Read more!

శ్రీసాయిసచ్చరిత్రము నలభైఒకటవ అధ్యాయం

 

శ్రీసాయిసచ్చరిత్రము


నలభైఒకటవ అధ్యాయం

 

 

 

 

1. చిత్రపటము యొక్క వృత్తాంతము. 2. గుడ్డపీలికలను

 

దొంగిలించుట. 3. జ్ఞానేశ్వరి పారాయణము


గత అధ్యాయంలో చెప్పిన ప్రకారం ఈ అధ్యాయంలో చిత్రపటం యొక్క వృత్తాంతము చెపుతాము. గత అధ్యాయంలోని విషయం జరిగిన 9 సంవత్సరాలకు ఆలీ మహమ్మద్, హేమాడ్ పంతును కలిసి ఈ దిగువ కథ చెప్పారు.
ఒకరోజు బొంబాయి వీథులలో వెళ్తున్నప్పుడు, వీథిలో తిరిగి అమ్మేవాడి దగ్గర ఆలీ మహమ్మద్ సాయిబాబా పటాన్ని కొన్నారు. దానికి చట్రం కట్టించి, తన బాంద్రా ఇంటిలో గోడకు వ్రేలాడదీశారు. అతడు బాబాను ప్రేమించటంతో ప్రతిరోజూ చిత్రపటం దర్శనం చేస్తుండేవాడు. హేమాడ్ పంతుకు ఆ పటం ఇవ్వడానికి 3 నెలల ముందు అతను కాలుమీద కురుపులేచి బాధపడుతూ ఉన్నాడు. దానికి శాస్త్ర చికిత్స జరిగింది. అప్పుడు అతను బొంబాయిలో ఉన్న తన బావమరిది అయిన నూర్ మహమ్మద్ పీర్ భాయి యింటికి ఉండేవాడు. బాంద్రాలో తన ఇల్లు 3 మాసాల వరకు మూయబడి ఉండింది. అక్కడ ఎవ్వరూ లేకపోయారు.

 

 

 

 


అక్కడ ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహమాన్ బాబా, మౌలానాసాహెబు, మహమ్మద్ హుసేను, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలైన (సజీవ) యోగుల పటాలు ఉన్నాయి. వాటిని కూడా కాలచక్రం విడువలేదు. అతడు వ్యాధితో బాధపడుతూ బొంబాయిలో ఉన్నాడు. బాంద్రాలో ఆ పటం ఎలా బాధపడవలెను? పటాలకు కూడా చావుపుట్టుకలు ఉన్నట్టుంది. పటాలు అన్నీ వాని వాని అదృష్టాలను అనుభవించాయి. కాని సాయిబాబా పటం మాత్రం ఆ కాలచాక్రాన్ని తప్పించుకుంది. అదెలా తప్పించుకో గలిగిందో నాకు ఇంతవరకు ఎవరూ చెప్పలేకపోయారు. దీన్ని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనీ, సర్వవ్యాపి అనీ అనంతశక్తుడనీ తెలుస్తున్నది. ఆలీమహమ్మద్ అనేక సంవత్సరాల క్రిందట యోగి అయిన అబ్దుల్ రహమాన్ బాబా చిన్న పటాన్ని మహమ్మద్ హుసేన్ థారియా దగ్గర సంపాదించారు. దాన్ని తన బావమరిది అయిన నూర్ మహమ్మద్ పీర్ భాయికి ఇచ్చారు. అది అతని టేబుల్ లో 8 సంవత్సరాలు పడివుంది. ఒకరోజు అతడు దాన్ని చూశాడు. అతను దాన్ని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకువెళ్ళి సజీవప్రమాణం అంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టాడు. అందులో ఒకటి ఆలీమహమ్మద్ కి ఇచ్చాడు. దాన్ని అతడు తన బాంద్రా యింటిలో పెట్టాడు.

