Read more!

శ్రీసాయిసచ్చరిత్రము ముప్పైఏడవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము

 

ముప్పైఏడవ అధ్యాయము

 

చావడి ఉత్సవము


హేమాడ్ పంతు ఈ  అధ్యాయంలో కొన్ని వేదాంత విషయాలు ప్రస్తావించిన తరువాత చావడి ఉత్సవాన్ని గురించి వర్ణిస్తున్నారు.
 
తొలిపలుకు :

 

 

 



శ్రీ సాయి జీవితం అత్యంత పావనమయినది. వారి నిత్యకృత్యాలు ధన్యం. వారి పద్ధతులు, చర్యలు వర్ణింపడానికి వీలులేదు. కొన్ని సమయాలలో వారు బ్రహ్మానందంతో మైమరిచిపోయేవారు. మరికొన్ని సమయాలలో ఆత్మజ్ఞానంతో తృప్తి పొందేవారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులు నెరవేరుస్తూ ఎలాంటి సంబంధం లేనట్లు ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్టు కనిపించినప్పటికీ వారు సోమరిగా గాని; నిద్రితులుగా గాని, కనిపించెడివారు కాదు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేవారు. వారు సముద్రంలా శాంతంగా తొణకక ఉండేట్లు కనిపించినా వారి గాంభీర్యం, లోతు, కనుగొన లేనివి. వర్ణనాతీతమైన వారి నైజం వర్ణింపగల వారు ఎవ్వరు? పురుషులను అన్నదమ్ముల వలే, స్త్రీలను అక్కచెల్లెళ్ళుగా, తల్లులుగా చూసుకునేవారు. వారి శాశ్వత స్ఖలిత బ్రహ్మచర్యం అందరూ ఎరిగినదే. వారి సాంగత్యంలో మనకు కలిగిన జ్ఞానం మనం మరణించే వరకు నిలుచుగాక! ఎల్లప్పుడు హృదయపూర్వకమైన భక్తితో వారి పాదాలకు సేవ చేసెదముగాక! వారిని సకలజీవకోటిలో చూసెదము గాక! వారి నామం ఎల్లప్పుడూ ప్రేమించెదముగాక!
వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసం చేసిన తరువాత హేమాడ్ పంతు చావడి ఉత్సవాన్ని వర్ణించడం మొదలుపెట్టారు.

చావడి ఉత్సవం :

 

 

 

 



బాబా శయనశాలను ఇదివరకే వర్ణించాను. వారు ఒకరోజు మసీదులోను, ఇంకొకరోజు చావడిలోను నిద్రిస్తూ ఉండేవారు. మసీదుకు దగ్గరలోనే చావడి రెండు గదులతో ఉండేది. బాబా మహాసమాధి చెందేవరకు ఒకరోజు మసీదులో, ఇంకొకరోజు చావడిలో నిద్రిస్తూ ఉండేవారు. 1910 డిశంబరు 10వ తేదీనుండి చావడిలో భక్తులు పూజా హారతులు జరపడం మొదలుపెట్టారు. బాబా కటాక్షంతో దీనినే ఇప్పుడు వర్ణిస్తున్నాను. చావడిలో నిద్రించే సమయం రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు. భజనబృందం వెనుక రథం, కుడివైపు తులసీబృందావనం, ముందర బాబా వీటి మధ్య భజన జరుగుతుండేది. భజనలో ప్రీతి కల స్త్రీపురుషులు సరియైన కాలానికి వస్తుండేవారు. కొందరు తాళాలు, కొందరు చిరతలు, మృదంగం, కంజీరా, మద్దెలలు పట్టుకుని భజన చేస్తుండేవారు. సూదంటురాయిలా సాయిబాబా భక్తులందరినీ తన వద్దకు ఈడ్చుకునే వారు. బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేస్తూ ఉన్నారు. కొందరు పల్లికిని అలంకరిస్తూ ఉన్నారు. కొందరు బెత్తాలను చేత ధరించి 'శ్రీసాయినాథ మహారాజ్ కీ జై!' అని కేకలు వేస్తూ ఉన్నారు. మసీదు మూలాలు తోరణాలతో అలంకరిస్తూ ఉన్నారు. మసీదు చుట్టూ దీపాలవరసలు కాంతిని వెదజల్లుతూ ఉన్నాయి. బాబా గుఱ్ఱం శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుని ఉండేది. అప్పుడు తాత్యాపాటీలు కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేవారు.

