఆలోచనలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తరువాత ప్రశాంత వాతావరణంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

శాస్త్రాల ప్రకారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.  దీని వల్ల దీర్ఘాయువు లభిస్తుందట.  ఇది శారీరక, మానసిక బాధల నుండి వ్యాధుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

విష్ణువును విశ్వానికి సంరక్షకుడు అంటారు.  విష్ణువు అనుగ్రహం వల్ల జీవితంలో సంపద, ఐశ్వర్యం,  అదృష్టం మొదలైనవి చేకూరతాయి.  ప్రతి విష్ణు సహస్రనామాలు చదువుతుంటే విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుందట.

చాలా భక్తులు మోక్షం కావాలి అంటుంటారు.  కానీ మానవ జీవితంలో సంసార బంధాలలో ఉంటే మోక్షం సాధ్యం కాదని అంటారు. కానీ ప్రతిరోజూ భక్తితో విష్ణుసహస్రనామ పారాయణం చేస్తుంటే జీవన్మరణ బంధాల నుండి విముక్తి పొందుతాడని, మోక్షానికి మార్గం సుగమం అవుతుందని అంటారు.

నియమాలు..

విష్ణుసహస్రనామ పారాయణ చేసేముందు పారాయణ నియమాలు తెలుసుకుని పాటించాలి.  పారాయణ చేసేముందు స్నానం చేయాలి.  శుభ్రమైన బట్టలు ధరించాలి.  మనస్సు, శరీరం రెండూ స్వచ్చంగా ఉండాలి. ఎవరి మీద ఈర్ష్య, కోపం, అసూయ వంటివి మనసులో పెట్టుకుని పారాయణ చేయరాదు.

ఉదయం సమయం దైవ ఆరాధనకు చాలా మంచిది. అలాగే  పారాయణ చేసే స్థలం కూడా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల భగవంతుని మీద మనసు లగ్నం చేసి పారాయణ చేయగలుగుతారు.  వీలైతే పూజ గదిలోనో లేక తులసి కోట ముందో కూర్చుని పారాయణ చేయడం మంచిది.

విష్ణు సహస్రనామ పారాయణ మొదలుపెట్టేవారికి పారాయణలో తప్పులు దొర్లుతుంటాయి. అయితే అలా దొర్లకుండా నామాలను చాలా నెమ్మదిగా సాధన చేయాలి.  ఒకసారి నామాలు చదవడం అశువుగా వస్తే ఆ తరువాత వేగంగా చదవచ్చు. అయితే ఉచ్ఛారణ దోషాలు ఉండకుండా చూసుకోవడం మంచిది.

విష్ణుసహస్ర నామ పారాయణ  ముఖ్యంగా ఏకాదశి,  పూర్ణిమ,  గురువారాలలో పారాయం చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి.


                                      *రూపశ్రీ.