 

 

 

 


నూర్ మహమ్మద్ అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్భారులో ఉండగా అతడు గురువుగారిని దీన్ని కానుకగా ఇవ్వడానికి వెళ్లగా వారు అమిత కోపంతో కొట్టబోయి నూర్ మహామ్మదుని అక్కడినుండి తరిమివేశారు. అతడు అమితంగా విచారపడి చికాకు పొందాడు. తన ద్రవ్యం అంతా నష్టపోవడమే కాక గురువుగారి కోపానికి, అసంతృప్తికి కారణం అయ్యాను గదా అని చింతించాడు. విగ్రహారాధన గురువుగారికి ఇష్టం లేదు. ఆ పటం అపోలో బందరుకు తీసుకువెళ్ళి, ఒక పడవను అద్దెకు కట్టించుకుని సముద్రంలోకి వెలి, దాన్ని అక్కడ నీళ్ళలో ముంచివేశాడు. తన బంధువుల దగ్గరనుంచి స్నేహాయ్తుల దగ్గరనుంచి పటాలను తెప్పించి (16 పటాలు) వాటిని కూడా బాంద్రా సముద్రంలో ముంచేశాడు. ఆ సమయంలో ఆలీమహమ్మద్ తన బావమరిది యింటిలో ఉన్నాడు. యోగుల పటాలను సముద్రంలో పడవేస్తే తన వ్యాధి కుదురుతుందని బావమరిది చెప్పాడు. ఇది విని ఆలీ మహమ్మద్ తన మేనేజర్ ను బాంద్రా యింటికి పంపి అక్కడున్న పటాలు అన్నింటినీ సముద్రంలో పడేయించాడు.

 

 

 

 


రెండు నెలల తరువాత ఆలీమహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటం ఎప్పటిలా గోడమీద ఉండటం గమనించి ఆశ్చర్యపడ్డాడు. తన మేనేజరు పటాలన్నీ తీసివేసి బాబా పటం ఎలా మరిచాడో అతనికే తెలియలేదు. వెంటనే దాన్ని తీసి బీరువాలో దాచాడు. లేకపోతే తన బావగారు దాన్ని చూస్తే దాన్ని కూడా నాశనం చేస్తాడని భయపడ్డాడు. దాన్ని ఎవరికీ ఇవ్వాలి? దాన్ని ఎవరు జాగ్రత్త పరుస్తారు? దాన్ని భద్రంగా ఎవరు ఉంచగలరు? అనే విషయాలు ఆలోచిస్తుండగా సాయిబాబాయే ఇస్ముముజావర్ ను కలిసి వారి అభిప్రాయం ప్రకారం చేయవలసిందని తోచునట్లు చేశారు. ఆలీమహమ్మద్ ఇస్ముముజావర్ ను కలుసుకుని జరిగినదంతా చెప్పాడు. ఇద్దరూ బాగా ఆలోచించి ఆ పటాన్ని హేమాడ్ పంతుకు ఇవ్వాలని నిశ్చయించారు. అతడు దాన్ని జాగ్రత్తపరుస్తాడని తోచింది. ఇద్దరూ హేమాడ్ పంతు దగ్గరికి వెళ్ళి సరియైన కాలంలో దాన్ని బహుకరించారు.
ఈ కథను బట్టి బాబాకి భూతభవిష్యత్ వర్తమానాలు తెలుసుననీ, చాకచాక్ర్యంగా సూత్రాలు లాగి తన భక్తుల కోరికలు ఎలా నెరవేరుస్తూ ఉన్నారో కూడా తెలుస్తుంది. ఎవరికయితే ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువ శ్రద్దో వారిని బాబా ప్రేమించటమే కాక వారి కష్టాలను తొలగించి వారిని ఆనందభరితులుగా చేస్తూ ఉండేవారని రాబోయే కథవలన తెలుస్తుంది.



గుడ్డపీలికలను దొంగలించుట - జ్ఞానేశ్వరి చదువుట :

 

 

 

 