 

 

 



బాబా నిశ్చలంగా కూర్చునేవారు. తాత్యాపాటీలు వచ్చి బాబా చంకలో చేయివేసి లేవనెత్తుతూ ఉండేవారు. తాత్యా బాబాను 'మామా' అని పిలిచేవారు. నిజంగా వారి బాంధవ్యం అత్యంత సన్నిహితమయినది. బాబా శరీరంపై మామూలు కఫినీ వేసుకుని చంకలో సటకా పెట్టుకొని, చిలుముని పొగాకును తీసుకొని పైన ఉత్తరీయం వేసుకొని, బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉన్నారు. తరువాత తాత్యా జలతారు శెల్లానుబాబా ఒంటిపై వేసేవాడు. అటు తరువాత బాబా తన కుడిపాదం బొటనవ్రేలుతో ధునిలోని కట్టెలను ముందుకు త్రోసి, కుడిచేతితో మండుతున్న దీపాన్ని ఆర్పి, చావాడికి బయలుదేరేవారు. అన్ని వాయిద్యాలు మ్రోగేవి; మతాబు, మందుసామానులు అనేక రంగులు ప్రదర్శిస్తూ కాలేవి. పురుషులు, స్త్రీలు బాబా నామాన్ని పాడుతూ మృదంగం. వీణలసహాయమ్తో భజన చేస్తూ ఉత్సవంలో నడుస్తుండేవారు. కొందరు సంతోషంలో నాట్యంచేస్తూ ఉన్నారు. కొందరు జెండాలను చేత పట్టుకుంటుండే వారు. బాబా మసీదు మెట్లపైకి రాగా భాల్దారులు 'శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై!' అని కేకలు పెడుతూ ఉన్నారు. బాబాకి ఇరుపక్కల చామరాలు మొదలినవి పట్టుకుని విసురుతూ ఉన్నారు. మార్గమంతా అడుగులకు మడుగులు పరిచేవారు. వాటిపై బాబా భక్తుల నడిచేవారు. తాత్యా ఎడమచేతిని, మహాల్సాపతి కుడిచేతిని, బాపు సాహెబుజోగ్ శిరస్సుపై ఛత్రాన్ని పట్టుకునే వారు. ఈ ప్రకారంగా బాబా చావాడికి ప్రయాణమవుతుండేవారు.

 

 

 



బాగా, పూర్తిగా అలంకరించిన ఎర్రగుఱ్ఱం శ్యామకర్ణ దారి తీస్తూ ఉంది. దాని వెనుక పాడేవారు, భజన చేసేవారు, వాయిద్యాలు మ్రోగించేవారు, భక్తుల సమూహం ఉండేది. హరినానస్మరణతోనూ, బాబా నామస్మరణతోనూ ఆకాశం బ్రద్దలయ్యేలా మారు మ్రోగుతూ ఉంది. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవంలో పాల్గొనే వారందరూ ఆనందిస్తూ ఉన్నారు. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడివైపు ముఖం పెట్టి నిలబడి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగేవారు. వారి ముఖం ఉదయసంధ్యలా లేదా బాలభానునిలా ప్రకాశిస్తూ ఉంది. అక్కడ బాబా ఉతరంవైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలబడేవారు. వారెవరినో పిలుస్తున్నట్టు కనిపించేది. సమస్త వాయిద్యాలు మ్రోగుతున్నప్పుడు బాబా తన కుడిచేతిని క్రిందకు మీదకు ఆడిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో కాకాసాహెబు దీక్షిత్ ముందుకు వచ్చి, ఒక వెండిపళ్ళెంలో పువ్వులు గులాల్ పొడిని తీసుకుని బాబాపై అనేకసార్లు చల్లుతున్నారు. అలాంటి సమయంలో సంగీత వాయిద్యాలు వారి శక్తికొలది ధ్వనిస్తూ ఉన్నాయి. బాబా ముఖం స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశంతోనూ, సౌందర్యంతోనూ, వెలుగుతూ ఉంది. అందరు ఆ ప్రకాశాన్ని మనసారా గ్రోలుతూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని ఆ శోభను వర్ణించడానికి మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆ ఆనందాన్ని భరించలేక మహాల్సాపతి దేవత ఆవహించినవాడిలా నృత్యం చేసేవాడు.

 

 

 



కాని బాబా యొక్క ధ్యానం ఏమాత్రం చెదరక ఉండేది. చేతిలో లాంతరు పట్టుకొని తాత్యాపాటీలు బాబాకు ఎడమపక్క నడుస్తూ ఉన్నారు. భక్తమహల్సాపతి కుడివైపు నడుస్తూ బాబా శెల్లా అంచును పట్టుకునేవారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయంగా ఉండేది. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకి ఉత్సవాన్ని చూడడానికి పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుతూ ఉన్నారు. బాబా నెమ్మదిగా నడుస్తూ ఉన్నారు. భక్తిప్రేమాలతో భక్తమండలి బాబాకి ఇరుపక్కలా నడుస్తూ ఉండేవారు. వాతావరణం అంతా ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుతూ ఉండేవి. ఆ దృశ్యం, ఆ కాలం గడిచిపోయినాయి. ప్రస్తుతంగాని, ఇకముందుగాని ఆ దృశ్యాన్ని కనలేము. ఐనా ఆ దృశ్యం జ్ఞాపకం తెచ్చుకుని భావన చేసినట్లయితే మనస్సుకు శాంతి తృప్తి కలుగుతుంది.

