జపం ఎందుకు చేస్తారు?
జపం ఎందుకు చేస్తారు?
కలియుగంలో భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే సాధనంగా జపాన్ని పేర్కొంటారు. అందుకు నిదర్శనంగా మన ఆధ్మాత్మిక గ్రంథాలలో జపం యొక్క విశిష్టత అడుగడుగునా ప్రస్తావనకి వస్తూ ఉంటుంది. అలాంటి జపం గురించి కొన్ని విశేషాలు...
- జపించడం అంటే తనలో తాను స్మరించుకోవడం అన్న అర్థం వస్తుంది. ‘జపం’ అంటే మాటకు- ‘జ’కారో జన్మవిచ్ఛేదః ‘ప’కారః పాపనాశనః... అంటూ ప్రతిపదార్థం చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తనకు ఇష్టమైన భగవంతుని నామాన్ని కానీ మంత్రాన్ని కానీ తరచూ స్మరించుకోవడమే జపం.
- జపం గురించిన ప్రస్తావన అనాదిగా వినిపిస్తూనే ఉంది. వేదాలలో తొలిసారి కనిపించిన ఈ మాట మనుస్మృతి, పతంజలి యోగసూత్రాలలో కూడా కనిపిస్తుంది. ఇక భగవద్గీతలో శ్రీకృష్ణుడు యజ్ఞాలలో తాను జపయజ్ఞాన్నని స్పష్టంగా పేర్కొంటాడు.
మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ |
యజ్ఞానాం జపయజ్ఞోఽస్మి స్థావరాణాం హిమాలయః (10.25)
- భారతీయ సంస్కృతి ప్రభావంతో సిక్కు, క్రైస్తవ, బౌద్ధ, జైన మతాలలో సైతం వేర్వేరు రూపాలలో ఈ జపం కనిపిస్తూ ఉంటుంది.
- జపాన్ని మూడు రకాలుగా పేర్కొంటారు. పైకి వినిపించేట్లుగా చేసే జపాన్ని వాచక జపం అంటారు. వినపడీ వినపడనట్లుగా చేసుకునే జపాన్ని ఉపాంశు జపం అంటారు. ఏమాత్రం సద్దు చేయకుండా మనసులోనే సాగిపోయే జపాన్ని మానసిక జపం అంటారు. వీటిలో ఒకదాన్ని మించిన ఫలితం మరో జపం ఇస్తుందని ఉపనిషత్తుల మాట. అంటే మనసులో నిశ్చలంగా సాగిపోయే జపానికే మన పెద్దలు ప్రాముఖ్యతని ఇచ్చారన్నమాట.
- జపం అంటేనే ప్రార్థనకు క్లుప్తమైన రూపం. కాబట్టి మనకి ఇష్టమైన దేవత గురించిన స్మరణను జపంగా మలచుకోవచ్చు (ఉదా॥ ఓం నమశ్శవాయ). లేదా ఎవరన్నా గురువుగారు దీక్ష ద్వారా ఒసగిన మంత్రాన్ని జపించవచ్చు. అదీ కాదంటే మనసుకి నచ్చిన ఏదన్నా వాక్యాన్ని (ఒం శాంతిః శాంతిః శాంతిః) స్మరించుకోవచ్చు. దీనికి ఫలానా సమయంలో చేయాలన్న కాలనియమం కానీ, ఫలానావారే చేయాలన్న కట్టడి కానీ ఏమీ లేదు. కావల్సిందల్లా నిర్మలమైన మనసు మాత్రమే!
- జపంతో నిరంతరం భగవన్నామ స్మరణ చేయడం వల్ల, పరిపరి విధాలా పరుగులుదీసే ఇంద్రియాలు స్థిమితపడతాయి. మనం ఏ మంత్రాన్నైతే జపిస్తున్నామో అది మన మనసులోకి అంతకంతకూ గాఢంగా చొచ్చుకుపోతుంది. తొలుత బలవంతంగా కనిపించే ఈ ప్రక్రియ ఒక సాధనగా మారిపోతుంది. ఇలా కొన్నాళ్లు సాధన చేసిన పిమ్మట సాధకుడు ‘అజపజపం’ అనే స్థితిని చేరుకుంటాడు. అంటే జపం చేయకున్నా కూడా మనసులోని ఒక భాగంలో నామస్మరణ నిర్విరామంగా సాగిపోతూనే ఉంటుంది.
- మిగతా జీవుల సంగతేమో కానీ మనిషికి శబ్దానికీ మధ్య గాఢమైన సంబంధం ఉంది. మనిషి శబ్దం ద్వారానే తన భావాలను వ్యక్తపరుస్తాడు. శబ్దాన్ని వినడం ద్వారానే ఎదుట ఏం జరుగుతోందో అవగతం చేసుకుంటాడు. మనిషి వినే మాటకి అనుగుణంగా అతనిలోని మనసు ప్రతిస్పందిస్తుంది. అందుకనేనేమో ఈ సృష్టి యావత్తూ ఓంకారం అనే శబ్దం నుంచి ఉత్పన్నం అయిందన్న వాదనలు హిందూ ధర్మంలో వినిపిస్తుంటాయి. అలాంటి శబ్దాన్ని ఉపాసించడం ద్వారా మనసుని లయం చేసుకోవడమే జపంలోని అంతరార్ధం. అది నిర్విరామంగా సాగినా, జపమాల సాయంతో సాగినా.... మన జీవితాన్ని తరింపచేసే ఒక నామాన్ని, వీలైనప్పుడల్లా కాసేపు తలచుకోమని చెప్పడమే జపసాధనలోని పరమార్థం.
- నిర్జర.