బి.వి.రావు దహనులో మామలతదారు. అతడు జ్ఞానేశ్వరిని, ఇతర మత గ్రంథాలను చదవాలని చాలా కాలం నుంచి కోరుకుంటున్నాడు. భగవద్గీతపై మరాటీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినం భగవద్గీతలో ఒక అధ్యాయాన్ని ఇతర గ్రంథాలనుండి కొన్ని భాగాలను పారాయణ, చేస్తుండేవాడు. కాని జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో అవాంతరాలు ఏర్పడటంతో పారాయణం ఆగిపోతూ ఉండేది. మూడు నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామమైన పౌండుకు వెళ్ళాడు. ఇతర గ్రంథాలన్నీ అక్కడ చదవగలిగాడు. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏవో విపరీతమైన చెడు ఆలోచనలు తన మనస్సులో ప్రవేశించడంతో చదవలేకపోతున్నాడు. అతడు ఎంత ప్రయత్నించినా కొన్ని పంక్తులు కూడా చదవలేక పోయాడు.  కాబట్టి బాబా తనకు ఆ గ్రంథం పట్ల శ్రద్ధ కలగ చేసి నప్పుడే, దాన్ని చదవమని వారి నోటివెంట వచ్చినప్పుడే, దాన్ని ప్రారంభిస్తాననీ, అంతవరకూ దాన్ని తెరువననీ నిశ్చయం చేసుకున్నాడు. అతడు 1914 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితంగా షిరిడీకి వెళ్ళారు. అక్కడ ప్రతిదినం జ్ఞానేశ్వరి చదువుతున్నావా అని బాపూసాహెబు జోగ్, దేవుగారిని అడిగారు. దేవు తనకు అలాంటి కోరిక ఉన్నదనీ, కానీ దాన్ని చదవటానికి శక్తి చాలకుండా ఉందనీ, బాబా ఆజ్ఞాపించి నట్లయితే దాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. అప్పుడు జోగ్, ఒక పుస్తకాన్ని తీసుకుని బాబాకి ఇచ్చినట్లయితే, దాన్ని వారు తాకి పవిత్రం చేసి ఇస్తారనీ అప్పటినుండి నిరాటంకంగా చదువవచ్చు అనీ దేవుకు సలహా యిచ్చారు. బాబాకు తన ఉద్దేశం తెలుసు కనుక దేవుగారు అలా చేయడానికి అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా? దాన్ని పారాయణ చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేరా? అన్నారు.

 

 

 

 


దేవు బాబాను దర్శించి, ఒక రూపాయి దక్షిణ ఇచ్చారు. బాబా 20 రూపాయలు దక్షిణ అడగ్గా దాన్ని చెల్లించారు. ఆనాడు రాత్రి బాలకరాముడు అనే వాణ్ణి కలుసుకుని అతడు బాబా పట్ల భక్తిని వారి అనుగ్రహాన్ని ఎలా సంపాదించాలి అని ప్రశ్నించారు. మరుసటి రోజు హారతి తరువాత అంతా తెలుపుతానని అతడు బదులు యిచ్చాడు. ఆ మరుసటి రోజు దర్శనం కోసం దేవు వెళ్లగా బాబా అతన్ని 20 రూపాయలు దక్షిణ ఇవ్వమన్నారు. వెంటనే దేవు దాన్ని చెల్లించారు. మసీదు నిండా జనాలు నిండి ఉండటంతో దేవు ఒక మూలకు వెళ్ళి కూర్చున్నాడు. బాబా అతన్ని పిలిచి శాంతంగా తన దగ్గర కూర్చోమని అన్నారు. దేవు అలాగే చేశాడు. మధ్యాహ్న హారతి తరువాత భక్తులు అందరూ వెళ్ళిన తరువాత దేవు, బాలకరాముని చూసి అతని పూర్వవృత్తాతంతో పాటు బాబా అతనికి ఏమి చెప్పారో, ధ్యానం ఎలా నేర్పారో అని అడగ్గా బాలకరాముడు వివరాలు చెప్పడానికి సిద్ధపడ్డాడు. అంతలో బాబా చంద్రు అనే కుష్ఠురోగభక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మన్నారు. దేవు బాబా దగ్గరికి వెళ్లగా ఎవరితో ఏమి మాట్లాడుతున్నావు అని బాబా అడిగారు. బాలకరమునితో మాట్లాడుతున్నాననీ, బాబా కీర్తిని వింటున్నాననీ అతడు చెప్పాడు. తిరిగి బాబా 25 రూపాయలు దక్షిణ అడిగారు. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించారు.

 

 

 

 


