పాదాభివందనం ఎందుకు!
పాదాభివందనం ఎందుకు?
పెద్దలు, పూజ్యులు కనిపించగానే పాదాభివందనం చేయాలంటారు. ఈ మాట ఈనాటిది కాదు! వేల ఏళ్లుగా భారతీయ సంస్కృతితో భాగంగా సాగుతున్న ఆచారం ఇది. ఇంతకీ ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఉద్దేశం ఏమై ఉంటుంది!
- పొద్దున లేచిన దగ్గర్నుంచీ నానా తిట్లూ తిట్టుకునే శత్రువులు సైతం కరచాలనం చేసుకోవచ్చుగాక. ఎందుకంటే అలాంటి అభివాదాలన్నీ కృతకంగా సాగిపోతాయి. కానీ ఒక వ్యక్తికి పాదాభివందనం చేస్తున్నామంటే అతన్ని మనం మనసావాచా గౌరవిస్తున్నట్లు లెక్క.
- ఎదుటి వ్యక్తి పాదాలను స్పృశించడం అంటే తాత్కాలికంగా అయినా మన అహంకారాన్ని అణచివేసుకోవడమే! అహంకారం అణిగిన మనసులోనే వినయమూ, వివేకాలకి ఆస్కారం ఉంటుంది. అవే ఉన్నత వ్యక్తిత్వానికి దారితీస్తాయి.
- పాదాభివందనం చేయమన్నారు కదా అని ఏదో ఇలా ఓ చేయి చాపితే సరిపోదు అంటున్నాయి శాస్త్రాలు. మనుస్మృతి ప్రకారం రెండు చేతులతోనూ ఎదుటి వ్యక్తి రెండు కాళ్లనూ స్పృశించాల్సిందే! అంటే కృతకంగా కాకుండా ఎదుటిమనిషి ముందు తలవంచాల్సిందే అన్నమాట!
- అవతలి వ్యక్తికి పాదాభివందనం చేయడం వల్ల మనలోని అహంకారం ఎలాగైతే అణగిపోతుందో, ఎదుటి మనిషిలో మన పట్ల అవ్యాజమైన ప్రేమ జనిస్తుంది. ఆ ప్రేమ మన మంచిని కోరుతుంది. అలా వారు ఇచ్చే ఆశీస్సులు మనకు సకల శుభాలనీ కలిగిస్తాయి.
- పాదాభివందనాన్ని స్వీకరించడం ద్వారా పెద్దలు మన దుష్కర్మల తాలూకు ప్రభావాన్ని దహించివేస్తారని కొందరి నమ్మకం.
- కేవలం వయసులోనే కాదు.... భక్తిలోను, జ్ఞానంలోనూ మనకంటే పెద్దవారి పాదాలను స్పృశించడం ద్వారా మనం వారి ఆశీస్సులని కోరుకుంటాము. ఏదో ఒక విషయంలో వారు మనకంటే పెద్దవారన్న విషయాన్ని ఒప్పుకొని... వారి ఆశీస్సులు, సహాయమూ మనకి కావాలని వేడుకోవడమే ఆ పాదాభివందనంలోని ఆంతర్యం.
- మన శరీరంలోని నాడులన్నీ చేతులు, కాళ్ల దగ్గరకి వచ్చి నిలిచిపోతాయన్న విషయం తెలిసిందే! అయితే అవి కేవలం భౌతికమైన నాడులు మాత్రమే కాదనీ, శక్తిపాతాన్ని అందించే కేంద్రాలు కూడా అని మన ప్రాచీనుల నమ్మకం. మనం ఎదుటివారికి పాదాభివందనం చేయడం, దానికి మారుగా వారు తమ చేతులని మన శిరసు మీద ఉంచడంతో ఇద్దరిలోని శక్తిప్రవాహం ఒక వలయంగా మారుతుందని నమ్ముతారు. అది ఇరువురి మనసులోనూ సానుకూలమైన ప్రభావాన్ని చూపుతుందంటారు. ఇంతెందుకు! ఒక్కమాటలో చెప్పాలంటే తల్లిదండ్రులను, గురువులను, పూజ్యులను, జ్ఞానులను కొలుచుకునేందుకు పాదాభివందనాన్ని మించిన ఆచారం లేదని రూఢి చేసుకోవచ్చు.
- నిర్జర.