సౌభాగ్యం కలకాలం నిలవాలంటే.. సావిత్రీ గౌరీ వ్రతం చెయ్యాల్సిందే!

 

సౌభాగ్యం కలకాలం నిలవాలంటే.. సావిత్రీ గౌరీ వ్రతం చెయ్యాల్సిందే..!

భారతీయ మహిళలకు వ్రతాలు చాలా ప్రత్యేకం.  వివాహం కాని వారు కొన్ని వ్రతాలు,  వివాహం అయిన వారు మరికొన్ని వ్రతాలు చేసుకుంటూ ఉంటారు.  ఇలా వ్రతాలు ఆచరించడం వల్ల దైవ భక్తి,  ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా మహిళల జీవితంలో ప్రశాంతత,  సంతోషం చోటు చేసుకుంటాయి.  దాంపత్య జీవితం బాగుండాలన్నా,  సౌభాగ్యం కలకాలం నిలిచి ఉండాలన్నా చేసుకునే వ్రతాలలో సావిత్రీ గౌరీ వ్రతం ముఖ్యమైనది.  పుష్య మాసంలో సంక్రాంతి పండుగ తరువాత చేసుకునే ఈ వ్రతం  వివాహిత స్త్రీలకు పుణ్యాన్ని కూడా అందిస్తుందని చెబుతారు.  ఇంతకీ ఈ సావిత్రీ గౌరీ వ్రతాన్ని ఎలా  చేసుకోవాలి?

శ్రావణ మాసంలో మంగళగౌరీ నోములు నోచుకోవడం చూసే ఉంటారు.  మంగళ గౌరీ నోములు నోచుకున్ననట్టే సావిత్రి గౌరీ నోములు కూడా నోచుకుంటారు.  ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి.  తలకు నువ్వుల నూనె రాసుకోవాలి.  కాళ్లకు చేతులకు పసుపు రాసుకోవాలి.  కళ్లకు కాటుక పెట్టుకుని నుదుటన బొట్టు పెట్టుకుని తలలో పువ్వులు పెట్టుకుని స్నానం చేయాలి.  తరువాత ఇంటి గుమ్మానికి, గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడాకులు కట్టాలి.

పూజ గదిని శుభ్రం చేసుకుని  గదిలో ఒక  ఆసనం ఏర్పాటు చేయాలి. ఆసనం మీద ఒక కొత్త వస్త్రం ఏర్పాటు చేసి దాని మీద కలశం పెట్టాలి.  రాగి లేదా ఇత్తడి, వెండి ఏదో ఒక చెంబు తీసుకుని అందులో బియ్యం లేదా నీరు ఏదో ఒకటి నింపి దానిలో పసుపు, కుంకుమలు వేసి దాని మీద కొబ్బరికాయను ఉంచాలి.  కొబ్బరికాయ మీద కొత్త వస్ర్తం ఉంచాలి. కలశం వెనుక గౌరీదేవి పోటో ఉంచాలి. గౌరీ దేవి ఫోటో లేకపోతే పార్వతీ పరమేశ్వరుల ఫొటో అయినా ఉంచవచ్చు. ఫొటోను పసుపు, కుంకుమ, పూల మాలతో అలంకరించాలి.

పసుపు గణపతిని, పసుపు గౌరమ్మను కూడా చేసి పూజలో పెట్టుకోవాలి. గణపతికి,  గౌరమ్మకు షోడశోపచార పూజ చేసి అష్టోత్తర పూజ కూడా చేయాలి. నవధాన్యాలు,  తొమ్మిది రంగుల పువ్వులతో అర్చించాలి.  తొమ్మిది ముడులు ఉన్న తోర బంధాలను మూడింటిని ఏర్పాటు చేసుకోవాలి.  వీటిలో ఒకటి వ్రతం చేసుకునేవారికి,  మరొకటి అమ్మవారికి, ఇంకొకటి ఒక ముత్తైదువకు కట్టాలి. అమ్మవారికి గంధం,   తాంబూలం, పండ్లు, చీర,  గాజులు సమర్పించాలి.  ముత్తైదువకు కూడా అదే విధంగా సమర్పించాలి. తదనంతరం వ్రత కథ చదువుకోవాలి.   ఇలా చేస్తే.. సౌభాగ్యం కలకాలం నిలిచి ఉంటుంది.  ఆ అమ్మ ఆశీర్వాదాలు లభిస్తాయి.


                                             *రూపశ్రీ.