 

 

 



చావాడిని చక్కగా అలంకరిస్తూ ఉండేవారు. దాన్ని తెల్లని పైకప్పుతోనూ, నిలువు అద్దాలతోనూ, అనేక రంగుల దీపాలతోనూ, వ్రేలడగట్టిన గాజుబుడ్డీలతోనూ అలంకరిస్తూ ఉండేవారు. చావడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనం వేసి బాలీసు నుంచి బాబాను కూర్చేబెట్టి మంచి అంగరఖా తొడగించిన తరువాత భక్తులు బాబాను వేయి విధాలా పూజిస్తూ ఉన్నారు. బాబా తలపై తురాయి కిరీటము పెట్టి, పువ్వుల మాలలు వేసి, మెడలో నగలు వేస్తుండేవారు. ముఖానికి కస్తూరి నామాన్ని, మధ్యన బొట్టు పెట్టి మనఃస్ఫూర్తిగా బాబావైపు హృదయానందకరంగా చూసే వారు. తలపై కిరీటం అప్పుడప్పుడు తీస్తూ ఉండేవారు. లేకపోతే బాబా దాన్ని విసిరివేస్తారని వారి భయం. బాబా భక్తుల అంతరంగాన్ని గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేవారు. వారు చేసేదానికి అభ్యంతరం పెట్టేవారు కాదు. ఈ అలంకారంతో బాబా అమిత సుందరంగా కనిపిస్తూ ఉండేవారు.

 

 

 



నానాసాహెబు నిమోన్ కర్ గిర్రున తిరిగే కుచ్చుల ఛత్రాన్ని పట్టుకుంటూ ఉండేవారు. బాపూసాహెబు జోక్ ఒక వెండి పళ్ళెంలో బాబా పాదాలను కడిగి, ఆర్ఘ్యపాద్యాల అర్పించి చేతులకు గంధము పూసి, తాంబూలం ఇస్తుండేవారు. బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్యా మొదలైన భక్తులు వారి పాదాలకు నమస్కరిస్తూ ఉండేవారు. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరాలతోనూ, విసినకర్రలతోనూ విసురుతూ ఉండేవారు. అప్పుడు శ్యామా చిలుము తయారుచేసి, తాత్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకి ఇస్తుండేవారు. బాబా పీల్చిన తరువాత భక్త మహల్సాపతికి ఇచ్చేవారు. తరువాత ఇతరులకు లభిస్తూ ఉండేది. జడమైన చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తపఃపరీక్షలకి ఆగవలసి వచ్చింది. కుమ్మరులు దాన్ని త్రోక్కడానికి, ఎండలో ఆరబెట్టడానికి, నిప్పుల్లో కాల్చడం వంటివి సహించి చివరకి అది బాబా ముద్దుకు, హస్తస్పర్శకు నోచుకున్నది.

 

 

 


ఆ ఉత్సవం పూర్తి అయిన తరువాత భక్తులు పూలదండలను బాబా మేడలో వేసేవారు. వాసన చూడటానికి పువ్వులగుత్తులను చేతికి ఇచ్చేవారు. బాబా నిర్వ్యామొహం, అభిమానరాహిత్యాలకు అవతారం అవటం చేత ఆ అలంకరణలను గాని మర్యాదలను గాని లెక్కపెట్టేవారు కాదు. భక్తులలో గల అనురాగంతో, వారి సంతోషం కోసం వారి ఇష్టానుసారం చేయడానికి ఒప్పుకునే వారు. ఆఖరుకు బాపూసాహెబు జోగ్ సర్వలాంచనాలతో హారతి ఇచ్చేవారు. హారతి సమయంలో బాజాభజంత్రీ మేళతాళాలు స్వేచ్ఛగా వాయించేవారు. హారతి ముగిసిన తరువాత భక్తులు ఆశీర్వాదం పొంది బాబాకు నమస్కరించి ఒకరి తరువాత ఒకరు తమతమ ఇళ్ళకు వెళ్తుండేవారు. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన తరువాత తాత్యా ఇంటికి వెళ్ళడానికి లేవగా, బాబా ప్రేమతో అతనితో ఇలా అన్నారు. "నన్ను కాపాడు. నీకిష్టం ఉంటే వెళ్ళు కాని రాత్రి ఒకసారి వచ్చి నా గురించి కనుక్కుంటూ ఉండు''. అలాగే చేస్తాను అంటూ తాత్యా చావడి విడచి గృహానికి వెళ్ళేవారు. బాబా తన పరుపును తానే అమర్చుకునేవారు. 50,60 దుప్పట్లను ఒకదానిపై ఒంకొకటి వేసి దానిపై నిద్రించేవారు.
మనం కూడా ఇప్పుడు విశ్రమిద్దాము. ఈ అధ్యాయాన్ని ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు సాయిబాబాను, వారి చావడి ఉత్సవాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి.

 

ముప్పైఏడవ అధ్యాయము సంపూర్ణం
*** ఐదవరోజు పారాయణ సమాప్తం ***