అతన్ని బాబా లోపలికి తీసుకునివెళ్ళి స్తంభం దగ్గర కూర్చుని "నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా ఎందుకు దొంగిలించావు?'' అన్నారు. దేవు అనకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమీ తెలియదు అన్నాడు. బాబా అతన్ని వెదకమన్నారు. అతడు వెదికాడు. కాని అక్కడ ఏమీ దొరకలేదు. బాబా కోపంతో ఇలా అన్నారు "ఇక్కడ ఇంకెవ్వరూ లేరు. నీవొక్కడివే దొంగవు. ముసలితనతో వెంట్రుకలు పండినప్పటికీ ఇక్కడికి దొంగలించడానికి వచ్చావా?'' అని కోపగించారు. బాబా మతిచెడినవాడిలా తిట్టి కోపగించి చివార్లు పెట్టారు. దేవు నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. దేవు తాను సటకా దెబ్బలు కూడా తింటానేమో అనుకున్నారు. ఒక గంట తరువాత బాబా అతన్ని వాడకు వెళ్ళమన్నారు. దేవు అక్కడికి వెళ్ళి జరిగినదంతా జోగుకు, బాలకరాముడికి తెలియజేశారు. సాయంకాల, అందరిని రమ్మని బాబా కబురు పంపారు. ముఖ్యంగా దేవును రమ్మన్నారు. "నా మాటలు వృద్దుని బాధించి ఉండవచ్చు గాని, అతడు దొంగలించటంతో నేను అలా పలకవలసి వచ్చింది''అని బాబా అన్నాడు. తిరిగి బాబా 12 రూపాయల దక్షిణ అడిగారు. దేవు దాన్ని వసూలు చేసి చెల్లించి, సాష్టాంగనమస్కారం చేశారు. బాబా ఇలా అన్నారు "ప్రతిరోజూ జ్ఞానేశ్వారిని చదువు. వెళ్ళి వాడాలో కూర్చో. ప్రతినిత్యం కొంచెమైనా క్రమం తప్పక చదువు. చదువుతున్నప్పుడు దగ్గర ఉన్న వారికి శ్రద్ధాశక్తులతో బోధపరిచి చెప్పు. నేను నీకు జల్తారు సెల్లా ఇవ్వడానికి ఇక్కడ కూర్చుని ఉన్నాను. ఇతరుల దగ్గరికి వెళ్ళి దొంగిలించి చదవటం ఎందుకు? నీకు దొంగతనానికి అలవాటు పడాలని ఉన్నదా?''

 

 

 

 


బాబా మాటలు విని దేవు సంతోషించారు. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించారనీ, తనకు కావలసింది ఏమిటో అది దొరికిందనీ, అప్పటినుండి తాను సులభంగా చదవగలననీ అనుకున్నారు. తిరిగి బాబా పాదాలకు సాష్టాంగనమస్కారం చేశారు. తాను శరణువేడుకున్నాడు కాబట్టి తనను బిడ్డగా ఎంచి, జ్ఞానేశ్వరి చదవడంలో తోడ్పడవలసిందని బాబాను వేడుకున్నాడు. పీలికలు దొంగిలించటం అంటే ఏమిటి దేవు అప్పుడు గ్రహించారు. బాలకరాముని ప్రశ్నించడమే గుడ్డపీలికలు దొంగిలించటం. బాబాకి అలంటి వైఖరి ఇష్టం లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడానికి తానే సిద్ధంగా ఉన్నారు. ఇతరులను అడగటం బాబాకు ఇష్టం లేదు. అందుకే అతన్ని బాధించి చికాకు పెట్టారు. అదీకాక ఇతరులను అడగకుండా బాబానే సర్వం అడిగి తెలుసుకొనవలసిందనే, ఇతరులను ప్రశ్నించటం నిష్ప్రయోజనం అనీ చెప్పారు. దేవు ఆ తిట్లను ఆశీర్వాదాలుగా భావించి సంతృప్తితో ఇంటికి వెళ్ళారు. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదవమని ఆజ్ఞాపించి ఊరుకోలేదు. ఒక సంవత్సరంలోపుగా బాబా దేవు దగ్గరికి వెళ్ళి అతని అభివృద్ధి కనుగొన్నారు. 1914వ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుని "జ్ఞానేశ్వరి బోధపడుతుందా లేదా?'' అని అడిగారు. "లేదు'' అని దేవు జవాబిచ్చారు.
బాబా : ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు?
దేవు కళ్ళతడి పెట్టుకుని "నీకృపను వర్షింపనిదే పారాయణం చికాకుగా ఉన్నది, బోధపడటం చాల కష్టంగా ఉన్నది. నేను దీన్ని నిశ్చయంగా చెపుతున్నాను'' అన్నాడు.
బాబా : చదువుతున్నప్పుడు, నీవు తొందరపడుతున్నావు. నా ముందు చదువు. నా సమక్షంలో చదువు.
దేవు : ఏమి చదవాలి?
బాబా : అధ్యాత్మ చదువు.
పుస్తకం తీసుకుని రావడానికి దేవు వెళ్ళాడు. అంతలో మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు. ఈ దృశ్యాన్ని చూసిన తరువాత దేవుకి ఎంత ఆనందం, సంతోషం కలిగాయో చదువుతున్నవారే గ్రహింతురు గాక!
నలభైఒకటవ అధ్యాయం సంపూర్ణం